
ఎస్‌ఈసీ కార్యాలయంలో సీఎస్ నీలం సాహ్ని
సాక్షి, అమరావతి: కరోనా నియంత్రణకు దేశంలోనే అత్యుత్తమ స్థాయిలో అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని, ఈ సమయంలో ఎన్నికల నిర్వహణకు అనువైన వాతావరణం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన సమయంలో మార్చిలో రాష్ట్రంలో కరోనా కేసులు కేవలం 26 మాత్రమే ఉండగా తాజాగా 26,622 యాక్టివ్ కేసులున్నాయని మొత్తం 8,14,774 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనమని పేర్కొంది. ప్రభుత్వం వైరస్ నియంత్రణకు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా రోజుకు సగటున 20 వరకు మరణాలు నమోదవుతున్నాయని తెలిపింది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికల నిర్వహణకు అనువైన వాతావరణం లేదని పేర్కొంటూ సీఎస్ నీలం సాహ్ని బుధవారం సాయంత్రం ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను ఆయన కార్యాలయంలో కలసి నివేదిక ఇచ్చారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడ్డారని, విధి నిర్వహణలో ఉన్న 11 వేల మందికి పైగా పోలీస్‌లకు కోవిడ్ సోకిందని సీఎస్ నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. కోవిడ్ తీవ్రతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులు ఏర్పడగానే ఎన్నికల కమిషన్‌కు తెలియచేస్తామని పేర్కొన్నట్లు తెలిసింది. వైరస్ తీవ్రత అధికంగా ఉన్నందున ఈ సమయంలో ఎన్నికల నిర్వహణ సరికాదని తాజాగా నిమ్మగడ్డ నిర్వహించిన సమావేశంలో దాదాపు అన్ని పార్టీలు కూడా ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. అసలు ఎన్నికలు ఎలా నిర్వహిస్తారో ముందు ఎస్‌ఈసీ తేల్చి చెప్పాకే తమ అభిప్రాయాన్ని తెలియచేస్తామని పార్టీలు పేర్కొన్నాయి. టీడీపీ మినహా ఎవరూ ఈ సమయంలో ఎన్నికలకు మొగ్గు చూపలేదు.
ఉనికిలో లేని పార్టీలతో...
గుర్తింపు పొందిన పార్టీలంటూ రాష్ట్రంలో ఏమాత్రం ఉనికిలో లేని రాజకీయ పక్షాలను పిలిచి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సమావేశాలను నిర్వహించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. భేటీకి ఆహ్వానించిన 19 పార్టీల్లో 10 పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల పోటీలో కూడా లేకపోవడం గమనార్హం. ఒక్కో పార్టీ ప్రతినిధితో విడివిడిగా ఏకాంతంగా సమావేశాన్ని నిర్వహించిన ఎస్‌ఈసీ వేల సంఖ్యలో ప్రజలు గుమిగూడేందుకు అవకాశం ఉన్న స్థానిక ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావడం విస్మయం కలిగిస్తోంది. మరోవైపు నవంబర్‌లో కరోనా రెండో దశ వ్యాప్తి మొదలు కానుందనే భయాందోళనలున్నాయి. ఈ సమయంలో తక్షణమే ఎన్నికలంటూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడేలా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అంతా ఏకపక్షమే..
సంప్రదాయం ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంతో చర్చించి సంప్రదింపుల అనంతరం ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాల్సిన ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ మొక్కుబడి తంతుగా పార్టీలతో ఈ సమావేశాన్ని నిర్వహించింది. ప్రభుత్వం అభిప్రాయాన్ని తీసుకున్నాక అవసరమైన పక్షంలో అఖిలపక్ష భేటీ నిర్వహించాల్సి ఉండగా నిమ్మగడ్డ అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. అంతకుముందు స్థానిక ఎన్నికలను అర్థాంతరంగా వాయిదా వేసే సమయంలో కూడా నిమ్మగడ్డ ప్రభుత్వాన్ని సంప్రదించకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈసారి కూడా ఆయన అదే ధోరణిలో వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment