సాక్షి,విజయవాడ:సీఎం చంద్రబాబు దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం(WEF) టూర్ పబ్లిసిటీ కోసం కూటమి ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది. దావోస్ టూర్‌కు భారీ ప్రచారానికి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. డబ్బులిచ్చి మరీ పబ్లిసిటీ చేయించుకోవాలని బాబు సర్కారు నిర్ణయించింది.
జాతీయ బిజినెస్ టీవీ చానల్ సీఎన్‌బీసీ(CNBC) ద్వారా పబ్లిసిటీ కోసం రూ.కోటి 15 లక్షల రూపాయిలు కేటాయిస్తూ పరిపాలన అనుమతుల జీవోను ప్రభుత్వం శనివారం(జనవరి18) జారీ చేసింది.ఇప్పటికే ఎన్డీటీవి ద్వారా పబ్లిసిటీ రూ.74లక్షలు,డిజిటల్ మీడియాలో పబ్లిసిటీ కోసం బిజినెస్ టుడేకు రూ.60 లక్షల దాకా మంజూరు చేశారు.
రెండు ఛానళ్ల ద్వారా దావోస్‌లో చంద్రబాబు పబ్లిసిటీ కోసం సర్కారు రూ.2 కోట్లకుపైగా దుబారా చేస్తోంది. పెట్టుబడుల విషయంలో కేవలం చంద్రబాబును పొగడడం కోసమే ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
గతంలో టీడీపీ(TDP) ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో సహా చంద్రబాబు దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) సదస్సుకు వెళ్లారు. ప్రభుత్వం తరపున సీఎం, మంత్రులు వెళ్లాల్సిన సదస్సుకు కుటుంబ సభ్యులు అది కూడా ప్రత్యేక విమానం వేసుకుని వెళ్లడమేంటన్న విమర్శలు వచ్చాయి.
దావోస్ సమావేశాల్లో పాల్గొనేందుకు చంద్రబాబు శనివారం రాత్రి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ నెల 20 నుంచి ఐదురోజుల పాటు దావోస్‌లో జరిగే సమావేశాల్లో పాల్గొంటారు. దావోస్‌కు వెళ్లేందుకు చంద్రబాబు మంత్రులు లోకేష్, టీజీ భరత్ మరో ఐదుగురు ఉన్నతాధికారులు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. వీరందరికి సహాయకులుగా మరో 15 మంది దాకా దావోస్‌కు వెళ్లనున్నారు.
ఇదీ చదవండి: స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలను అవమానించిన బీజేపీ నేత
Comments
Please login to add a commentAdd a comment