సాక్షి, అమరావతి : ‘ఒకప్పుడు సాగు చేసే వారొకరు. కొనుగోలు కేంద్రంలో అమ్మేవారు మరొకరు. సాగు భూమి ఉన్నా, లేకున్నా.. సాగు చేసినా చేయకపోయినా వీఆర్వో సర్టిఫై చేస్తే చాలు.. షావుకార్లు, దళారీలు, ఏజెంట్ల ద్వారా మిల్లర్లు రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి జేబులు నింపుకునేవారు. కానీ ఇప్పుడలా కాదు. ప్రభుత్వ చర్యలతో ‘ఈ – పంట’ నమోదుతో దళారీ వ్యవస్థకు చెక్‌పడింది. సాగుదారులే అమ్ముకోవాలి. వారి ఖాతాలకే సొమ్ములు జమవ్వాలి. ఈ పంట నమోదు ఒక్క ధాన్యం కొనుగోలుకే కాదు.. ప్రభుత్వం అమలుచేసే సంక్షేమ ఫలాలన్నింటికీ వర్తింప చేసింది. ఈ వాస్తవాలన్నింటినీ ‘ఈనాడు’ పత్రిక విస్మరించి అసత్యాలు ప్రచారం చేస్తోంది’ అని వ్యవసాయ శాఖ అధికారులు, ఆ రంగం నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇస్తోన్న ప్రోత్సాహంతో వ్యవసాయం పండుగలా మార్చుకున్న రైతులను పక్కదారి పట్టించేలా రోజుకో తప్పుడు కథనాన్ని వండివార్చడమే పనిగా పెట్టుకుందని చెబుతున్నారు. నిత్యం రోత రాతలతో రైతులను అయోమయానికి గురి చేసేందుకు విఫలయత్నం చేస్తోందంటూ.. ఇదిగో వాస్తవాలు అంటూ వివరిస్తున్నారు.
ఇంతకంటే ‘రోత రాత’ ఉంటుందా?
‘రామచంద్రపురంలో గుణ్ణం వెంకటేశ్వరరావు అనే రైతు పదెకరాల్లో పంట సాగు చేస్తే మూడెకరాల్లోనే ఈ–పంట నమోదైందని, ధాన్యం అమ్ముదామని వెళ్తే డేటా లేదని రెండు నెలలుగా తిప్పించుకొని, చివరికి తామేం చేయలేమని చేతులెత్తేశారంటూ ‘ఈనాడు’ రాసుకొచ్చింది. వాస్తవానికి ఈయన 7.19 ఎకరాల్లో ఖరీఫ్ సాగు చేసినట్టుగా ఈ–పంటలో నమోదైంది. పంట కొనుగోలు యాప్‌లో అతని వివరాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఈ నెల 18న స్థానిక ఆర్బీకేలో ఇతను పండించిన 296 క్వింటాళ్ల ధాన్యాన్ని (ఎఫ్‌టీఒ నెం. 904390025 2200135) అమ్ముకున్నారు. ఈ వాస్తవాన్ని పట్టించుకోని ‘ఈనాడు’ ఈ–పంట నమోదు వల్ల ఈ రైతుకేదో అన్యాయం జరిగి పోయిందంటూ గగ్గోలు పెట్టింది. ఇలా తప్పుడు ఉదాహరణలతో రైతులను గందరగోళానికి గురిచేసి, ప్రస్తుత ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచడానికి విఫల యత్నం చేస్తోంది. తాము పండించిన పంటను ఆర్బీకేల వద్ద అమ్ముకోవడం ద్వారా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను ఎంతో మంది రైతులు పొందుతుంటే లేదు.. లేదంటూ ఈ వ్యవస్థపై విషం కక్కుతోంది. ఆర్బీకే వ్యవస్థకు పక్క రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రశంసలు వ్యక్తమవుతుంటే ‘ఈనాడు’ అవాస్తవాలను అచ్చేస్తోంది’ అని ఆధారాలతో సహా స్పష్టం చేశారు.
2.33 కోట్ల టన్నుల ధాన్యం సేకరణ
‘గతంలో సీజన్‌లో 2,500కు మించి కేంద్రాలుండేవి కాదు. అలాంటిది ప్రస్తుతం ప్రభుత్వం 7 వేలకు పైగా ఆర్బీకేల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కల్లాల నుంచే ధాన్యం కొనుగోలు చేస్తోంది. ఇవేమీ ఈనాడుకు కన్పించడం లేదు. ఈ–పంటలో నమోదైన రైతులకు ఈ–కేవైసీ జరగడం లేదని, ఈ కారణంగా రైతులకు అన్యాయం జరిగిపోతోందని అపోహలకు తావిచ్చేలా రాసుకొచ్చింది. నిజంగా ఈ–కేవైసీ జరగకపోతే గత మూడేళ్లలో ఈ–పంట నమోదు ఆధారంగానే రూ.43,550 కోట్ల విలువైన 2.33 కోట్ల టన్నులు ధాన్యాన్ని ప్రభుత్వం ఎలా సేకరించింది? గత ఖరీఫ్‌లో ఈ–కేవైసీ ఆధారంగా 40,30,969 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ప్రస్తుత రబీలో ఇప్పటి వరకు 14,76,828 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇంత పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోళ్లు జరుగుతుండటం ‘ఈనాడు’ కంటికి ఎందుకు కన్పించడం లేదు? గడిచిన ఖరీఫ్‌లో 112.26 లక్షల ఎకరాలు, రబీలో 52.94 లక్షల ఎకరాల్లో ఈ క్రాప్ బుకింగ్ జరిగింది. పైగా ఖరీఫ్‌లో 84 శాతం, రబీలో 80 శాతం ఈ కేవైసీతోనే పంటలు కొనుగోలు చేశారు’ అని వ్యవసాయ శాఖ పేర్కొంది.
ఈ వాస్తవాలూ కనిపించవా?
ఈ–పంట’ నమోదును రాష్ట్ర ప్రభుత్వం 2019 రబీ సీజన్ నుంచి అమలులోకి తెచ్చింది. రైతు భరోసా – యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ (ఆర్‌బీ అండ్ యూడీపీ) యాప్ ద్వారా వ్యవసాయ, ఉద్యాన, పట్టు, పశుగ్రాస పంటలతో పాటు సామాజిక వనాలను కూడా గ్రామ స్థాయిలో ఆర్బీకేల్లో పనిచేస్తోన్న వ్యవసాయ సహాయకుల ద్వారా నమోదు చేస్తున్నారు. రెవెన్యూ వెబ్ ల్యాండ్ డేటా ఆధారంగా భూ యజమాని వివరాలకు వాస్తవ సాగుదారుని వివరాలను నమోదు చేస్తున్నారు. క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం నిర్ధారించుకున్న తర్వాత ఆధార్ ఆధారంగా ఈ–కేవైసీ నమోదు చేస్తున్నారు. ప్రతి రైతుకు రసీదు ఇస్తున్నారు. ఈ పంట నమోదు వివరాలను సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ వద్ద ఉన్న పంట కొనుగోలు యాప్‌తో అనుసంధానిస్తున్నారు. ఈ–పంట రసీదునే ప్రామాణికంగా తీసుకొని పంట కొనుగోలుతో పాటు ఇతర సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. ఈ వాస్తవాలన్నీ రైతులందరికీ కనిపిస్తుంటే ఒక్క ఈనాడుకు మాత్రమే కనిపించడం లేదు కాబోలు.
సీజన్ ముగిసే వరకు ఈ–కేవైసీ నమోదు
‘ఈ పంటతో తంటా’ శీర్షికన ‘ఈనాడు’లో వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవం. ఈ పంట నమోదు ప్రారంభమైన తర్వాత కచ్చితమైన సాగుదారులెవరో గుర్తించగలిగాం. పైగా సీజన్ ముగిసే వరకు ఈ పంట నమోదు చేస్తున్నాం. రబీ పంట కాలానికి సంబంధించి ఈ నెల 25వ తేదీ వరకు ఈ పంట నమోదుకు అవకాశం ఉంది. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే ఆర్బీకేల్లో నమోదు చేసుకొని, ఈ–కేవైసీ చేసుకొని తమ పంటను అమ్ముకోవచ్చు. పంట కొనుగోలుతో పాటు సంక్షేమ ఫలాలను కూడా ఈ పంట ప్రామాణికంగానే అందిస్తున్నాం. ఈ ఏడాది ముందస్తుగా సార్వ పంట నమోదు ప్రారంభిస్తున్నందున 25వ తేదీ తర్వాత రబీ పంట నమోదును నిలిపి వేస్తాం. జూన్ 1వ తేదీ నుంచి ఖరీఫ్ పంట వివరాల నమోదు ప్రారంభిస్తున్నాం.
– చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ
Comments
Please login to add a commentAdd a comment