AP: పారిశ్రామికవేత్తలుగా పొదుపు మహిళలు  | AP Government Plan To Provide Financial Assistance Of Saving Society Women | Sakshi
Sakshi News home page

AP: పారిశ్రామికవేత్తలుగా పొదుపు మహిళలు 

Published Sun, Aug 7 2022 3:29 AM | Last Updated on Sun, Aug 7 2022 2:21 PM

AP Government Plan To Provide Financial Assistance Of Saving Society Women - Sakshi

సాక్షి, అమరావతి: పొదుపు సంఘాల్లోని పేదింటి మహిళలను వారి సామర్థ్యం మేరకు చిన్న, మధ్యస్థాయి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. డ్వాక్రా కార్యక్రమాల్లో కనీసం మూడు నాలుగేళ్ల అనుభవం ఉండి, ఒకట్రెండు విడతలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాటిని సకాలంలో చెల్లించిన మహిళలు చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలు ఏర్పాటుచేసుకునేందుకు వీలుగా వారికి వ్యక్తిగతంగా ఒకొక్కరికి గరిష్టంగా రూ.10లక్షల వరకు రుణం ఇప్పించే ఏర్పాట్లుచేస్తోంది. 

పైలెట్‌ ప్రాజెక్టుగా ఈ ఏడాది డిసెంబరు నెలాఖరు నాటికి 575 మంది పొదుపు సంఘాల మహిళలకు రూ.10 లక్షల చొప్పున వ్యక్తిగత రుణాలు ఇచ్చేందుకు బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ ఇప్పటికే ముందుకొచ్చింది. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సంఘం ఆధ్వర్యంలో మిగిలిన బ్యాంకులు కూడా ఈ తరహా రుణాలిచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) అధికారులు వెల్లడించారు. ఇక ఎస్‌బీఐ ఈ ఏడాది డిసెంబరు నాటికి లక్ష్యంగా పెట్టుకున్న 575 మందిలో ఈ ఆగస్టు 15న 75 మందికి ప్రాథమికంగా రుణ మంజూరు పత్రాలను అందజేయనుంది. 

తర్వాత దశలో.. రాష్ట్రంలోని ప్రతి పొదుపు సంఘం నుంచి ఇద్దరేసి చొప్పున మహిళలకు ఆర్థిక లావాదేవీలపై శిక్షణనిస్తారు. అనంతరం వారు పూర్తిస్థాయి వ్యాపారస్తులు లేదా చిన్న పరిశ్రమల యజమానులుగా ఎదిగేందుకు అవసరమైన మొత్తాన్ని వ్యక్తిగతంగా బ్యాంకుల నుంచి రుణాలను ఇప్పించాలన్నది సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యమని అధికారులు వెల్లడించారు. 

ఆరు కీలక అంశాల్లో శిక్షణ..
యువ పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇవ్వడంలో దేశంలోనే అగ్రగామి సంస్థగా పేరున్న నేషనల్‌ అకాడమీ ఫర్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌ఏఆర్‌యూడీఎస్‌ఈటీఐ)కు చెందిన నిపుణుల ద్వారా ప్రతి సంఘంలో ఇద్దరు మహిళలకు ఆర్థిక వ్యవహారాలపై సమగ్ర శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా.. ఆర్థిక ప్రణాళిక, పొదుపు ప్రక్రియలో ఆధునిక పద్ధతులు, రుణాలు పొందడం, బీమాపై అవగాహన, డిజిటల్‌ లిట్రసీ, వృద్ధాప్య దశలో ఆర్థిక భద్రత.. తదితర అంశాలపై శిక్షణనిస్తారు. 

ఇప్పటిదాకా వ్యవసాయ అవసరాలకే వినియోగం..
మరోవైపు.. పొదుపు సంఘాల పేరుతో మహిళలు తీసుకుంటున్న రుణాల్లో 60–65 శాతం మేర వ్యవసాయ ఆధారిత అవసరాలకే ఉపయోగించుకున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. గత ఆర్థిక సంవత్సరంలో కూడా గ్రామీణ ప్రాంతంలోని పొదుపు మహిళలు బ్యాంకుల నుంచి రూ.18,006.36 కోట్లు రుణం పొందారు. ఇందులో  రూ.11,045 కోట్లను వ్యవసాయ, అనుబంధ రంగాల్లో వినియోగించుకున్నట్లు తేలింది. రూ.460.22 కోట్లను సేవా రంగ వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టగా, మరో రూ.1,398.48 కోట్లను వివిధ రకాల చిన్నపాటి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు. అలాగే, ఇంకో రూ.565.25 కోట్లతో కిరాణ షాపులు ఏర్పాటుచేసుకోగా, రూ.800 కోట్లు ఇతర రకాల వ్యాపారాల కోసం వినియోగించుకున్నట్లు తేలింది. 

99.6 శాతం మంది సకాలంలో చెల్లింపులు
ఇక మాజీ సీఎం చంద్రబాబు 2014 ఎన్నికలప్పుడు డ్వాక్రా రుణాలన్నీ మాఫీచేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేయడంతో డ్వాక్రా వ్యవస్థ అస్తవ్యస్థమైంది. దీంతో దీనిని గాడిలో పెట్టేందుకు ప్రస్తుత సీఎం జగన్‌ ప్రభుత్వం ఇప్పటికే పలు కార్యక్రమాలను అమలుచేస్తోంది. 2019 ఏప్రిల్‌ 11నాటికి పొదుపు సంఘాల పేరుతో మహిళలు తీసుకున్న రుణం మొత్తం రూ.25,516 కోట్లు. వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా నాలుగు విడతల్లో మహిళలకు నేరుగా ఈ మొత్తాన్ని అందజేసే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. 

ఇప్పటికే సగం మొత్తాన్ని రెండు విడతల్లో రూ.12,756 కోట్లను మహిళలకు అందజేసింది. దీనికితోడు సకాలంలో రుణాలు చెల్లించే మహిళల వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే భరించేలా వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టింది. దీంతో పొదుపు మహిళలు తాము తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తున్నారు. ఫలితంగా.. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో పొదుపు సంఘాల రుణ రికవరీ రేటు మన రాష్ట్రంలో 99.6 శాతం ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.  

ఆదాయం వచ్చేచోటే 50 శాతం పెట్టుబడి పెట్టాలి
పొదుపు సంఘాలకు అందజేసే రుణ విధానంలో ప్రభుత్వం మార్పులు చేసింది. ఇక నుంచి.. కొత్తగా పొదుపు సంఘాన్ని ఏర్పాటుచేసుకుని బ్యాంకు నుంచి తొలివిడత రుణం తీసుకోదలచిన వారికి సంఘం మొత్తానికి రూ.లక్షన్నర దాకా ఇచ్చేలా బ్యాంకులకు ఆదేశాలొచ్చాయి. అనంతరం.. ఈ మొత్తాన్ని చెల్లించిన వారికి రెండో విడతలో మూడు లక్షల దాకా రుణం పొందే వెసులుబాటు కల్పించాలని బ్యాంకులకు ఆర్‌బీఐ  ఆదేశాలిచ్చింది. అలాగే, సంఘాలు తీసుకునే రుణంలో కనీసం లక్ష రూపాయిలు లేదంటే 50 శాతం మేర విధిగా ఆదాయం వచ్చే మార్గాల్లో పెట్టుబడి పెట్టేలా చర్యలు చేపడతారు. 

ఇది కూడా చదవండి: ఏపీ వైపు ఐటీ దిగ్గజాల చూపు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement