ట్రిపుల్‌ ఐటీకి మహర్దశ | AP Government Planning To Development Of IIIT Ongole | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ ఐటీకి మహర్దశ

Published Sat, Sep 5 2020 1:26 PM | Last Updated on Sat, Sep 5 2020 1:26 PM

AP Government Planning To Development Of IIIT Ongole - Sakshi

సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లా రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం బలోపేతంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మౌలిక వసతులు, టీచింగ్, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది నియామకాలకు ప్రాధాన్యమిస్తోంది. ఇప్పటికే ఆంధ్రకేసరి ప్రకాశం విశ్వవిద్యాలయానికి డీపీఆర్‌  ప్రకటించిన ప్రభుత్వం తాజాగా శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీలకు పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి ట్రిపుల్‌ ఐటీల విద్యా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ మేరకు ఒంగోలులోని ట్రిపుల్‌ ఐటీలో బోధన, భోదనేతర సిబ్బంది నియామకానికి సెప్టెంబర్‌ 31న ఉన్నత విద్యాశాఖ జీవో నంబర్‌ 30ని విడుదల చేసింది. దీనికి అనుగుణంగా త్వరలో నోటిఫికేషన్‌ను కూడా వెలువరించనున్నారు. ఒంగోలు ట్రిపుల్‌ ఐటీలో 210 టీచింగ్, 89 నాన్‌ టీచింగ్‌ పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం డిప్యుటేషన్‌ మీద కొందరు, కాంట్రాక్టు ప్రాతిపదికన కొందరు విధులు నిర్వహిస్తున్నారు. టీచింగ్‌లో ప్రొఫెసర్, అసోషియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు.  

విద్యారంగ పటిష్టతకు చర్యలు.. 
ప్రస్తుతం ట్రిపుల్‌ ఐటీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఛాన్సలర్‌గా ప్రొఫెసర్‌ కేసీ రెడ్డి బాధ్యతలు చేపట్టాక, రాష్ట్రంలోని అన్ని ట్రిపుల్‌ ఐటీల ఉన్నతికి చర్యలు తీసుకుంటున్నారు. ఇక దివంగత ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో, పేదల ఉన్నత సాంకేతిక విద్యకు అవకాశాలు కల్పిస్తూ ఏర్పాటు చేసిన ట్రిపుల్‌ ఐటీల మీద గత ప్రభుత్వం శీతకన్ను వేసింది. కాగా, ప్రస్తుత ప్రభుత్వం పేద వర్గాల ఉన్నత విద్య పట్ల ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శిస్తూ కోట్లాది రూపాయలు కేటాయిస్తూ విద్యారంగాన్ని పటిష్టం చేస్తోంది. ఒంగోలు ట్రిపుల్‌ ఐటీలో మొత్తం ఆరువేల మంది విద్యార్థులు ఉండాల్సివుంది. అయితే గత కొన్నేళ్లుగా వైఎస్సార్‌ కడప జిల్లా ఇడుపులపాయలో ఒంగోలు ట్రిపుల్‌ ఐటీ తరగతులు నిర్వహిస్తున్నారు. గత ఏడాది నుంచి ఒంగోలులో తరగతులు ప్రారంభించగా, మొదటి సంవత్సర విద్యార్థులకు మాత్రమే ప్రస్తుతం తరగతులు ఇక్కడ నిర్వహిస్తున్నారు. రెండో సంవత్సరం నుంచి చివరి సంవత్సరం వరకు విద్యార్థులకు ఇడుపులపాయలో తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో 30ని అనుసరించి పోస్టులకు నోటిఫికేషన్‌ వేసి భర్తీ చేసే క్రమంలో పూర్తి స్థాయిలో ఒంగోలులో తరగతులు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని స్థానిక మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిలు అధికారులకు సూచనలు చేశారు.  

అడ్మిషన్లపై కసరత్తు.. 
ఈ ఏడాది 2020–21 విద్యా సంవత్సరం ప్రవేశాలకు త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పదవ తరగతి ఉత్తీర్ణత ఆధారంగా ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశాలు కల్పిస్తారు. జీపీఏ మెరిట్‌ ఆధారంగా గతంలో ప్రవేశాలు నిర్వహించేవారు. ఈ ఏడాది కోవిడ్‌–19 నేపథ్యంలో అందరికీ ఉత్తీర్ణ ధృవీకరణ పత్రాలు మంజూరు చేస్తున్నారు. మార్కులు ఇవ్వనందున ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రవేశాలు కల్పించే పరిస్థితులే అధికంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఒంగోలు ట్రిపుల్‌ ఐటీ పూర్తి స్థాయిలో విద్యార్థులకు అందుబాటులోకి రానుంది. ఈ విషయమై విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

త్వరలో సొంత భవనాల నిర్మాణం.. 
ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి, విద్యాశాఖమంత్రి డాక్టర్‌ సురేష్‌లు ట్రిపుల్‌ ఐటీల బలోపేతానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రకాశం ట్రిపుల్‌ ఐటీకి స్థలం కూడా మంజూరు చేశారు. త్వరలో నిర్మాణాలు కూడా ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో బోధన, బోధనేతర సిబ్బంది నియామకానికి కూడా నోటిఫికేషన్‌ వెలువరించనున్నారు. ఓ రకంగా ట్రిపుల్‌ ఐటీ ఈ ప్రాంత విద్యార్థులకు ఒక వరం. మన ప్రాంత విద్యావంతులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభించేందుకు ట్రిపుల్‌ ఐటీ తోడ్పాటుగా ఉంటుంది. మన ప్రాంత విద్యార్థులు ట్రిపుల్‌ ఐటీ విద్యను సద్వినియోగం చేసుకోవాలి.  
– డాక్టర్‌ సుధీర్‌ ప్రేమ్‌ కుమార్‌ డైరెక్టర్, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీ  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement