గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో వరదల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ భారీ విరాళం ప్రకటించింది. వరద బాధితుల సహాయార్థం పార్టీ తరఫున కోటి రూపాయల విరాళం ఇవ్వాలని పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం జరిగిన పార్టీ సమావేశంలో ఈ ప్రకటన చేశారు.
కృష్ణా నదికి భారీ వరదలతో విజయవాడలో తలెత్తిన పరిస్థితిని నిన్న స్వయంగా వైఎస్ జగన్ సమీక్షించిన సంగతి తెలిసిందే. బాధితులతో మాట్లాడిన ఆయన.. వాళ్లకు అందుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. ఈ క్రమంలో ఇవాళ అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన ఆయన విరాళ ప్రకటన చేశారు.
‘‘వరద ముంచెత్తిన ప్రాంతాల్లో ప్రభుత్వం ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేపట్టడం లేదు. లక్షలాది మంది కనీసం ఆహారం, మంచినీరు కూడా దొరక్క నానా ఇబ్బంది పడుతున్నారు’’ అని సమావేశంలో పలువురు నాయకులు జగన్‌కు తెలిపారు. కేవలం ప్రచార ఆర్భాటం తప్ప, వాస్తవంగా ఎలాంటి చర్యలు అక్కడ లేవన్నారు. వరద ప్రాంతాల్లో షో చేస్తూ, ఫోటోలకు ఫోజులు ఇస్తూ.. సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారని, అధికార యంత్రాంగమంతా ఆయనతో ఉంటూ, ప్రజల సమస్యలను గాలికొదిలేసిందని చెప్పారు. ఫలితంగా.. వరద బాధితులు అనారోగ్యం పాలవుతున్నా.. వారికి మందులు కూడా లభించడం లేదన్నారు.
జగన్ స్పందిస్తూ.. తన పర్యటనలో వరద బాధితుల పడుతున్న కష్టాలను స్వయంగా చూశానన్న జగన్.. వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని తెలిపారు. కూటమి ప్రభుత్వ ఘోర తప్పిదం వల్లనే వరదలు ముంచెత్తాయని.. అయినా నింద వైఎస్సార్‌సీపీపై మోపే ప్రయత్నం చేస్తున్నారని నేతలతో ఆయన అన్నారు. వరద బాధితుల కోసం పార్టీ తరపున కోటి రూపాయల సాయం ప్రకటిస్తున్నామని.. అది ఏ రూపంలో, ఎలా ఇవ్వాలనేది చర్చించి నిర్ణయం తీసుకుందామని నేతలతో జగన్ చెప్పారు.
ఈ సమావేశంలో.. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు మెరుగు నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కైలే అనిల్‌కుమార్, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కాపు కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ అడపా శేషు, పార్టీ నాయకుడు షేక్ ఆసిఫ్, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పార్టీ నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment