సాక్షి, అమరావతి: ఆహార భద్రత, ప్రమాణాల చట్టం (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏ) ప్రకారం పొగాకు నమలడం ‘ఆహారం’ నిర్వచన కిందకు రాదని హైకోర్టు తేల్చిచెప్పింది. పొగాకును ఆహారంగా ఉపయోగించడంగానీ, ఆహారంగా మానవ వినియోగం నిమిత్తం తీసుకోవడంగానీ జరగదని.. పోషకాహారంగా కూడా స్వీకరించరని స్పష్టంచేసింది. పొగాకు నమలడంవల్ల వచ్చే ఓ రకమైన థ్రిల్ కోసం, ఉత్తేజం కోసమే దానిని ఉపయోగిస్తారని తెలిపింది. అందువల్ల ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చట్టంలోని సెక్షన్–3(1)(జే) ప్రకారం పొగాకు నమలడం ‘ఆహారం’ నిర్వచన పరిధిలోకి రాదని తెలిపింది. చూయింగ్ గమ్‌ను ఆహార నిర్వచన పరిధిలో చేర్చిన పార్లమెంట్.. పొగాకు నమలడాన్ని మాత్రం ఉద్దేశపూర్వకంగానే ఆహారం కింద చేర్చలేదని వెల్లడించింది.
మానవ వినియోగానికి పనికొచ్చే దానినే పార్లమెంట్ ఆహారంగా పేర్కొందని గుర్తుచేసింది. పొగాకు ఎన్నటికీ మానవ వినియోగానికి పనికిరాదని హైకోర్టు తెలిపింది. అందువల్ల నిషేధిత పొగాకు ఉత్పత్తుల తయారీ, రవాణా, అక్రమ నిల్వ, అమ్మకాలు చేపట్టినందుకు ఆహార భద్రత, ప్రమాణాల చట్టంతో పాటు పొగాకు ఉత్పత్తుల తయారీ, ఉత్పత్తి, సరఫరా, పంపిణీ నిషేధ చట్టం (సీఓటీపీఏ), ఐపీసీ చట్టాల కింద కేసు నమోదు చేయడం చెల్లదని హైకోర్టు తేల్చిచెప్పింది. ఇలా ఈ చట్టాల కింద పలువురిపై పోలీసులు నమోదు చేసిన కేసులను హైకోర్టు కొట్టేసింది. నిషేధిత పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు, నిల్వ తదితరాలతో పాటు అక్రమంగా మద్యం, గంజాయి రవాణా చేసినందుకు మరికొందరిపై నమోదు చేసిన కేసులను హైకోర్టు పాక్షికంగా కొట్టేసింది. కానీ, ఏపీ ఎక్సైజ్ చట్టం కింద, ఎన్‌డీపీఎస్ చట్టాల కింద దర్యాప్తు కొనసాగించవచ్చునని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ మూడ్రోజుల క్రితం తీర్పు వెలువరించారు.
130 పిటిషన్లు దాఖలు
నిషేధిత పొగాకు ఉత్పత్తుల తయారీ, రవాణా, అమ్మకాలు, నిల్వ, సరఫరా, పంపిణీతో పాటు గంజాయి రవాణా, అమ్మకాలు, అక్రమంగా మద్యం రవాణా చేస్తున్నందుకు రాష్ట్రవ్యాప్తంగా పలువురిపై పోలీసులు ఐపీసీ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏ, సీఓటీపీఏ, ఏపీ ఎక్సైజ్ చట్టంతో పాటు ఎన్‌డీపీసీఎస్ చట్టాల కింద కేసులు నమోదుచేశారు. తమపై పోలీసులు నమోదు చేసిన ఈ కేసులను కొట్టేయాలని కోరుతూ సదరు వ్యక్తులు హైకోర్టులో దాదాపు 130 పిటిషన్లు దాఖలు చేశారు.
వీటన్నింటినీ కలిపి విచారించిన జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ తాజాగా తీర్పునిస్తూ.. ఆహార భద్రత ప్రమాణాల చట్టం ప్రకారం పొగాకు నమలడం ఆహార నిర్వచన పరిధిలోకి రాదని, ఇదే విషయాన్ని మన హైకోర్టుకు చెందిన బెంచ్‌లు వేర్వేరుగా ఇప్పటికే తీర్పునిచ్చాయన్నారు. అయితే, ఇటీవల మరో సింగిల్ జడ్జి మాత్రం పొగాకు నమలడం ఆహారం కిందకు వస్తుందంటూ తీర్పునిచ్చారని, ఈ తీర్పుతో తాను ఏకీభవించడం లేదన్నారు. పొగాకు నమలడం ఆహారం కిందకు రాదంటూ పిటిషనర్లపై పోలీసులు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏ, సీఓటీఏపీ తదితర చట్టాల కింద నమోదు చేసిన కేసులను కొట్టేశారు.
Comments
Please login to add a commentAdd a comment