FSSA
-
ఆహారభద్రత కమిషనర్‌కు ఆ అధికారం లేదు
సాక్షి, అమరావతి: ఆహారభద్రత, ప్రమాణాల చట్టం (ఎఫ్ఎస్ఎస్ఏ) కింద గుట్కా, పాన్‌మసాలా తదితర పొగాకు ఉత్పత్తుల తయారీ, నిల్వ, విక్రయం, సరఫరా, పంపిణీ తదితరాలను నిషేధించే అధికారం ఆహారభద్రత కమిషనర్‌కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. పొగాకు, పొగాకు ఉత్పత్తులు ‘ఆహారం’ నిర్వచన పరిధిలోకి రావని చెప్పింది. ఎఫ్ఎస్ఎస్ఏ కింద పొగాకు ఉత్పత్తుల తయారీ, అమ్మకాలు తదితరాలను నియంత్రించే అధికారం మాత్రమే కమిషనర్‌కు ఉందని, నిషేధం విధించే అధికారం లేదని తెలిపింది. కమిషనర్ ఇచ్చిన నోటిఫికేషన్‌ను కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డి.వి.ఎస్.ఎస్.సోమయాజుల ధర్మాసనం శుక్రవారం తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పొగాకు ఉత్పత్తులు కేంద్రప్రభుత్వ చట్టపరిధిలోకి వస్తాయని, అందువల్ల ఆహారభద్రత కమిషనర్ జారీచేసిన నోటిఫికేషన్ చట్టవిరుద్ధమంటూ పలువురు వ్యాపారులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పొగాకు, పాన్‌మసాలా, గుట్కా తదితర పొగాకు ఆధార ఉత్పత్తుల సేవనం ఆహార నిర్వచన పరిధిలోకి వస్తుందా? రాదా? అన్న అంశాన్ని సింగిల్ జడ్జి ధర్మాసనానికి నివేదించారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై సీజే ధర్మాసనం విచారించి తీర్పు చెప్పింది. పిటిషనర్ల రోజువారీ చట్టబద్ధ కార్యకలాపాల్లో ఏ రకంగాను జోక్యం చేసుకోవద్దని, ఎఫ్ఎస్ఎస్ఏ కింద జప్తుచేసిన సరుకును తక్షణమే విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది. లైసెన్స్ తీసుకుని వ్యాపారం చేసేవారిపై ఎఫ్ఎస్ఎస్ఏ కింద ఎలాంటి కఠినచర్యలు తీసుకోవద్దని పేర్కొంది. -
‘పొగాకు నమలడం’ ఆహార నిర్వచనం పరిధిలోకి రాదు
సాక్షి, అమరావతి: ఆహార భద్రత, ప్రమాణాల చట్టం (ఎఫ్ఎస్ఎస్ఏ) ప్రకారం పొగాకు నమలడం ‘ఆహారం’ నిర్వచన కిందకు రాదని హైకోర్టు తేల్చిచెప్పింది. పొగాకును ఆహారంగా ఉపయోగించడంగానీ, ఆహారంగా మానవ వినియోగం నిమిత్తం తీసుకోవడంగానీ జరగదని.. పోషకాహారంగా కూడా స్వీకరించరని స్పష్టంచేసింది. పొగాకు నమలడంవల్ల వచ్చే ఓ రకమైన థ్రిల్ కోసం, ఉత్తేజం కోసమే దానిని ఉపయోగిస్తారని తెలిపింది. అందువల్ల ఎఫ్ఎస్ఎస్ఏఐ చట్టంలోని సెక్షన్–3(1)(జే) ప్రకారం పొగాకు నమలడం ‘ఆహారం’ నిర్వచన పరిధిలోకి రాదని తెలిపింది. చూయింగ్ గమ్‌ను ఆహార నిర్వచన పరిధిలో చేర్చిన పార్లమెంట్.. పొగాకు నమలడాన్ని మాత్రం ఉద్దేశపూర్వకంగానే ఆహారం కింద చేర్చలేదని వెల్లడించింది. మానవ వినియోగానికి పనికొచ్చే దానినే పార్లమెంట్ ఆహారంగా పేర్కొందని గుర్తుచేసింది. పొగాకు ఎన్నటికీ మానవ వినియోగానికి పనికిరాదని హైకోర్టు తెలిపింది. అందువల్ల నిషేధిత పొగాకు ఉత్పత్తుల తయారీ, రవాణా, అక్రమ నిల్వ, అమ్మకాలు చేపట్టినందుకు ఆహార భద్రత, ప్రమాణాల చట్టంతో పాటు పొగాకు ఉత్పత్తుల తయారీ, ఉత్పత్తి, సరఫరా, పంపిణీ నిషేధ చట్టం (సీఓటీపీఏ), ఐపీసీ చట్టాల కింద కేసు నమోదు చేయడం చెల్లదని హైకోర్టు తేల్చిచెప్పింది. ఇలా ఈ చట్టాల కింద పలువురిపై పోలీసులు నమోదు చేసిన కేసులను హైకోర్టు కొట్టేసింది. నిషేధిత పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు, నిల్వ తదితరాలతో పాటు అక్రమంగా మద్యం, గంజాయి రవాణా చేసినందుకు మరికొందరిపై నమోదు చేసిన కేసులను హైకోర్టు పాక్షికంగా కొట్టేసింది. కానీ, ఏపీ ఎక్సైజ్ చట్టం కింద, ఎన్డీపీఎస్ చట్టాల కింద దర్యాప్తు కొనసాగించవచ్చునని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ మూడ్రోజుల క్రితం తీర్పు వెలువరించారు. 130 పిటిషన్లు దాఖలు నిషేధిత పొగాకు ఉత్పత్తుల తయారీ, రవాణా, అమ్మకాలు, నిల్వ, సరఫరా, పంపిణీతో పాటు గంజాయి రవాణా, అమ్మకాలు, అక్రమంగా మద్యం రవాణా చేస్తున్నందుకు రాష్ట్రవ్యాప్తంగా పలువురిపై పోలీసులు ఐపీసీ, ఎఫ్ఎస్ఎస్ఏ, సీఓటీపీఏ, ఏపీ ఎక్సైజ్ చట్టంతో పాటు ఎన్డీపీసీఎస్ చట్టాల కింద కేసులు నమోదుచేశారు. తమపై పోలీసులు నమోదు చేసిన ఈ కేసులను కొట్టేయాలని కోరుతూ సదరు వ్యక్తులు హైకోర్టులో దాదాపు 130 పిటిషన్లు దాఖలు చేశారు. వీటన్నింటినీ కలిపి విచారించిన జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ తాజాగా తీర్పునిస్తూ.. ఆహార భద్రత ప్రమాణాల చట్టం ప్రకారం పొగాకు నమలడం ఆహార నిర్వచన పరిధిలోకి రాదని, ఇదే విషయాన్ని మన హైకోర్టుకు చెందిన బెంచ్‌లు వేర్వేరుగా ఇప్పటికే తీర్పునిచ్చాయన్నారు. అయితే, ఇటీవల మరో సింగిల్ జడ్జి మాత్రం పొగాకు నమలడం ఆహారం కిందకు వస్తుందంటూ తీర్పునిచ్చారని, ఈ తీర్పుతో తాను ఏకీభవించడం లేదన్నారు. పొగాకు నమలడం ఆహారం కిందకు రాదంటూ పిటిషనర్లపై పోలీసులు ఎఫ్ఎస్ఎస్ఏ, సీఓటీఏపీ తదితర చట్టాల కింద నమోదు చేసిన కేసులను కొట్టేశారు. -
ఆ వాటర్ బాటిళ్లనూ అమ్మొచ్చు
బిస్లరీనే కాదు... బీఎస్ఐ ప్రమాణాలున్నా విక్రయించవచ్చు: హైకోర్టు సాక్షి, హైదరాబాద్: బస్టాండుల్లో కేవలం బిస్లరీ కంపెనీ వాటర్ బాటిళ్లే కాక భారత ప్రమాణాల సంస్థ (బీఎస్ఐ), భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ప్రమాణాలను పాటించే కంపెనీల వాటర్ బాటిళ్లను కూడా విక్రయించవచ్చునని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు బస్టాండ్లలోని వాటర్ బాటిళ్ల విక్రేతలకు హైకోర్టు అనుమతినిచ్చింది. అయితే బిస్లరీయేతర బాటిళ్లను (బీఎస్ఐ, ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రమాణాలున్నవి) అదనపు లైసెన్స్ రుసుము చెల్లించి అమ్ముకోవచ్చునంది. ఒకవేళ ఎవరైనా వ్యాపారులు నాణ్యాత ప్రమాణాలు లేని వాటర్ బాటిళ్లను విక్రయిస్తే వారిపై టీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకోవచ్చంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీ అధికారులు కేవలం బిస్లరీ కంపెనీ వాటర్ బాటిళ్లనే, అది కూడా నిర్ధిష్టంగా ఓ పంపిణీదారు నుంచే కొనుగోలు చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని, తమ వ్యాపారంలో జోక్యం చేసుకోకుండా వారిని ఆదేశించాలంటూ డి.జాహెద్‌బాషా, మరో 19 మంది దుకాణదారులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జ్... దుకాణదారుల పిటిషన్లను కొట్టేస్తూ ఉత్తర్వులిచ్చారు. దీన్ని సవాలు చేస్తూ దుకాణదారులు ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు.