Mega solar power plant
-
రైతన్నకు సౌరశక్తి.. తొలి అడుగు పడింది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతులకు శాశ్వత ప్రాతిపదికన ఉచిత విద్యుత్ అందించేందుకు తొలి అడుగు పడింది. వచ్చే 30 ఏళ్లపాటు నిరంతరాయంగా వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగించే దిశగా ప్రభుత్వం ప్రతిష్టాత్మక మెగా సోలార్ ప్రాజెక్టును పట్టాలపైకి తెచ్చింది. రైతన్నకు మరింత ఊతం ఇవ్వబోతున్న ఈ మెగా సోలార్‌తో... యూనిట్ కేవలం రూ.2.48కే అందబోతోంది. ఫలితంగా మొదటి సంవత్సరంలోనేరూ.3,836 కోట్లు ఆదా అవుతాయి. మొత్తంగా వచ్చే 30 ఏళ్లలో ఈ మెగా సోలార్‌తో ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.1.2 లక్షల కోట్లు ఆదా కాబోతోంది. ఏటా 14వేల మిలియన్ యూనిట్లు వ్యవసాయానికి పగటిపూట 9 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ అందించాలంటే ఏటా దాదాపు 14 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం. ఇందుకయ్యే వ్యయాన్ని ప్రభుత్వం సబ్సిడీగా డిస్కమ్‌లకు అందిస్తోంది. గతంలో డిస్కమ్‌లకు ఈ సబ్సిడీ చెల్లింపులు అరకొరగానే ఉండేవి. దీంతో విద్యుత్ సంస్థలు భారీ అప్పుల్లో కూరుకుపోయి మనలేని స్థితికి చేరాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక 2019–20లో దాదాపు రూ.17,900 కోట్లు విద్యుత్ సంస్థల చేతికందేలా చర్యలు తీసుకుంది ఇక ఈ ఏడాది సబ్సిడీ దాదాపు రూ.9 వేల కోట్లకు చేరింది. ఇలా పెరుగుతున్న సబ్సిడీకి కారణం టీడీపీ ప్రభుత్వంలో అడ్డగోలుగా, భారీ ధరలకు చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలే. మరి దీన్ని నియంత్రించటమెలా? ఎక్కడో ఒకచోట కళ్లెం వేయకపోతే భవిష్యత్తు భయంకరంగా తయారవుతుంది కదా? ఇదే ఉద్దేశంతో సబ్సిడీ భారాన్ని నియంత్రించడానికి కదిలిన ప్రభుత్వం.. వ్యవసాయానికి చౌక విద్యుత్ అందించడానికి 6,400 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తిని చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు రూ.50 వేల కోట్ల పెట్టుబడి కావాలి. అందుకే ‘బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (బీవోటీ)’ పద్ధతిలో మెగా సోలార్కు టెండర్లు పిలిచింది. నిర్మాణ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేయడానికి గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ టెండర్లు పిలవగా... ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉండేందుకు ప్రభుత్వం ముందే టెండర్ డాక్యుమెంట్లను న్యాయ సమీక్షకు పంపించింది. విద్యుత్ దిగ్గజాలు ఎన్టీపీసీ, టోరెంట్ పవర్, అదానీ సహా మరికొన్ని సంస్థలు పోటీపడ్డాయి. పది ప్రాంతాల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు మొత్తం 24 బిడ్లు వచ్చాయి. రివర్స్ టెండరింగ్ చేపట్టడం వల్ల సోలార్ విద్యుత్ యూనిట్ కనిష్టంగా రూ.2.48కే లభించే వీలు కలిగింది. టెండర్లను ఖరారు చేసిన గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్... రివర్స్ టెండరింగ్‌తో తొలి ఏడాదే రూ.3,836 కోట్ల ప్రజాధనం ఆదా అవుతున్నట్లు తెలియజేసింది. టీడీపీ అడ్డగోలు ఒప్పందాలు... విద్యుత్ నిర్వహణలో విద్యుత్ కొనుగోళ్ళే కీలకం. కాకపోతే 2014–19 మధ్య అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని పూర్తిగా విస్మరించింది. 2014లో రూ.33,500 కోట్లు ఉన్న విద్యుత్ రంగం అప్పులు... టీడీపీ ప్రభుత్వం అడ్డగోలుగా జరిపిన ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్ళు, అవినీతి కారణంగా 2019 మార్చి చివరినాటికి రూ.70,250 కోట్లకు చేరాయి. విద్యుత్ సంస్థల చెల్లింపులు రూ.2,893 కోట్ల నుంచి ఏకంగా రూ.21,500 కోట్లకు చేరాయి. విద్యుత్ పంపిణీ సంస్థలు రూ.19920 కోట్ల అప్పుల్లో కూరుకుపోయాయి. ప్రయివేటు సౌర, పవన విద్యుత్ కొనుగోళ్ళను తెలుగుదేశం అవసరానికి మించి ప్రోత్సహించి... సోలార్కు యూనిట్‌కు రూ. 5.25 నుంచి రూ.5.90 వరకూ చెల్లించేలా... అది కూడా పాతికేళ్ల పాటు అమల్లో ఉండేలా దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకుంది. అంతటితో ఆగకుండా ఆయా ప్రయివేటు విద్యుత్ సంస్థలు చెల్లించే ఆదాయపు పన్నును, ఎలక్ట్రిసిటీ డ్యూటీని తిరిగి వాళ్లకు రిఫండ్ ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది. ఇవి కూడా కలిపితే యూనిట్ విద్యుత్ ఖరీదు చాలా ఎక్కువ. ఫలితంగా విద్యుత్ సంస్థలపై మోయలేని భారం పడింది. పవన విద్యుత్‌కు యూనిట్‌కు రూ. 4.84 చొప్పున చెల్లించేలా ఏకంగా 41 విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) చేసుకుంది. ఈ ధరకు ఆదాయపు పన్ను, ఎలక్ట్రిసిటీ డ్యూటీ రీఫండ్ అదనం. పైపెచ్చు పవన, సౌర విద్యుత్ కోసం థర్మల్ విద్యుత్‌ను తగ్గించి, స్థిర ఛార్జీలు వృధాగా చెల్లించింది. చిత్రమేంటంటే టీడీపీ ప్రభుత్వం నామినేషన్లపై ఇలా ఏకపక్షంగా రూ.4.84 చెల్లించి పీపీఏలు చేసుకున్న సంవత్సరంలోనే... అంటే 2017లోనే గుజరాత్ ప్రభుత్వం టెండర్లు పిలిచి యూనిట్‌ను రూ.2.43కే కొనుగోలు చేసింది. దీన్నిబట్టే చంద్రబాబు ప్రభుత్వ అవినీతి ఏ స్థాయిలో ఉందో తేలిగ్గా అర్థమవుతుంది. తాజాగా మెగా సోలార్ ప్రాజెక్టులో భాగంగా యూనిట్ రూ.2.48కే వస్తుండటంతో... సబ్సిడీ కష్టాలకు చెక్‌పడి, రైతులకు శాశ్వతంగా ఉచిత విద్యుత్ అందనుంది. -
మెగా సౌర విద్యుత్ ప్రాజెక్టు.. బిడ్డింగ్ ప్రక్రియ కొనసాగించుకోండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా నిమిత్తం అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ కడప, ప్రకాశం జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 6,400 మెగావాట్ల అల్ట్రా మెగా సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీజీఈసీఎల్) ఆహ్వానించిన టెండర్ల విషయంలో హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. బిడ్డింగ్ ప్రక్రియను కొనసాగించుకోవచ్చునని గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్‌కు హైకోర్టు స్పష్టంచేసింది. బిడ్డర్లను సైతం ఖరారు చేసుకోవచ్చునని.. అయితే బిడ్డింగ్‌లో విజయం సాధించిన వారితో ఒప్పందాలు మాత్రం చేసుకోవద్దని ఆదేశించింది. తదుపరి విచారణ వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీజీఈసీఎల్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 15కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మంతోజు గంగారావు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. 6,400 మెగావాట్ల అల్ట్రా మెగా సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం ఏపీజీఈసీఎల్ జారీచేసిన రిక్వెస్ట్ ఫర్ సెలక్షన్ (ఆర్ఎఫ్ఎస్), విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ)లను సవాలు చేస్తూ టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ హైకోర్టును ఆశ్రయించింది. ఏపీజీఈసీఎల్ జారీచేసిన ఆర్ఎఫ్ఎస్, పీపీఏలు విద్యుత్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ టాటా పవర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై గురువారం న్యాయమూర్తి జస్టిస్ మంతోజు గంగారావు విచారణ జరిపారు. టాటా పవర్ తరఫున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి, ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఏపీజీఈసీఎల్ జారీచేసిన ఆర్ఎఫ్ఎస్, పీపీఏలు కేంద్ర విద్యుత్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. కేంద్ర విద్యుత్ చట్ట నిబంధనల ప్రకారం ఏదైనా వివాదం ఏర్పడితే, రెగ్యులేటరీ కమిషన్ వద్దకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. అయితే, ప్రభుత్వం ఇప్పుడు జారీచేసిన ఆర్ఎఫ్ఎస్, పీపీఏల్లో ఆ నిబంధనను తొలగించారని, ఏదైనా వివాదం తలెత్తితే ప్రభుత్వమే పరిష్కరిస్తుందని పేర్కొన్నారని ఆయన తెలిపారు. రైతుల కోసం తీసుకొస్తున్న ప్రాజెక్టు ఇది.. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, ఈ ప్రాజెక్టును రైతుల కోసం తీసుకొస్తున్నామని తెలిపారు. ఇందులో విస్తృత ప్రజా ప్రయోజనాలు ఉన్నాయని, రైతులకు నిరంతరాయంగా విద్యుత్‌ను అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని వివరించారు. అసలు టెండర్ ప్రక్రియలో టాటా పాల్గొనలేదన్నారు. టెండర్లలో పాల్గొన్న వారికి లేని అభ్యంతరం టాటా పవర్‌కు ఎందుకుని ప్రశ్నించారు. ఏదో రకంగా ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు ఉందని వివరించారు. టెండర్ ప్రక్రియ ముగిసిన తరువాత చివరిలో అర్ధరహితమైన అభ్యర్థనతో టాటా పవర్ హైకోర్టును ఆశ్రయించిందన్నారు. అసలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి వారికున్న అర్హత ఏమిటో చెప్పలేదన్నారు. చట్ట నిబంధనలకు లోబడే ఆర్ఎఫ్ఎస్, పీపీఏ ఉన్నాయని శ్రీరామ్ తెలిపారు. అసలు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరంలేదని, తదుపరి విచారణకల్లా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తానని ఆయన కోర్టుకు నివేదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. టెండర్ల ప్రక్రియను యథాతథంగా కొనసాగించుకోవచ్చునని, బిడ్డర్లను ఖరారు చేసుకోవచ్చునన్నారు. అయితే.. ఒప్పందాలు మాత్రం చేసుకోవద్దంటూ ఉత్తర్వులు జారీచేశారు. -
దొనకొండలో మెగా సౌర విద్యుత్ ప్లాంట్!
దొనకొండ: ప్రకాశం జిల్లా దొనకొండలో వెయ్యి మెగావాట్ల మెగా సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందించేందుకు ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా పదివేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో దొనకొండలో వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం సుమారు ఐదువేల ఎకరాలు అవసరమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెడ్‌క్యాప్ సంస్థ బృందం ఈ ప్రాంతంలో భూముల పరిశీలన చేపట్టింది. దొనకొండలో 25,086 ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నట్టు రెవెన్యూ శాఖ సర్వే ద్వారా గుర్తించారు. ఇందులో వద్దిపాడులోని సర్వే నంబర్ 52, 54, 58, పోచమక్కపల్లి సర్వే నంబర్ 71, 72, రుద్రసముద్రంలో సర్వే నంబర్ 262–64లో సుమారు ఐదువేల ఎకరాల ప్రభుత్వ భూములను నెడ్‌క్యాప్ బృందం పరిశీలించింది. సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసేందుకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుందని బృందం అభిప్రాయపడింది. నెడ్‌క్యాప్ డీజీఎం సీబీ జగదీశ్వరరెడ్డి, ప్రకాశం జిల్లా మేనేజర్ జి.బుచ్చిరాజు గతవారం ఈ భూములపై హైలెవెల్ టెక్నికల్ సర్వే నిర్వహించారు. సుమారు రూ.4 వేల కోట్లతో ఈ ప్లాంట్‌ను చేపట్టి ఏడాదిలో పూర్తి చేసి.. ఆ తరువాత ఏడాదికల్లా విద్యుత్ ఉత్పత్తి చేపట్టవచ్చని వారు తెలిపారు. ఈ ప్లాంటు పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉద్యోగాలు లభిస్తాయంటున్నారు. దీనిపై నెడ్‌క్యాప్ జిల్లా మేనేజర్ బుచ్చిబాబు మాట్లాడుతూ గురువారం ఒంగోలు కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ షన్మోహన్తో నెడ్‌క్యాప్ బృందం, దొనకొండ తహసీల్దార్, సర్వేయర్లు సమావేశం కానున్నారని, దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలిపారు. దొనకొండ తహసీల్దార్ కాలే వెంకటేశ్వరరావు కూడా ఇదే విషయాన్ని నిర్ధారించారు. -
మెగా సోలార్ పార్కుకు ఓకే
- తొర్మామిడిలో ఎన్టీపీసీ ప్రతినిధి బృందం స్థల పరిశీలన - 500 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు - 1300 ఎకరాలు కేటాయించాలని ఎన్‌హెచ్‌పీసీ లేఖ - టీఐఐసీకి స్థల బదలాయింపు పనుల్లో జిల్లా యంత్రాంగం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాకు మెగా సౌర విద్యుత్ ప్లాంట్ రానుంది. బంట్వారం మండలం తొర్మామిడిలో ఈ సోలార్‌పార్కును ఏర్పాటు చేసేందుకు నేషనల్ హైడల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) ముందుకొచ్చింది. 500 మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై గత ఏడాది నవంబర్‌లో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ), సోలార్ ఎనర్జీ కార్పొరేషన్, విద్యుత్ వ్యాపార్ నిగమ్(ఎన్వీవీ) సంస్థల ప్రతినిధులు తోర్మామిడిని సందర్శించారు. బొగ్గు, జల విద్యుత్ కేంద్రాలపై ఆధారపడడాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్న కేంద్ర సర్కారు సౌర విధానాన్ని ప్రకటించింది. ఈ క్రమంలోనే సౌర విద్యుదుత్పాదన దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే బంట్వారం అనుబంధ గ్రామమైన బస్వాపూర్ సర్వే నంబర్ 263లోని 1300 ఎకరాల విస్తీర్ణంలో సౌర విద్యుత్ ప్రాజెక్టుకు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. స్థల పరిశీలన జరిపిన ప్రతినిధి బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎన్‌హెచ్‌పీసీ మెగా సోలార్‌పార్కును నిర్మించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టీఐఐసీ)కు ఎన్‌హెచ్‌పీసీ లేఖ రాసింది. ఈ క్రమంలో తక్షణమే ఈ భూమిని బదలయించాలని ఆదేశిస్తూ ఆ సంస్థ జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావుకు స్పష్టం చేసింది.