
సాక్షి, అమరావతి: ప్రస్తుతం సాగులో ఉన్న ఖరీఫ్ పంటలకు కూడా ఉచిత పంటల బీమాను అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ–పంటలో నమోదు చేసుకున్న పంటలకే ఉచిత బీమాను పరిమితం చేయాలని నిర్ణయించింది. వ్యవసాయరంగ బీమా అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.101 కోట్ల వాటా ధనంతో ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీజీఐసీఎల్) ఏర్పాటుకు గతంలోనే ఉత్తర్వులు విడుదల చేసింది. కొన్ని నిబంధనలు పూర్తికావాల్సి ఉన్నందున ఆ సంస్థ పెండింగ్‌లో ఉన్నప్పటికీ గత ఏడాది గుర్తించిన వ్యవసాయ, ఉద్యాన పంటలకు బీమాను అమలు చేసింది.
రాష్ట్రంలో ఏయే జిల్లాల్లో ఏయే పంటలకు దిగుబడి, వాతావరణ ఆధారిత బీమాను అమలు చేయాలో జాబితాలను విడుదల చేసింది. జనరల్ క్రాప్ ఎస్టిమేషన్ సర్వే (జీసీఈఎస్) ఆధ్వర్యంలో నిర్వహించే నిర్దేశిత పంట కోత ప్రయోగాల ఆధారంగా దిగుబడి ఆధారిత పంటల బీమా క్లెయిమ్స్‌ను పరిష్కరిస్తారు. వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద క్లెయిమ్స్‌ను ఏపీఎస్‌డీపీఎస్‌గానీ, గుర్తించిన ఐఎండీ వాతావరణ కేంద్రాలుగానీ, రాష్ట్ర ప్రభుత్వ మండల స్థాయి రెయిన్ గేజ్ స్టేషన్లుగానీ ఇచ్చే సమాచారం ఆధారంగా పరిష్కరిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment