సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) ఏకపక్ష నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇరుపక్షాల (ప్రభుత్వం, ఎస్‌ఈసీ) అధికారులు కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. సంప్రదింపుల ప్రక్రియ జరిగి తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. కరోనా టీకాల ప్రక్రియ ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున అప్పుడు స్థానిక ఎన్నికలు సాధ్యం కాదన్న అభ్యంతరాలన్నింటినీ ఎన్నికల కమిషన్ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. సమస్య పరిష్కారం కావడం అందరికీ మంచిదని, అంతిమంగా అందరికీ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని, ఇతర అంశాలేవీ ఈ కోర్టుకు అవసరం లేదని వ్యాఖ్యానించింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి స్థాయికి తగ్గని హోదా కలిగిన ముగ్గురు అధికారుల బృందం ఎన్నికల కమిషన్‌ను కలవాలని సూచించింది. సమావేశం వేదికను ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుందని పేర్కొంది. సంప్రదింపులు జరిపి సామరస్యపూర్వకంగా పరిష్కారానికి రావాలని సూచిస్తూ తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. అదే రోజు సంప్రదింపుల ప్రక్రియకు సంబంధించి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికల నిర్వహణ నిమిత్తం రాష్ట్ర ఎన్నికల కమిషన్ గత నెల 17న జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాల్ చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే.
అభ్యంతరాలన్నీ ఎస్‌ఈసీ ముందు ఉంచండి...
కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది సుమన్ తెలిపారని విచారణ సందర్భంగా జస్టిస్ శేషసాయి పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ త్వరలో షెడ్యూల్ జారీ చేసే అవకాశం ఉందని కూడా కోర్టు దృష్టికి తెచ్చారన్నారు. ఈ వివరాలన్నింటితో పాటు అభ్యంతరాలను కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన మూడు రోజుల్లోపు ఎన్నికల కమిషన్ ముందుంచాల్సి ఉంటుందని తెలిపారు.
సుప్రీం ఆదేశాల ప్రకారమే ముందుకు..
దీనిపై ఏజీ శ్రీరామ్ స్పందిస్తూ ఎన్నికల కమిషనర్ మొత్తం ప్రక్రియను ముగించేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఎన్నికల తేదీ ఇంకా నోటిఫై చేయలేదని గుర్తు చేశారు. ఎన్నికల నిర్వహణ నెలను నిర్ణయించేశారని ఏజీ పేర్కొనడంతో నెలతో తమకు సంబంధం లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందు సంప్రదింపుల ప్రక్రియ మొదలుపెట్టాలని సుప్రీంకోర్టు చెప్పిందని, ఆ ప్రకారమే ముందుకు వెళ్లాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాలైనా ఎన్నికల కమిషన్ ముందు ఉంచవచ్చని స్పష్టం చేశారు. సంప్రదింపుల విషయంలో కోర్టు సూచించిన ప్రతిపాదనకు తమకు అభ్యంతరం లేదని ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ తెలిపారు.
సదుద్దేశంతో చేపట్టాలి..
సంప్రదింపుల ప్రక్రియ మొత్తం పారదర్శకంగా, స్పష్టతతో చేపట్టాల్సిన అవసరం ఉందని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ నిర్ణయించిన ఫిబ్రవరి నెలపై కూడా చర్చించాలన్నారు. తేదీలకే పరిమితం కాకూడదన్నారు. అన్ని అంశాలపై చర్చిస్తామంటే సంప్రదింపులకు అభ్యంతరం లేదన్నారు. సంప్రదింపుల ప్రక్రియ మొక్కుబడిగా ఉండరాదని, నిజమైన స్ఫూర్తి, సదుద్దేశాలతో చేపట్టాలని స్పష్టం చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి విచారణను వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment