మనందరి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి ఫలాలు ఇవాళ గ్రామ గ్రామాన ఇంటింటికీ చేరుతున్నాయి. దీని వల్ల గతంలో మావోయిజం, వామపక్ష తీవ్రవాద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో సైతం స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అందరి మనసులు గెల్చుకుని, అండగా నిలబడ్డాం. తద్వారా శాంతిని, భద్రతను పెంచుకోగలిగాం.
– సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : ‘సమాజంలో దుష్టశక్తులను ఎదురిస్తున్నప్పుడు, శాంతిభద్రతలను కాపాడే విధుల్ని నిర్వహిస్తున్నప్పుడు ప్రాణాలను సైతం లెక్కచేయని మనందరి సైనికుడే పోలీసు సోదరుడు. శాంతిభద్రతలను కాపాడటంలో భాగంగా తనువు చాలించిన ప్రాణ త్యాగధనులకు సెల్యూట్ చేస్తున్నా..’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో శుక్రవారం ఆయన పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి.. పోలీసు అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ప్రతి ఒక్కరూ పవిత్రమైన సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నారని చెప్పారు.
విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో పోలీసు అమర వీరుల స్థూపానికి నమస్కరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
విధి నిర్వహణలో పోలీసులు అనుకోని సంఘటనలు ఎన్నింటినో ఎదుర్కొంటున్నారని తెలిపారు. వారికి సమాజం, ప్రభుత్వం తరఫున మనమంతా అండగా ఉండాలని, ఉంటామని స్పష్టం చేశారు. కర్తవ్యాన్ని దైవంగా భావించి 1959 అక్టోబర్ 21న చైనా సైనికులతో సాహసోపేత పోరాటంలో ప్రాణాలర్పించిన కరణ్‌సింగ్ స్ఫూర్తితో పోలీసు అమరవీరుల సంస్మరణ దినానికి 63 ఏళ్ల క్రితం నాంది పలికారన్నారు. అప్పటి నుంచి ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీసు అమర వీరుల్ని స్మరించుకుని, వారికి నివాళులు అర్పిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా అమర వీరులకు, త్యాగధనులైన పోలీసు కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తరఫున, ప్రభుత్వం తరఫున సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. సంవత్సర కాలంలో దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో దాదాపు 261 మంది పోలీసులు అమరులయ్యారని, ఇందులో రాష్ట్రానికి చెందిన వారు 11 మంది ఉన్నారని చెప్పారు. వీరిలో ముగ్గురు పోలీసులు కోవిడ్ సమయంలో చనిపోయారని తెలిపారు. వీరందరి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
6,511 పోలీసు ఉద్యోగాల భర్తీ
పోలీసులకు సంబంధించి ఇంకా చేయాల్సినవి.. పెండింగ్‌లో ఉన్నాయని తెలుసు. వారికి వీక్లీ ఆఫ్ ఇవ్వాలన్నది నా మనసులో మాట. ఈ మధ్య కాలంలో వీక్లీ ఆఫ్ అమలవుతోందా? అని డీజీపీని అడిగాను. సిబ్బంది కొరత వల్ల అనుకున్న స్థాయిలో దాన్ని అమలు చేయలేకపోతున్నామని చెప్పారు. వెంటనే 6,511 ఉద్యోగాలను భర్తీ చేసే దిశగా అడుగులు వేశాం.
పోలీసు శాఖ కష్టనష్టాలు తెలిసిన ప్రభుత్వంగా, వారి బాగోగుల మీద శ్రద్ధ పెట్టే ప్రభుత్వంగా శాఖలో సిబ్బంది కొరతను భర్తీ చేయడానికి, పని ఒత్తిడి తగ్గించడానికి భారీ నియామకాలకు అనుమతి ఇస్తూ జీవో జారీ చేశాం. ఈ స్థాయిలో పోలీసు ఉద్యోగాల భర్తీ గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ జరగలేదు. గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో కేవలం 2,700 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది.
మన ప్రభుత్వం చేపట్టిన కొత్త పోస్టుల భర్తీలో భాగంగా చిత్తూరు, ప్రకాశం, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఐఆర్ బెటాలియన్ దళాలు కూడా ఏర్పాటు చేయబోతున్నాం. పోలీసు శాఖకు అనుసంధానంగా ఉన్న హోంగార్డుల గౌరవ వేతనం కూడా మన హయాంలోనే పెంచాం. పోలీసు ఉద్యోగాలలో వీరికి రిజర్వేషన్లు కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.
రాష్ట్రంలో అక్కచెల్లెమ్మల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఇదే పోలీసు శాఖలో 16 వేల మంది చెల్లెమ్మలను మహిళా పోలీసులుగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటికే నియమించాం.
పోలీసు వ్యవస్థలో నూతన మార్పులు
దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీసు వ్యవస్థలో నూతన మార్పులు తీసుకొచ్చాం. దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం ప్రతి జిల్లాలో చేపట్టిన విషయం అందరికీ తెలుసు. రాష్ట్రంలో దాదాపు 1.33 కోట్ల మంది అక్కచెల్లెమ్మల ఫోన్లలో దిశ యాప్ డౌన్లోడ్ అయ్యింది. దాదాపు 1.17 కోట్ల అక్కచెల్లెమ్మల ఫోన్లలో దిశ యాప్ రిజిస్ట్రేషన్ కూడా పూర్తయ్యింది.
ఆపదలో ఉన్నామని 23,039 మంది అక్కచెల్లెమ్మలు దిశ యాప్ ద్వారా సమాచారమిస్తే పోలీస్ అన్నదమ్ములు వెంటనే వెళ్లి వారికి తోడుగా నిలబడ్డారు. 2,323 కేసులు పెట్టారు. 1,237 రెస్క్యూ ఆపరేషన్లు చేసి ఆపద జరగకముందే అక్కచెల్లెమ్మలను రక్షించారు. ఇలాంటి పరిస్థితులను రాష్ట్రంలో మొట్టమొదటిసారి చూస్తున్నాం. దిశ యాప్ ద్వారా పోలీసు సోదరుడు తనకు తోడుగా ఉన్నాడన్న భరోసా అక్కచెల్లెమ్మలకు కల్పించగలిగాం.
మహిళలు, పిల్లలు, అణగారిన వర్గాల భద్రతే లక్ష్యం
శాంతిభద్రతల పరిరక్షణ, మహిళలు, పిల్లలు, అణగారిన సామాజిక వర్గాల భద్రత మనకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలుగా ముందుకు అడుగులు వేస్తున్నాం. ఈ విషయంలో రాజీ పడొద్దని పోలీసు సోదరులందరికీ తెలియజేస్తున్నా.
ఈ రోజు ఒక దళిత మహిళ వనితమ్మ రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నారు. అంతకుముందు ఉన్న సుచరితమ్మ కూడా దళిత మహిళే. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు, అణగారిన వర్గాలకు ఎంతగా తోడుగా నిలిచిందో.. భవిష్యత్తులోనూ నిలవబోతోందని చెప్పడం కోసమే ఈ విషయం చెబుతున్నా.
పోలీసులకు వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డు
ఈ ఏడాది నుంచి పోలీసులకు కూడా రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత పురస్కారమైన వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డును అందించనున్నాం. ఆపదలో ఉన్న వారికి, నేరం సంభవించక మునుపే నిమిషాల్లోనే అక్కడకి చేరుకుని రక్షించే కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న ఐదుగురు పోలీసులను ఎంపిక చేసి ఈ అవార్డు ఇవ్వబోతున్నాం.
మూడేళ్లలో మెరుగుపడిన పోలీసుల పనితీరు
ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల పనితీరు గత మూడేళ్లలో మెరుగు పడింది. ఇందుకు ఓ చిన్న ఉదాహరణ.. మహిళలపై నేరాలకు సంబంధించి విచారణకు పట్టే సమయాన్ని గత ప్రభుత్వంలో కంటే గణనీయంగా తగ్గించగలిగాం. 2017లో 160 రోజులు పడితే.. 2018లో 164 రోజులు పట్టింది. మన ప్రభుత్వం వచ్చాక 2021లో అది 79 రోజులకు తగ్గింది. ఈ ఏడాదికి 42 రోజులకే తగ్గించగలిగాం.
తద్వారా దోషులను న్యాయస్థానం ముందు నిలబెట్టే ఒక గొప్ప మార్పు ఇవాళ రాష్ట్రంలో కన్పిస్తోంది. దీంతో పాటు గొప్ప జవాబుదారీతనం కూడా కన్పిస్తోంది. మన పోలీసులు తీసుకొచ్చిన మార్పు ఇది. మనం తీసుకున్న అనేక చర్యలతో ప్రజల్లో చైతన్యం (అవేర్‌నెస్ క్రియేట్) పెంచగలించాం. టెక్నాలజీలో మార్పులు తీసుకొచ్చి.. నేరానికి సంబంధించి ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించాం. ఫిర్యాదుదారుడికి తోడుగా నిలుస్తున్నాం కాబట్టే ఫిర్యాదులు పెరిగి.. నేరాలు తగ్గుముఖం పట్టాయి.
కష్ట సమయంలో గుర్తొచ్చే స్నేహితుడు పోలీస్
కష్ట సమయంలో మొదట గుర్తొచ్చే స్నేహితుడు పోలీస్. పోలీస్ సిబ్బంది పగలనక, రాత్రనక విధులు నిర్వర్తిస్తున్నారు. అటువంటి గొప్ప బాధ్యతలను నిర్వర్తిస్తున్న పోలీసుల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనేక చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ విప్లవాత్మక కార్యక్రమాలతో రాష్ట్రంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల సంఖ్య తగ్గింది. ఆయా ప్రాంతాల్లో యువత ఎక్కువగా జనజీవన స్రవంతిలో కలిసి అభివృద్ధి దిశగా పయనిస్తున్నారంటే.. అందులో పోలీసుల కృషి మరువలేనిది. ఏదైనా ప్రమాదం, ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు సహాయక చర్యలను అందించడంలోనూ పోలీసులు అంకిత భావంతో పని చేస్తున్నారు.
– తానేటి వనిత, రాష్ట్ర హోం శాఖ మంత్రి
సీఎం వైఎస్ జగన్ ప్రోత్సాహం మరువలేనిది
రాష్ట్రంలో పోలీసులు గురుతర బాధ్యతలను నిర్వర్తించడానికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న సహాయసహకారాలు, ప్రోత్సాహం మరువలేనివి. మతతత్వం, ఉగ్రవాదం, అసాంఘిక కార్యక్రమాలు, చాందసవాదం వంటి అనేక సమస్యలతో పోలీసులు నిరంతరం పోరాటం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మరింత సమర్థవంతంగా పనిచేసేలా సీఎం.. టెక్నాలజీని సమకూర్చారు. మన సైబర్ డేటా సెంటర్‌ను దేశం లోని అన్ని రాష్ట్రాలకు అనుసంధానిస్తూ పాస్‌వర్డ్‌ను అన్ని జిల్లాలకు అందజేశాం. తద్వారా ఎక్కడైనా ఆన్‌లైన్ మోసాలు జరిగితే నేరగాళ్లను సులువుగా గుర్తించడానికి వీలుంటుంది. సైబర్ కేసులను డీల్ చేయడానికి అనంతపురం పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ ఇస్తున్నాం. నాటుసారా నుంచి 80% గ్రామాలకు విముక్తి కల్పించాం. విశాఖ–ఒడిశా సరిహద్దుల్లో 7,500 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేశాం. ప్రభుత్వ సహకారంతో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తున్నాం.
– రాజేంద్రనాథ్‌రెడ్డి, డీజీపీ
‘అమరులు వారు’ పుస్తకం ఆవిష్కరణ
‘అమరులు వారు‘ అనే పుస్తకాన్ని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 11 మంది అమరులైన పోలీస్ కుటుంబాలకు ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత, ప్రభుత్వ ఇన్‌చార్జి ప్రధాన కార్యదర్శి విజయానంద్, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్, సీఐడీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్, ఆర్టీసీ వీసీ, ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు, అమరులైన పోలీసుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment