AP Budget 2023-24: బడ్జెట్‌ ప్రతిపాదనలపై కసరత్తు.. మార్గదర్శకాలు ఇవే | AP Government Is Exercise On The Budget Proposals For 2023 24 | Sakshi
Sakshi News home page

AP Budget 2023-24: బడ్జెట్‌ ప్రతిపాదనలపై కసరత్తు.. మార్గదర్శకాలు ఇవే

Published Wed, Nov 30 2022 11:18 AM | Last Updated on Wed, Nov 30 2022 11:20 AM

AP Government Is Exercise On The Budget Proposals For 2023 24 - Sakshi

సాక్షి, అమరావతి: అందుబాటులో ఉన్న వనరులను సమర్ధంగా వినియోగించుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు రాబట్టేలా 2023 – 24 ఆర్థిక ఏడాది బడ్జెట్‌ ప్రతిపాదనలు సమర్పించాలని ఆర్థిక శాఖ అన్ని శాఖలకు సూచించింది. ప్రాథమిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు, తాగునీరు, విద్య, ఆరోగ్యం, రహదారులు, రవాణా రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందిస్తోందని తెలిపింది.

ఈ నేపథ్యంలో బడ్జెట్‌ ప్రతిపాదనలు అందుకు అనుగుణంగా ఉండాలని సూచించింది. వేగంగా పారిశ్రామీకరణ ద్వారా ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచి లక్ష్యాలను సాధించేలా క్యాపిటల్‌ వ్యయం ప్రతిపాదనలు ఉండాలని పేర్కొంది. 2022–23 బడ్జెట్‌ అంచనాల సవరణ ప్రతిపాదనలను వాస్తవికంగా రూపొందించాలని సూచించింది. ఈమేరకు ఆన్‌లైన్‌లో ప్రతిపాదనలు సమర్పించేందుకు మార్గదర్శకాలతో ఆర్థిఖ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

శాఖాధిపతులు, బడ్జెట్‌ అంచనాల అధికారులు బడ్జెట్‌ ప్రతిపాదనల అంచనాలను డిసెంబర్‌ 10లోగా ఆన్‌లైన్‌లో సమర్పించాలి. సంబంధిత శాఖల కార్యదర్శులు తమ అభిప్రాయాలను జోడించి డిసెంబర్‌ 12లోగా ఆర్థికశాఖకు ఆన్‌లైన్‌లో పంపాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2023 – 24 బడ్జెట్‌ అంచనాల రూపకల్పనకు సంబంధించి ఆర్థిక శాఖ బుధవారం అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులతో ప్రాథమిక సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

మార్గదర్శకాలు ఇవీ
నవ రత్నాలు, కేంద్ర పథకాలకు తగినన్ని నిధులు కేటాయింపులు ఉండేలా బడ్జెట్‌ ప్రతిపాదనలు సమర్పించాలి. నవరత్నాల పథకాల వారీగా శాఖాధిపతులు ఆన్‌లైన్‌లో నమూనా పత్రంలో బడ్జెట్‌ అంచనా ప్రతిపాదనలు చేయాలి. మేనిఫెస్టోలోని పథకాల అమలు వివరాలతో బడ్జెట్‌ అంచనాల ప్రతిపాదనలను చేయాలి. సామాజిక పెన్షన్లు, సబ్సిడీలకు తగినన్ని నిధులు ప్రతిపాదించాలి. 

కేంద్ర ప్రాయోజిత పథకాలు, రాష్ట్ర అభివృద్థి పథకాలు, విదేశీ సాయంతో అమలు చేస్తున్న పథకాల వివరాలను ఆన్‌లైన్‌లో సంబంధిత పద్దుల్లో బడ్జెట్‌ కేటాయింపులను ప్రతిపాదించాలి.

బడ్జెట్‌ అంచనా ప్రతిపాదనలు వాస్తవిక వ్యయం, అవసరాల ఆధారంగా ఉండేలా  తగిన కసరత్తు చేయాలి. ఊహాజనితంగా, వాస్తవికతకు దూరంగా ప్రతిపాదనలు ఉండకూడదు.  ప్రస్తుత ఆరి్థక సంవత్సరం సవరించిన అంచనాలు, వచ్చే ఆరి్థక ఏడాది బడ్జెట్‌ ప్రతిపాదనల మధ్య భారీ వ్యత్యాసం ఉంటే అందుకు సహేతుక కారణాలను కచ్చితంగా వివరించాలి.

పరిపాలనా వ్యయానికి సంబంధించి అద్దెలు, వాహనాలు, కార్యాలయాల నిర్వహణ సంబంధిత బడ్జెట్‌ ప్రతిపాదనలను గత మూడేళ్ల వాస్తవ గణాంకాలతో పంపించాలి.

నీటి చార్జీలు, విద్యుత్‌ చార్జీలను రెండుగా విభజించి కొత్త పద్దు కింద ప్రతిపాదించాలి. విద్యుత్‌ చార్జీలను ఇంధన శాఖ బడ్జెట్‌లో పొందుపరచాలి. ప్లీడర్‌ ఫీజులు, న్యాయాధికారుల గౌరవ వేతనాలను న్యాయశాఖలో ప్రతిపాదించాలి.

నిష్ప్రయోజన వ్యయాలను నివారించడంతో పాటు జీతాలేతర వస్తువులపై వ్యయాన్ని విశ్లేషించి వచ్చే ఆర్థిక సంవత్సరంలో కనీసం 20% తగ్గించేలా అంచనా ప్రతిపాదనలుండాలి.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఉప ప్రణాళికలు రూపొందించాలి.

మహిళలు, పిల్లల కోసం అమలు చేసే పథకాలకు బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపు ప్రతిపాదనలు చేయాలి 

ప్రస్తుత పన్ను రేట్లు, చార్జీల ప్రకారమే ఆదాయ రాబడుల అంచనా ప్రతిపాదనలు చేయాలి. పన్నేతర ఆదాయంపై దృష్టి సారించాలి. పన్ను బకాయిల వసూళ్లకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.

కన్సల్టెంట్లు, ఔట్‌సోర్సింగ్, పదవీ విరమణ చేసిన ఉద్యోగులను పరిమితం చేయాలి. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఎటువంటి నియామకాలు చేపట్టరాదు. అత్యవసర వాహనాలు మినహా ఎటువంటి వాహనాలు కొనుగోలు చేయరాదు.
చదవండి: ఇప్పటం లోగుట్టు లోకేష్‌కు ఎరుక.. ఆర్కే తనదైన శైలిలో..  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement