వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జిల తొమ్మిదో జాబితా విడుదల
ఒక పార్లమెంట్, రెండు అసెంబ్లీ స్థానాలకు ఇన్‌ఛార్జిల నియామకం
విజయసాయిరెడ్డికి నెల్లూరు ఎంపీ టికెట్
మంగళగిరి ఇన్‌ఛార్జిగా మురుగుడు లావణ్యకు బాధ్యతలు
రిటైర్డ్ ఐఏఎస్ ఇంతియాజ్‌కు కర్నూల్ అసెంబ్లీ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు
ఇప్పటిదాకా 9 జాబితాల్లో.. 74 అసెంబ్లీ స్థానాలకు, 21 పార్లమెంట్ స్థానాలకు సమన్వయకర్తల నియామకం/మార్పులు
సామాజిక సమీకరణాలు.. అభ్యర్థుల గెలుపోటముల్నే ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల ఎంపిక
ఎన్నికల కోసం దాదాపుగా అభ్యర్థుల్ని ఖరారు చేసినట్లేనని ప్రకటించిన పార్టీ అధినేత, సీఎం జగన్
సాక్షి, గుంటూరు: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా మార్పులు చేస్తున్న అధికార వైఎస్సార్‌సీపీ.. తొమ్మిదవ జాబితాను శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. మొత్తం మూడు స్థానాలకు ఇన్‌ఛార్జిల నియమిస్తూ లిస్ట్‌ను రిలీజ్ చేసింది. ఇందులో.. నెల్లూరు పార్లమెంటరీ స్థానం సమన్వయకర్తగా విజయసాయిరెడ్డిని నియమించింది.
అలాగే.. కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఇంతియాజ్(రిటైర్డ్ ఐఏఎస్), మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జిగా మురుగుడు లావణ్యను నియమించింది. మంగళగిరికి గతంలో గంజి చిరంజీవిని సమన్వయకర్తగా నియమించగా.. ఇప్పుడు ఆ స్థానంలో మార్పు చేసింది. ఇంతియాజ్ ఈ మధ్యే వీఆర్‌ఎస్ తీసుకుని వైఎస్సార్‌సీపీలో చేరారు.
తాజాగా మంగళగిరిలో జరిగిన వైఎస్సార్‌సీపీ కీలక సమావేశంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల కోసం పార్టీ తరఫున ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తైందని.. ఒకటిరెండు మార్పులు తప్పించి ఇప్పటిదాకా ప్రకటించిన ఇన్‌ఛార్జిలకే టికెట్లు దాదాపు ఖాయమని ప్రకటించారు.
ఇప్పటివరకు విడుదలైన తొమ్మిది జాబితాల వారీగా చూస్తే.. 74 అసెంబ్లీ స్థానాలకు, 21 పార్లమెంట్ స్థానాలకు ఇన్‌ఛార్జిల జాబితాల్ని వైఎస్సార్‌సీపీ విడుదల చేసింది . తొలి జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలకు, రెండో జాబితాలో మరో 27 స్థానాలకు(3 ఎంపీ, 24 అసెంబ్లీ), మూడో జాబితాలో 21 స్థానాలకు(6 ఎంపీ, 15 అసెంబ్లీ), నాలుగో జాబితాలో 8 స్థానాలకు(1 ఎంపీ, 8 అసెంబ్లీ), ఐదో జాబితాలో 7 స్థానాలకు(4 ఎంపీ, 3 అసెంబ్లీ స్థానాలకు) సమన్వయకర్తలను మారుస్తూ జాబితాలు విడుదల చేసింది వైఎస్సార్‌సీపీ.
ఆరో జాబితాలో 10 స్థానాలకు(4 పార్లమెంట్, 6 అసెంబ్లీ స్థానాలకు).. ఏడో జాబితాలో 2 అసెంబ్లీ స్థానాలకు, ఎనిమిదో జాబితాలో 5 (2 ఎంపీ, మూడు అసెంబ్లీ స్థానాలకు).. తాజాగా తొమ్మిదో జాబితాలో 3 స్థానాలకు(ఒకటి పార్లమెంట్, రెండు అసెంబ్లీ స్థానాలకు) సమన్వయకర్తలను నియమిస్తూ/మారుస్తూ జాబితాలు విడుదల చేసింది వైఎస్సార్‌సీపీ.
‘‘మొత్తం 175కు 175 సీట్లు మనం గెలవాలి. ఆ ప్రయత్నం చేద్దాం. ఆ మేరకు ఎక్కడైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే, పార్టీ బలంగా ఉండడం కోసం మార్పులు, చేర్పులు అవసరమవుతాయి. అందుకు మీరంతా సహకరించండి. రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు ఇస్తాం’’ అని సీఎం వైఎస్ జగన్ మొదటి నుంచి పార్టీ శ్రేణులకు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సామాజిక సమీకరణాలు.. అభ్యర్థుల గెలుపోటములను బేరీజు వేసుకున్న తర్వాతనే మార్పులు చేర్పులు చేసినట్లు పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment