సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరానికి 2017–18 ధరల ప్రకారం కేంద్రం నుంచి నిధులను రాబట్టి 2021 డిసెంబర్‌లోగా ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్ర ఆర్థిక శాఖ కొర్రీల నేపథ్యంలో నవంబర్ 2న సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహించేందుకు పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) అంగీకరించింది. పీపీఏ, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ), ఆర్‌సీసీ (సవరించిన అంచనా కమిటీ), కేంద్ర జల్ శక్తి శాఖ ఆమోదించిన మేరకు 2017–18 ధరల ప్రకారం భూసేకరణ, ఆర్‌ఆర్(రిహాబిలిటేషన్ రీసెటిల్‌మెంట్) ప్యాకేజీ కింద నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.28,172.207 కోట్లు అవసరమని పీపీఏ సర్వ సభ్య సమావేశంలో గుర్తు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కేంద్ర ప్రభుత్వం ఆమోదించి అమలులోకి తెచ్చిన భూ సేకరణ చట్టం–2013 ప్రకారం భూ సేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందనే అంశాన్ని గుర్తు చేయనుంది. భూ సేకరణ, ఆర్‌ఆర్ ప్యాకేజీ వ్యయం కంటే తక్కువగా 2013–14 ధరల ప్రకారం రూ.20,398.61 కోట్లుగా పోలవరం ప్రాజెక్టు నీటిపారుదల విభాగం వ్యయాన్ని నిర్ధారించి, ఆమోదించాలని కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదించడం సమంజసం కాదని తేల్చి చెప్పనుంది. రాష్ట్ర ప్రభుత్వం 2014 ఏప్రిల్ 1 నాటికి ప్రాజెక్టుపై చేసిన వ్యయం రూ.4,730.71 కోట్లు కాగా ఆ తర్వాత కేంద్రం రీయింబర్స్ చేసిన రూ.8,614.16 కోట్లు పోనూ మిగిలిన నిధులు రూ.7,053.74 కోట్లతో ప్రాజెక్టును ఎలా పూర్తి చేయాలని ప్రశ్నించాలని నిర్ణయించింది. విభజన చట్టం ప్రకారం వంద శాతం ఖర్చుతో పోలవరాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని, ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధులు విడుదల చేయాలని కోరనుంది.
కేంద్ర కేబినెట్‌లో సవరణ తీర్మానం..
పోలవరం అంచనా వ్యయాన్ని కేంద్ర జల్ శక్తి శాఖ ఇప్పటికే 2017–18 ధరల ప్రకారం ఆమోదించిన నేపథ్యంలో ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ లభిస్తుందని పీపీఏ వర్గాలు వెల్లడించాయి. జల్ శక్తి శాఖ ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ ఇచ్చాక ప్రాజెక్టును పూర్తి చేయడానికి రూ.47,725.74 కోట్లు విడుదల చేయాలని సూచిస్తూ కేంద్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపుతుంది. ఈ ప్రతిపాదనలను ఆర్థిక శాఖ కేంద్ర కేబినెట్‌కు పంపుతుందని పీపీఏ వర్గాలు వివరించాయి. 2013 – 14 ధరల ప్రకారం పోలవరం నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే విడుదల చేయడాన్ని ఆమోదిస్తూ 2017 మార్చి 15న చేసిన తీర్మానాన్ని సవరిస్తూ కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదనలు పంపుతారని, దీనికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేస్తుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. విభజన చట్టం సెక్షన్–90లో పేర్కొన్న మేరకు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధులను కేంద్రమే విడుదల చేయాల్సి ఉంటుందని పీపీఏ వర్గాలు పేర్కొంటున్నాయి.
క్లియరెన్స్ కోరుతూ ప్రతిపాదనలు..
పోలవరం సవరించిన అంచనా వ్యయాన్ని 2017–18 ధరల ప్రకారం రూ.55,548.87 కోట్లుగా సీడబ్ల్యూసీ టీఏసీ, పీపీఏ ఆమోదిస్తూ కేంద్రానికి నివేదిక ఇచ్చాయి. కేంద్ర జల్‌శక్తి శాఖ ఆర్థిక సలహాదారు, పీపీఏ సభ్యుడైన జగ్‌మోహన్ గుప్తా నేతృత్వంలోని ఆర్‌సీసీకి ఆ నివేదికను పంపింది. సీడబ్ల్యూసీ టీఏసీ, పీపీఏ ఎకరం భూమికి రూ.11.52 లక్షలను పరిహారంగా నిర్ణయిస్తే, ఆర్‌సీసీ దాన్ని రూ.10.91 లక్షలకు తగ్గించింది. దీంతో భూసేకరణ వ్యయం రూ.13,077.15 కోట్ల నుంచి రూ.10,199.67 కోట్లకు తగ్గింది. ఇక ఆర్‌ఆర్ ప్యాకేజీ వ్యయాన్ని సీడబ్ల్యూసీ రూ.20,091.09 కోట్లకు ఆమోదిస్తే, ఆర్‌సీసీ రూ.17,972.54 కోట్లకు తగ్గించింది. హెడ్ వర్క్స్, కుడి కాలువ, ఎడమ కాలువ, జల విద్యుదుత్పత్తి కేంద్రం వ్యయాన్ని సీడబ్ల్యూసీ రూ.22,470.64 కోట్లకు ఆమోదిస్తే దాన్ని ఆర్‌సీసీ రూ.19,445.53 కోట్లకు తగ్గించింది.
పీపీఏ నిర్వహణ ఖర్చులు రూ.108 కోట్లతో కలిపి ప్రాజెక్టుకు రూ.47,725.74 కోట్లు అవసరమని కేంద్ర జల్ శక్తి శాఖకు నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ యథాతథంగా ఆమోదించారు. గతంలో ఏదైనా ప్రాజెక్టుకు ప్రణాళికా సంఘం ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్(పెట్టుబడి అనుమతి) ఇచ్చేది. కేంద్రం ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేశాక ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ అధికారాన్ని ఆయా శాఖలకే కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో 2017–18 ధరల ప్రకారం పోలవరానికి రూ.47,725.74 కోట్లకు ‘ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్’ ఇవ్వాలని పీపీఏ ద్వారా కేంద్ర జల్ శక్తి శాఖకు ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment