సాక్షి, అమరావతి: ఏలూరు నగరపాలక సంస్థ పాలకవర్గ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ నెల 10న జరగాల్సిన ఎన్నికపై స్టే విధించిన హైకోర్టు ఓటర్ల జాబితాలో తప్పులను సవరించే వెసులుబాటును అధికారులకు కల్పించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తుది ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున తప్పులున్నాయని, అభ్యంతరాలను స్వీకరించకుండానే తుది ఓటర్ల జాబితాను ప్రచురించారంటూ టీడీపీ నేత ఎస్‌వీ చిరంజీవి, మరికొందరు గత ఏడాది హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి ఓటర్ల జాబితాలో కుక్క ఫొటో ముద్రించడంపై మండిపడుతూ పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఓటర్ల జాబితాలో తప్పులను సవరించాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ను ఆదేశిస్తూ గత ఏడాది మార్చి 5న తీర్పునిచ్చారు.
ఈ తీర్పును అధికారులు అమలు చేయలేదంటూ చిరంజీవి, మరో 33 మంది హైకోర్టును ఆశ్రయించగా.. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు సోమవారం తన నిర్ణయాన్ని వెలువరించారు. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రకటించిన తరువాత నిబంధనల ప్రకారం పబ్లిక్ నోటీసులు ఇచ్చి ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించలేదని, తుది ఓటర్ల జాబితా తయారీ విషయంలో నిబంధనలు పాటించలేదని ఆక్షేపించారు. గత ఏడాది హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అధికారులు పూర్తిస్థాయిలో అమలు చేయలేదని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో వందలాది ఓటర్ల ఇంటి నంబర్లు 000గా చూపారని, అనేక మంది ఓటర్ల పేర్లు తప్పుగా ఉన్నాయని తెలిపారు.
న్యాయస్థానాలు ఇచ్చిన ఉత్తర్వుల అమలును వాయిదా వేయడానికి వీల్లేదని, కోర్టు ఉత్తర్వులను అమలు చేసి తీరాల్సిందేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఎవరు ఎంత పెద్ద వారైనా, చట్టం వారి కంటే పెద్దదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. తప్పులు లేని ఓటర్ల జాబితా ఎన్నిక ప్రక్రియకు పునాది అని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. చట్టం నిర్దేశించిన విధంగా ఓటర్ల జాబితా తయారు చేయకపోవడాన్ని కేవలం సాంకేతిక లోపంగా మాత్రమే చూడలేమన్నారు. ఓటర్ల జాబితా సక్రమంగా లేదని కోర్టు తేల్చిన తరువాత దానిని సరిచేయకుండా ఎన్నికలు నిర్వహించడం సరికాదన్నారు. ఎన్నికను వాయిదా వేయడం వల్ల కలిగే కష్టం కంటే, ఓటర్ల జాబితాను సవరించడం వల్లే కలిగే ప్రజోపయోగమే ప్రధానమైనదని తెలిపారు. ఈ కారణాలతో ఏలూరు నగరపాలక సంస్థ పాలకవర్గ ఎన్నికలపై స్టే విధిస్తున్నట్టు న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
‘ఏలూరు’ ఎన్నికలకు బ్రేక్
Published Tue, Mar 9 2021 3:35 AM | Last Updated on Tue, Mar 9 2021 3:35 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment