సాక్షి, అమరావతి: ధరలు లేక కొట్టుమిట్టాడుతున్న బత్తాయి (స్వీట్ లెమన్) రైతుల్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ధరల స్థిరీకరణ నిధిని ఉపయోగించి బత్తాయిలు టన్ను రూ.10 వేల చొప్పున 10 వేల టన్నులను సేకరించేలా సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఒక్కో రైతు నుంచి గరిష్ఠంగా వెయ్యి క్వింటాళ్లు (100 టన్నులు) సేకరిస్తారు. రాష్ట్రంలో సుమారు 86 వేల హెక్టార్లలో బత్తాయి సాగువుతుంది. కోవిడ్–19 మూలంగా బత్తాయి రైతులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కోవడంతో పాటు కనీస మద్దతు ధర పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రివర్గ బృందం ధరల స్థిరీకరణ నిధితో ప్రభుత్వమే కొనుగోలు చేస్తే బాగుంటుందని సిఫార్సు చేసింది. ఈ సిఫార్సును ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం బత్తాయి సేకరణకు మార్గదర్శకాలు విడుదల చేసింది.
► వ్యవసాయ మార్కెట్ కమిటీ అందించే ఎన్‌ఇఎంఎల్ సాఫ్ట్‌వేర్ ద్వారా మాత్రమే రైతుల నుంచి బత్తాయి సేకరించాలి.
► టన్ను ధర రూ.10 వేల వంతున 10 వేల మెట్రిక్ టన్నుల బత్తాయిలు సేకరించాలి.
► ఒక్కో రైతు నుంచి ఎకరానికి 20 టన్నుల చొప్పున గరిష్ఠంగా ఐదెకరాలకు వందటన్నుల కాయలు కొంటారు.
► వీటిని రైతుబజార్లు, సెర్ప్, మెప్మాల ఆధ్వర్యంలోని నెట్‌వర్క్‌ల ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విక్రయిస్తారు.
► ఏఎంసీ కార్యదర్శి నిర్ణయించే అమ్మకపు ధరలో రవాణా, నిర్వహణ, ఇతరత్రా యాధృచ్ఛిక చార్జీలు కలుపుతారు.
► అమ్మకాలపై కిలోకు రూ.5 సబ్సిడీ ఇస్తారు
► బత్తాయిలను విక్రయించే స్వయం ఉపాధి సంఘాలకు ఒక రూపాయి కమీషన్ ఇస్తారు.
► 2 శాతం తరుగు (డామేజీ) అనుమతిస్తారు.
► రైతుబజార్లలో అమ్మ కాలతో వచ్చే నగదును సంబంధిత కార్యనిర్వహణాధికారి రైతుబజారు సీఇవో ఖాతాకు జమచేయాలి.
► పట్టణ ప్రాంతాలలో మెప్మాకు అప్పగించే అవకాశాన్ని పరిశీలించే ముందు రైతుబజార్ల ద్వారా అమ్మకాలకు ప్రాధాన్యత ఉంటుంది.
► ఏపీఎం, సెర్ప్, సీఎంఎం, మెప్మాల నుంచి అమ్మకపు మొత్తాన్ని.. కాయలు సరఫరా చేసిన ఏఎంసీ సేకరిస్తుంది.
► గ్రామీణ ప్రాంతాల్లో లావాదేవీలను డీఆర్‌డీఏ పీడీ, పట్టణ ప్రాంతాల్లో మెప్మా పీడీ పర్యవేక్షిస్తారు.
► మార్కెటింగ్‌శాఖ తరఫున ఈ మొత్తం వ్యవహారాన్ని ఏడీఎం, డీడీఎం, జేడీఎం పర్యవేక్షిస్తారు. డీఆర్‌డీఏ పీడీ, మెప్మా పీడీలతో ఏడీఎం సంప్రదింపులు జరుపుతూ కార్యక్రమం సజావుగా సాగేలా చూస్తారు.
బత్తాయికి సర్కారు ‘మద్దతు’
Published Tue, Oct 6 2020 5:22 AM | Last Updated on Tue, Oct 6 2020 5:22 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment