ఇచ్చిపుచ్చుకున్నారు.. చంద్రబాబు క్విడ్‌ ప్రో కో గుట్టురట్టు | AP Govt Special Investigation Team Revealed Chandrababu Land Scam | Sakshi
Sakshi News home page

ఇచ్చిపుచ్చుకున్నారు.. చంద్రబాబు క్విడ్‌ ప్రో కో గుట్టురట్టు

Published Mon, May 15 2023 3:55 AM | Last Updated on Mon, May 15 2023 2:29 PM

AP Govt Special Investigation Team Revealed Chandrababu Land Scam - Sakshi

సాక్షి, అమరావతి: కృష్ణా నది కరకట్టపై చంద్రబాబు నివాసం.. అమరావతిలో చంద్రబాబు క్విడ్‌ ప్రోకో కు ఓ మచ్చు తునకని నిగ్గు తేలింది. అమరావతిలోని సీడ్‌ క్యాపిటల్‌లో నారాయణ బినామీల పేరిట ఉన్న 75,888 చదరపు గజాల స్థలాలు టీడీపీ భూబాగోతానికి నిదర్శనమని నిర్ధా­రణ అయ్యింది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌లో టీడీపీ పెద్దల అవినీతి బట్టబయలైంది. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనలోనే చంద్రబాబు, నారా­యణ, లింగమనేని, వారి బంధువులు, బినామీలు భారీ భూ దోపిడీకి బరితెగించారని ఆధారాలతో సహా వెల్లడైంది.

చంద్రబాబు అండ్‌ గ్యాంగ్‌ అమరా­వతిలోని అవినీతి సామ్రాజ్యాన్ని సీఐడీకి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) బట్టబయలు చేసింది. దాంతో టీడీపీ ప్రభుత్వంలో అమరావతి కేంద్ర బిందువుగా ఏ–1 నారా చంద్రబాబు, ఏ–2 పొంగూరు నారాయణ యథేచ్ఛగా సాగించిన భారీ భూ దోపిడీపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది.

అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం పాల్పడిన అక్ర­మాలు, అవినీతిపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)ను నియ­మించడం సరైనదేనని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దాంతో తన అవినీతి బట్టబయలు కాకుండా చంద్రబాబు కొన్నేళ్లుగా అడ్డుకుంటున్న కుట్ర­లకు తెరపడింది. ఈ నేపథ్యంలో రాజధాని ల్యాండ్‌ పూలింగ్, సీడ్‌ క్యాపిటల్‌ మాస్టర్‌ ప్లాన్, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌లలో పచ్చ ముఠా అక్రమాలపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. 

బాబు, నారాయణవి అక్రమ ఆస్తులే
అక్రమ మార్గంలో సంపాదించిన ఆస్తులను అటాచ్‌ చేసేందుకు ప్రభుత్వానికి అధికారం కల్పిస్తున్న క్రిమినల్‌ లా ఆర్డినెన్స్‌ ప్రకారం అనుమతించాలని సీఐడీ కోరింది. ఈ మేరకు అవినీతి నిరోధక చట్టం–1988 ప్రకారం లింగమనేని కుటుంబం క్విడ్‌ ప్రో కో కింద చంద్రబాబుకు ఇచ్చిన కరకట్ట నివాసం.. సీడ్‌ క్యాపిటల్‌ ప్రాంతంలో నారాయణ బినామీల పేరిట పొందిన 75,888 చదరపు గజాల స్థలాలను అటాచ్‌ చేసేందుకు సీఐడీకి అనుమతిస్తూ హోమ్‌ శాఖ రెండు వేర్వేరు జీవోలు జారీ చేసింది. దాంతో సీఐడీ ఆ విషయాన్ని ఏసీబీ న్యాయస్థానానికి నివేదించి, ఆ ఆస్తులను అటాచ్‌ చేసేందుకు ఉపక్రమించనుంది. తదుపరి దశల్లో మరిన్ని కఠిన చర్యలు చేపట్టేందుకు సన్నాహాలు వేగవంతం చేస్తోంది. 

భారీ అవినీతికే ‘మాస్టర్‌ ప్లాన్‌’
అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనలోనే ఏ–1 చంద్రబాబు, ఏ–2 నారాయణ భారీ అవినీతికి పునాది వేశారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే అప్పటి టీడీపీ ప్రభుత్వం, సింగపూర్‌కు చెందిన ఇంటర్నేషనల్‌ ఎంటర్‌ప్రైజస్‌తో ఒప్పందం చేసుకుంది. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనకు కన్సల్టెన్సీ ఎంపిక కోసం కనీసం టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టకుండా సింగపూర్‌ కంపెనీకి నామినేషన్‌ పద్ధతిలో అడ్డగోలుగా అప్పగించేశారు. దాంతో చంద్రబాబు, నారాయణ కనుసన్నల్లోనే మాస్టర్‌ ప్లాన్‌ను సింగపూర్‌ కంపెనీ రూపొందించింది.

లింగమనేని రమేశ్, లింగమనేని రాజశేఖర్, హెరిటేజ్‌ ఫుడ్స్, చంద్రబాబు బినామీలకు చెందిన భూములు ల్యాండ్‌ పూలింగ్‌ పరిధిలోకి రాకుండా.. వారి భూముల వెలుపలి నుంచే ల్యాండ్‌ పూలింగ్‌ చేసేలా మాస్టర్‌ ప్లాన్‌ను ఖరారు చేశారు. అందుకు ప్రతిగా చంద్రబాబు కుటుంబానికి లింగమనేని కుటుంబం భారీగా ప్రతిఫలాన్ని ముట్టజెప్పింది. 

క్విడ్‌ ప్రోకో కిందే కరకట్ట నివాసం
చంద్రబాబు, లింగమనేని క్విడ్‌ ప్రో కో కింద పరస్పరం భారీగా అవినీతికి పాల్పడినట్టు సిట్‌ నిర్ధారించింది. లింగమనేని కుటుంబ సభ్యుల భూములు ల్యాండ్‌ పూలింగ్‌ పరిధిలోకి రాకుండా చేసినందుకు చంద్రబాబుకు భారీగా ముట్టజెప్పారు. ఇన్నర్‌రింగ్‌ రోడ్డుకు ఆనుకుని ఉన్న భూములను హెరిటేజ్‌ ఫుడ్స్‌కు ‘అమ్మినట్టు’ ఇవ్వడంతో సరిపెట్టలేదు. లింగమనేని కృష్ణానది కరకట్ట మీద ఉన్న నివాసాన్ని కూడా చంద్రబాబుకు ఇవ్వడం గమనార్హం. పక్కా క్విడ్‌ ప్రో కోలో భాగంగానే కరకట్ట నివాసం చంద్రబాబుకు ఉచితంగా ఇచ్చేశారని సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. 

కరకట్ట నివాసంపై బాబు కట్టుకథలు
కరకట్ట నివాసంపై న్యాయస్థానాన్ని, ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు జీతంతోపాటు హౌస్‌ రెంట్‌ అలవెన్స్‌ (ఇంటి అద్దె అలవెన్స్‌) కూడా తీసుకున్నారు. అంటే ప్రజాధనం నుంచి సీఎంగా ఇంటి అద్దె అలవెన్స్‌ తీసుకున్నారు. 

కానీ చంద్రబాబు 2017 నుంచి తాను ఉంటున్న కరకట్ట నివాసానికి అద్దెను లింగమనేని కుటుంబానికి చెల్లించినట్టు ఎక్కడా బ్యాంకు లావాదేవీలు లేవు. చంద్రబాబు నుంచి తీసుకున్న అద్దెకు లింగమనేని ఎక్కడా జీఎస్టీ చెల్లించనే లేదు. అంటే ఇంటి అద్దె అలవెన్స్‌ను ప్రజాధనం నుంచి తీసుకుంటున్న చంద్రబాబు.. తాను నివసిస్తున్న ఇంటికి మాత్రం అద్దె చెల్లించడమే లేదన్నది నిర్ధారణ అయ్యింది. క్విడ్‌ ప్రో కోలో భాగంగా ఆ నివాసం చంద్రబాబుకు లింగమనేని ఇచ్చారు కాబట్టే అద్దె చెల్లించలేదు. 

దేశ భక్తితో ఇచ్చారట! 
కరకట్ట నివాసంపై న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు లింగమనేని కూడా యత్నించారు. తాను దేశభక్తితోనే కరకట్ట నివాసాన్ని అప్పటి ప్రభుత్వం వాడుకునేందుకు ఉచితంగా ఇచ్చానని లింగమనేని రమేశ్‌ న్యాయస్థానానికి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. మరి ఉచితంగా ఇచ్చిన ఇంటికి చంద్రబాబు ప్రజాధనం నుంచి ఇంటి అద్దె అలవెన్స్‌ను ఎలా తీసుకున్నారన్న ప్రశ్నకు సమాధానమే లేదు. దేశభక్తితో ఉచితంగా ఇస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి గానీ చంద్రబాబుకు వ్యక్తిగతంగా ఇవ్వడం ఏమిటి? ప్రభుత్వానికే ఉచితంగా ఇచ్చి ఉంటే.. చంద్రబాబు సీఎం పదవి నుంచి దిగిపోగానే ఆ ఇంటిని ఖాళీ చేయాలి.

ఆ ఇంటిని ప్రభుత్వానికి అప్పగించాలి. ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగిన తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయాన్ని ఖాళీ చేయాలి. ఆ నివాసం ప్రభుత్వానికి చెందుతుంది. కానీ 2019లో సీఎం పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా చంద్రబాబు అదే కరకట్ట నివాసంలో ఉంటున్నారు. అంటే లింగమనేని దేశ భక్తితో ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చారన్నది అవాస్తవం. క్విడ్‌ ప్రో కోలో భాగంగానే ఆయన చంద్రబాబుకు ఇచ్చారన్నది దీనినిబట్టి కూడా నిర్ధారణ అయ్యింది. 

లింగమనేని నుంచి హెరిటేజ్‌ ఫుడ్స్‌కు భూమి
2014లో లింగమనేని కుటుంబ సభ్యుల నుంచి హెరిటేజ్‌ ఫుడ్స్‌ 4 ఎకరాలను ‘కొనుగోలు చేసినట్టు’ చూపించడం గమనార్హం. అమరావతి ల్యాండ్‌ పూలింగ్‌ పరిధిలోకి రాకుండా ఇన్నర్‌ రింగ్‌ రోడ్డును ఆనుకుని ఉన్న భూమినే హెరిటేజ్‌ ఫుడ్స్‌ కొనుగోలు చేసింది. ఆ పేరుతో ఆ భూమిని హెరిటేజ్‌ ఫుడ్స్‌కు బదలాయించారు. ఆ మేరకు అప్పట్లోనే నారా లోకేశ్‌ డైరెక్టర్‌గా ఉన్న హెరిటేజ్‌ ఫుడ్స్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో తీర్మానం చేశారు. అనంతరం ఎమ్మెల్సీగా ఎన్నికై, మంత్రి కూడా అయిన లోకేశ్‌ అదే లింగమేని కుటుంబం ఇచ్చిన కరకట్ట మీద నివాసంలోనే నివసించారు. 

సీడ్‌ క్యాపిటల్‌లో వేళ్లూనుకున్న అవినీతి 
► అమరావతిలో అత్యంత ప్రధానమైన సీడ్‌ క్యాపిటల్‌లో కూడా ఏ–1 చంద్రబాబు, ఏ–2 నారాయణ భారీగా భూ అక్రమాలకు పాల్పడ్డారు. ఎందుకంటే శాసనసభ, సచివాలయం మొదలైన ప్రధాన విభాగాలన్నీ కూడా సీడ్‌ క్యాపిటల్‌ పరిధిలోనే నిర్మించాలని నిర్ణయించారు.

► ఆ ప్రాంతంలో భూముల ధరలు భారీగా పెరుగుతాయి కాబట్టి, సీడ్‌ క్యాపిటల్‌లో పూర్తిగా తమ వాటా భూములే ఉండేట్టుగా చంద్రబాబు, నారాయణ పన్నాగం పన్నారు. సింగపూర్‌ కంపెనీ సీడ్‌ క్యాపిటల్‌ మాస్టర్‌ ప్లాన్‌ను ప్రభుత్వానికి 2015 జూలైలోనే సమర్పించింది. కానీ ఆ ప్లాన్‌ను బహిర్గతం చేయకుండా, ఆమోదించకుండా మూడు నెలలపాటు కాల యాపన చేశారు. 

► ఆ సమయంలోనే నారాయణ తమ బినామీలు, బంధువులైన పొత్తూరి ప్రమీల, రాపూరి సాంబశివరావు, ఆవుల ముని శంకర్, వరుణ్‌ కుమార్‌ కొత్తప్ప పేరున సీడ్‌ క్యాపిటల్‌ ప్రాంతంలో 65.50 ఎకరాలు కొనుగోలు చేశారు. అందుకోసం నారాయణ భార్య రమాదేవి, అల్లుడు డైరెక్టర్లుగా ఏర్పాటు చేసిన ఎన్‌స్పైరా కంపెనీ నుంచి నిధులను తమ బంధువులు, బినామీల ఖాతాల్లోకి మళ్లించారు. వారి పేరున సీడ్‌ క్యాపిటల్‌ ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారు. 

► రామకృష్ణ హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరును బినామీగా పెట్టుకుని కూడా నారాయణ సీడ్‌ క్యాపిటల్‌ ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారు. నారాయణ కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల నుంచి రామకృష్ణ హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బాం్యకు ఖాతాకు నిధులు బదిలీ చేశారు. ఆ నిధులతో ఆ కంపెనీ ఉద్యోగుల పేరున భూములు కొనుగోలు చేశారు. 

► కేసు దర్యాప్తులో భాగంగా ఆ ఉద్యోగులను సిట్‌ అధికారులు ప్రశ్నించగా తాము నారాయణ బినామీలుగానే భూములు కొనుగోలు చేశామని వాంగ్మూలం ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇలా నారాయణ తమ బంధువులు, బినామీల పేరిట సీడ్‌ క్యాపిటల్‌ ప్రాంతంలో కొనుగోలు చేసిన 65.50 ఎకరాలను ల్యాండ్‌ పూలింగ్‌ కింద సీఆర్డీఏకు ఇచ్చారు. 

► అందుకు ప్రతిగా ల్యాండ్‌ పూలింగ్‌ ప్యాకేజీ కింద సీడ్‌ క్యాపిటల్‌ ప్రాంతంలో అత్యంత విలువైన 75,888 చదరపు గజాల స్థలాలు పొందారు. వాటిలో 7,620 చదరపు గజాలు, 8,880 చదరపు గజాలు, 6,550 చదరపు గజాలు, 25 వేల చదరపు గజాల స్థలాలు కూడా ఉన్నాయి. అవి నేరుగా సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకు అనుసంధానించి ఉండటం గమనార్హం. 

► భవిష్యత్‌లో స్టార్‌ హోటళ్లు, షాపింగ్‌ మాల్స్, ఇతర భారీ వాణిజ్య సముదాయాల నిర్మాణానికి అనుకూలమైన విలువైన స్థలాలను పొందారన్నది స్పష్టమవుతోంది. పూలింగ్‌ ప్యాకేజీ కింద ఏటా సీఆర్‌డీఏ ఇప్పటి వరకు చెల్లించిన రూ.1.92 కోట్ల కౌలు మొత్తం ఎన్‌స్పైరా ఖాతాల్లో జమ చేస్తున్నారు. అంటే ఆ భూములు కొనుగోలు చేసి సీఆర్‌డీఏకే ఇచ్చినట్టు పేర్కొన్న పొత్తూరి ప్రమీల, రా>పూరి సాంబశివరావు, ఆవుల ముని శంకర్, వరుణ్‌ కుమార్‌ కొత్తప్ప పూర్తిగా నారాయణ బినామీలేనన్నది నిర్ధారణ అయ్యింది. 

వారి భూముల వద్దే ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు 
అమరావతిలో 75 మీటర్ల ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ను రూపొందించడంలో చంద్రబాబు, నారాయణ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డారు. వారి భూములను ఆనుకునే ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నిర్మించేలా అలైన్‌మెంట్‌ను రూపొందించారు. లింగమనేని కుటుంబం, హెరిటేజ్‌ ఫుడ్స్, నారాయణ విద్యా సంస్థల  సమీపం నుంచి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నిర్మించేలా చంద్రబాబు, నారాయణ ప్రత్యేకంగా పర్యవేక్షించారు. తమ భూముల నుంచి కాకుండా సామాన్య రైతుల భూముల నుంచి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నిర్మించేలా అలైన్‌మెంట్‌ను ఖరారు చేయడం గమనార్హం.

అందుకోసం ముందుగానే ఆ భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, ఇళ్ల నిర్మాణాలకు కూడా అనుమతి ఇవ్వకుండా సీఆర్‌డీయే నిలుపుదల చేసింది. అంటే కన్సల్టెన్సీ సంస్థ అలైన్‌మెంట్‌ను రూపొందించకముందే చంద్రబాబు, నారాయణ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు ఎలా నిర్మించాలో నిర్ణయించేశారు. అప్పటికే నిర్ణయించిన అలైన్‌మెంట్‌ను ఖరారు చేసేందుకే ఓ కన్సల్టెన్సీని నియమించి కనికట్టు చేశారు.
చదవండి: దిగజారుడు పాత్రికేయానికి మరో మచ్చుతునక

వాస్తవానికి విజయవాడలోని కామినేని ఆస్పత్రి వద్ద ఉన్న తాడిగడప– ఎనికేపాడు మీదుగా ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నిర్మించాలని కన్సల్టెన్సీ సంస్థ ఎస్‌టీయూపీ అలైన్‌మెంట్‌ను రూపొందించింది. అలా నిర్మిస్తే నారాయణ విద్యా సంస్థలతోపాటు హెరిటేజ్‌ ఫుడ్స్, లింగమనేని భూముల మీదుగా రోడ్డును నిర్మించాల్సి వస్తుంది. దీనిపై అప్పటి సీఆర్‌డీయే వైస్‌ చైర్మన్‌గా ఉన్న నారాయణ సీఆర్‌డీయే సమావేశంలోనే అధికారులపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. తాడిగడపకు 3 కి.మీ. దూరంగా తూర్పు వైపు నుంచి పెనమలూరు– నిడమానూరు మీదుగా ఇన్నర్‌రింగ్‌ రోడ్డు నిర్మించేలా అలైన్‌మెంట్‌ను మార్పించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement