
సాక్షి, అమరావతి: కోవిడ్ ఉధృతి నేపథ్యంలో శాసనసభ, శాసనమండలి బడ్జెట్ సమావేశాలను గురువారం ఒక్కరోజే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కోవిడ్, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మార్చిలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించడానికి వీలు పడకపోవడంతో మూడు నెలలు (ఏప్రిల్ నుంచి జూన్) ఓటాన్ అకౌంట్‌కు ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టాల్సి ఉండటంతో గురువారం సమావేశాలు నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా ఆ రోజు ఉదయం 9 గంటలకు ఉభయసభల సభ్యులనుద్దేశించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ రాజ్‌భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్నారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ఉభయ సభలు ఆమోదం తెలుపుతాయి.
అనంతరం 2021–22 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీకి సమర్పిస్తారు. ఆ తర్వాత ద్రవ్య వినిమయ బిల్లుతోపాటు వివిధ శాఖల పద్దులు, ఆర్డినెన్స్‌ల స్థానే బిల్లులకు ఆమోదం తెలుపుతారు. కాగా.. కోవిడ్ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకొని ఒక్కరోజు మాత్రమే నిర్వహిస్తున్న అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment