సాక్షి, అమరావతి: అత్యధికమందికి ఉపాధి కల్పించే ఎంఎస్‌ఎంఈ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ద్వారా వచ్చే రెండేళ్లలో కొత్తగా 2.50 లక్షల ఎంఎస్‌ఎంఈ యూనిట్లును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ ఏడాది 1.25 లక్షలు, వచ్చే ఏడాది 1.25 లక్షలు చొప్పున రెండేళ్లల్లో 2.5 లక్షల యూనిట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన ‘సాక్షి’కి వివరించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్‌ఎంఈ రంగాన్ని ప్రోత్సహించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపారు.
కొత్తగా ఏర్పాటయ్యే యూనిట్ల ద్వారా కనీసం రూ.15 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు కనీసం 1.80 లక్షల మందికి ఉపాధి కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుండటంతో యూనిట్ల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో జూన్ నెలలోనే 13 వేల యూనిట్లు ఏర్పాటు కావడమే దీనికి నిదర్శమన్నారు. గత ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలకు బకాయిపెట్టిన పారిశ్రామిక ప్రోత్సాహకాలను చెల్లించడంతోపాటు రెండేళ్లుగా క్రమం తప్పకుండా ప్రోత్సాహకాలు చెల్లిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడిందన్నారు.
రెండేళ్లలో ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ.2,086 కోట్లు చెల్లించడమే కాకుండా ఈ ఏడాది ఆగస్టులో ప్రోత్సహకాలను చెల్లించడానికి రంగం సిద్ధం చేస్తోందని చెప్పారు. కేవలం కొత్త యూనిట్లు ఏర్పాటు చేయడమే కాకుండా పాత యూనిట్లకు జీవితకాలం చేయూతనివ్వనున్నట్లు తెలిపారు. ఆయా యూనిట్ల రెండుమూడేళ్ల కాలానికి సంబంధించిన జీఎస్టీ రిటర్నులను పరిశీలించి ఉత్పత్తి తగ్గుతున్న యూనిట్లకు అండగా నిలిచేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
ఎంఎస్‌ఎంఈ రంగానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఎంఎస్‌ఎంఈ సీడీపీ, స్ఫూర్తి, పీఎంఈజీపీ పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేస్తోందని చెప్పారు. ఇందుకోసం వచ్చే రెండేళ్లలో ప్రతి జిల్లాలో ఎంఎస్‌ఎంఈ క్లస్టర్లను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రతి క్లస్టర్లో కనీసం 100 యూనిట్లు ఏర్పాటయ్యేలా ఈ ఏడాది రెండు క్లస్టర్లను అభివృద్ధి చేయాలని కలెక్టర్లను ఆదేశించినట్లు పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న ఎంఎస్‌ఎంఈలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను నియోజకవర్గ స్కిల్ హబ్స్ ద్వారా అందించే విధంగా కోర్సులను రూపొందిస్తున్నట్లు ఆమె తెలిపారు.
గత ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినా దానికి ఎటువంటి కార్యాలయాన్ని, నామినేటెడ్ కమిటీని ఏర్పాటు చేయలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాకే కార్పొరేషన్‌కు చైర్మన్‌ను, డైరెక్టర్లను నియమించింది. రాష్ట్రంలో సుమారు లక్ష ఎంఎస్‌ఎంఈలున్నాయి. కోవిడ్ వల్ల దెబ్బతిన్న ఇవి ఇప్పుడిప్పుడే తిరిగి కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి. గత ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్రోత్సాహకాలనూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే పూర్తిగా చెల్లించడంతో వాటికి భరోసా లభించింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ ఆర్థిక ప్రోత్సాహకాలను త్వరలోనే విడుదల చేస్తామని సీఎం జగన్ చెప్పారు. నాబార్డ్, సిడ్బీ, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ సంస్థ, ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్, ప్రపంచ బ్యాంక్, ఐక్యరాజ్య సమితి, ప్రపంచ వాణిజ్య సంస్థలు అందించే సాయాన్ని ఎంఎస్‌ఎంఈలకు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.
– వంకా రవీంద్రనాథ్, చైర్మన్, ఏపీ ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
ఘనంగా అంతర్జాతీయ ఎంఎస్‌ఎంఈ డే వేడుకలు
జూన్ 27న (నేడు) అంతర్జాతీయ ఎఎంఎస్‌ఎంఈ డే సందర్భంగా పరిశ్రమల శాఖ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోంది. రాష్ట్ర ఎంఎస్‌ఎంఈలను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించే విధంగా ఎంఎస్‌ఎంఈ గ్లోబల్ వాల్యూ చైన్ పేరుతో విశాఖలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని ఈ సదస్సులో పాల్గొననున్నారు. దీంతోపాటు ప్రతి జిల్లాలో ఎంఎస్‌ఎంఈలపై అవగాహన పెంచే విధంగా ఎంఎస్‌ఎంఈ సంఘాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఎంఎస్‌ఎంఈ రంగానికి చెందిన సమాచారమంతా ఒకేచోట లభించేలా ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్ పేరుతో ఒక వెబ్‌సైట్‌ను సోమవారం ప్రారంభించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment