సాక్షి, అమరావతి : ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ ఆ విధానాన్ని మరింత ప్రోత్సహించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాలకు అనుబంధంగా నేచురల్ ఫామింగ్ కస్టమ్ హైరింగ్ సెంటర్లను (ఎన్‌ఎఫ్–సీహెచ్‌సీ) ఏర్పాటుచేస్తోంది. ఏపీ రైతు సాధికారత సంస్థ (ఏపీ ఆర్‌వైఎస్‌ఎస్)–ఏపీ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫామింగ్ (ఏపీసీఎన్‌ఎఫ్) ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 3,500 పంచాయతీల్లో ఇప్పటికే ప్రకృతి సాగు ఉద్యమంలా సాగుతోంది.
విత్తు నుంచి కోత వరకు పాటించాల్సిన ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై ప్రత్యేక శిక్షణనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్‌బీకేలను ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాలుగా తీర్చిదిద్దనుంది. కూలీల కొరతకు చెక్ పెడుతూ.. పెట్టుబడి వ్యయాన్ని తగ్గించే లక్ష్యంతో వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాల పేరిట ఆర్‌బీకేలకు అనుబంధంగా సీహెచ్‌సీలను ఏర్పాటుచేస్తున్నట్లుగానే రసాయనాల వినియోగాన్ని తగ్గిస్తూ రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించేందుకు ప్రకృతి వ్యవసాయ సీహెచ్‌సీలను ఏర్పాటుచేస్తోంది.
ప్రకృతి సాగుచేసే రైతులతోనే..
ఇందులో భాగంగా.. తొలి విడతలో 2,996, రెండో విడతలో మరో 2,000 సీహెచ్‌సీలు ఏర్పాటుచేయబోతున్నారు. గ్రామాల్లో ప్రకృతిసాగు చేస్తూ 2–4 పాడి సంపద కల్గిన రైతు/రైతు సంఘాలను ఎంపికచేసి వారికి 40–50 శాతం సబ్సిడీతో రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఆర్థిక చేయూతనిస్తారు. ఎంపిక చేసిన రైతు క్షేత్రంలో కనీసం నాలుగు పశువులను ఉంచేందుకు వీలుగా షెడ్లు నిర్మిస్తారు. ఇక్కడ ఏర్పాటుచేసే సీహెచ్‌సీల్లో కషాయాలు, ఘన, జీవామృతాలు తయారుచేసే యంత్ర పరికరాలను అందుబాటులో ఉంచుతారు.
బహుముఖ వ్యూహంగా ప్రకృతి వ్యవసాయం
రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని బహుముఖ వ్యూహంగా ముందుకు తీసుకెళ్లాలన్న సీఎం వైఎస్ జగన్ సంకల్పం మేరకు ఆర్‌బీకేలకు అనుబంధంగా ఈ సీహెచ్‌సీలను ఏర్పాటుచేస్తున్నాం. ఎరువులు, పురుగులు, కలుపు మందుల వినియోగాన్ని క్రమేపి తగ్గిస్తూ దశల వారీగా రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు తీసుకెళ్లాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఊళ్లో ప్రకృతి సాగుచేసే రైతుల ఆధ్వర్యంలోనే వీటిని ఏర్పాటుచేయబోతున్నాం.
– కురసాల కన్నబాబు, వ్యవసాయ మంత్రి
ప్రతీ రైతూ ప్రకృతి సాగువైపు..
రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ఉద్యమంలా ప్రోత్సహించాలన్న సంకల్పంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గడిచిన మూడేళ్లలో నిర్దేశించిన లక్ష్యాలకు మించి రైతులను ప్రకృతి సాగువైపు మళ్లించగలిగాం. ప్రతీ రైతును ప్రకృతి సాగువైపు మళ్లించాలన్న లక్ష్యంతోనే ఆర్‌బీకేలకు అనుబంధంగా ఈ సీహెచ్‌సీలను తీసుకొస్తున్నాం. త్వరలోనే విధి విధానాలను రూపొందించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే వీటిని ఏర్పాటుచేయాలని భావిస్తున్నాం.
– టి. విజయకుమార్, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు, రైతు సాధికార సంస్థ
స్థానిక అవసరాలకనుగుణంగా యంత్ర పరికరాలు
► సీహెచ్‌సీల్లో కనీసం 200 లీటర్ల ఘన జీవామృతం తయారుచేసేందుకు వీలుగా కాంక్రీట్ మిక్సర్ ప్లాంట్లు, నీమ్ పల్వరైజర్, ఎస్‌ఎస్ హెవీ డ్యూటీ మిక్సర్ గ్రైండర్ ఏర్పాటుచేస్తారు.
► బోర్‌వెల్స్ కింద వరి సాగుచేసే ప్రాంతాల్లో ఏర్పాటుచేసే సీహెచ్‌సీల్లో బాటల విధానంలో విత్తేందుకు (లైన్ సోయింగ్) ఉపయోగించే ఎస్‌ఆర్‌ఐ మార్కర్స్, కలుపుతీతకు ఉపయోగించే డ్రాన్‌కోనో పరికరం, అన్నిరకాల స్ప్రేయర్లు, పవర్ వీడర్లను అందుబాటులో ఉంచుతారు.
► మెట్ట, వర్షాధార పంటలైన వరి, పత్తి, వేరుశనగ, శనగలు, కందులు వంటివి సాగుచేసే ప్రాంతాల్లో ఏర్పాటుచేసే సీహెచ్‌సీల్లో విత్తనాలు వేసేందుకు డ్రాన్‌డ్రమ్ సీడర్స్, ఎస్‌ఆర్‌ఐ మార్కర్, హ్యాండ్‌పుష్ సీడర్, సీడ్ బ్లర్స్, కోనో వీడర్స్, డ్రై ల్యాండ్ వీడర్లను ఏర్పాటుచేస్తారు.
► ఎన్‌ఎఫ్ సీహెచ్‌సీల్లో పవర్ వీడర్, బ్రష్ కట్టర్స్, చెప్‌కట్టర్స్, క్నాప్సక్, బ్యాటరీ, సోలార్, పవర్ స్పేయర్లను ఉంచుతారు.
Comments
Please login to add a commentAdd a comment