సాక్షి, అమరావతి: మిషన్ బిల్డ్ ఆంధ్రప్రదేశ్ కోసం ప్రభుత్వం తలపెట్టిన ఆస్తుల వేలాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో హైకోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 12కి వాయిదా వేసింది. ఆలోపు పిటిషనర్లందరూ కూడా తమ తమ వాదనలను సిద్ధంచేసుకుని ఉండాలని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ వ్యాజ్యాల్లో చాలా చిన్న ప్రశ్న ముడిపడి ఉందని.. రాష్ట్రంలో పాలన చేస్తోంది ఎవరో తేల్చేస్తే సరిపోతుందని ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. న్యాయస్థానాలను వేదికలుగా చేసుకుంటూ పిటిషన్లు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేస్తూ సంక్షేమాన్ని అడ్డుకుంటున్న పిటిషనర్లు పాలన చేస్తున్నారా? లేక ప్రజలతో ఎన్నుకోబడిన వారు పాలన చేస్తున్నారా? అన్న విషయం తేల్చాల్సిన అవసరముందని ఆయన వివరించారు.
ఈ సమయంలో న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ జె. ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. మీరు (ఏఏజీ) మమ్మల్ని (కోర్టును) ఉద్దేశించి మాట్లాడుతున్నారా? పాలన ప్రభుత్వం చేస్తోందా? హైకోర్టు చేస్తోందా? అంటూ ప్రశ్నిస్తున్నారా అంటూ వ్యాఖ్యానించింది. పిటిషనర్లను ఉద్దేశించి మాట్లాడుతున్నానని సుధాకర్‌రెడ్డి చెప్పారు. దీనిపై పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన నర్రా శ్రీనివాసరావు అభ్యంతరం తెలిపారు. తాను అవాస్తవం ఎంతమాత్రం చెప్పలేదని అదనపు ఏజీ అన్నారు. వాళ్లు ఇతరుల భుజాలపై తుపాకీ పెట్టి మమ్మల్ని కాల్చాలని చూస్తున్నారని సు«ధాకర్‌రెడ్డి చెప్పారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, అసలు విషయం పక్కదారి పడుతోందని తెలిపింది.
సంక్షేమాన్ని అడ్డుకునేందుకే..
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్‌మోహన్‌రెడ్డి స్పందిస్తూ.. గతంలో భూములు విక్రయించినప్పుడు ఈ సమాజ సేవకులంతా ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు. గతంలో నోరెత్తని పిటిషనర్లంతా ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకోవడానికి న్యాయస్థానానికి వస్తున్నారని తెలిపారు. ఈ విషయాల జోలికి తాము వెళ్లడంలేదని ధర్మాసనం స్పష్టంచేసింది. నర్రా శ్రీనివాసరావు స్పందిస్తూ.. ఎమ్మార్వో కార్యాలయం, శిశు సంక్షేమ శాఖ భూములను కూడా ప్రభుత్వం విక్రయిస్తోందన్నారు. ఏఏజీ సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ.. ప్రభుత్వాన్ని మీరే నడపండి.. సరిపోతుందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తామిక్కడ ఉండేది రాజకీయాలను చర్చించేందుకు కాదని ధర్మాసనం తెలిపింది. సంయమనంతో మాట్లాడాలని సుధాకర్‌రెడ్డికి సూచించింది. ప్రభుత్వ కౌంటర్ అందని పిటిషనర్లకు దానిని అందజేయాలని సుధాకర్‌రెడ్డిని ఆదేశించింది. తదుపరి విచారణ నాటికి పిటిషనర్లందరూ తమ వాదనలతో సిద్ధంగా ఉండాలని స్పష్టంచేస్తూ, విచారణను అక్టోబర్ 12కి వాయిదా వేసింది. వేలం ప్రక్రియను కొనసాగించుకోవచ్చునని.. అయితే బిడ్‌లు మాత్రం ఖరారు చేయవద్దంటూ ఇచ్చిన ఉత్తర్వులను 12 వరకు ధర్మాసనం పొడిగించింది.
పాలన చేస్తోంది ఎవరో తేల్చండి
Published Sat, Sep 19 2020 5:49 AM | Last Updated on Sat, Sep 19 2020 5:49 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment