సాక్షి, అమరావతి: త్వరలో కరోనా వ్యాక్సిన్ వస్తుందన్న విషయాన్ని ఎన్నికల కమిషనర్ నమ్మడం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. కరోనా వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపింది. ఈ విషయాలను కేంద్ర ప్రభుత్వం చెబితేనే బాగుంటుందని, అందువల్ల తమ వ్యాజ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేరుస్తామని వివరించింది. ఎన్నికల కమిషనర్ దాఖలు చేసిన కౌంటర్‌కు సమాధానం ఇస్తామని, తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేయాలని కోరింది. ఇందుకు అంగీకరించిన హైకోర్టు విచారణను 22వ తేదీకి వేసింది. చదవండి: ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలు
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అక్టోబర్ 17న జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం శుక్రవారం మరోసారి విచారణకు వచ్చింది. ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్ స్పందిస్తూ, ఎన్నికల కమిషన్ కౌంటర్‌కు సమాధానమిస్తామని తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ రెండు, మూడు నెలల్లో రానున్నదని, ఈ వ్యాక్సిన్‌ను ప్రజలకు ఇచ్చేందుకు కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఆ కార్యక్రమంలో తలమునకలై ఉంటుందని వివరించారు. ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించవద్దనేందుకు తాము చెబుతున్న కారణాలు చాలా తీవ్రమైనవని సుమన్ వివరించారు. చదవండి: 29న మూడో విడత ‘వైఎస్సార్ రైతు భరోసా’
కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు
విధుల నిర్వహణలో తమకు పూర్తి సహాయ సహకారాలు అందించాలంటూ ఇచ్చిన ఆదేశాలను పాటించడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తదితరులను కోర్టు ధిక్కార నేరం కింద శిక్షించాలని కోరారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పూర్తి సహాయ, సహకారాలు అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment