ఆ వాటర్ బాటిళ్లనూ అమ్మొచ్చు
బిస్లరీనే కాదు... బీఎస్‌ఐ ప్రమాణాలున్నా విక్రయించవచ్చు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: బస్టాండుల్లో కేవలం బిస్లరీ కంపెనీ వాటర్ బాటిళ్లే కాక భారత ప్రమాణాల సంస్థ (బీఎస్‌ఐ), భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ప్రమాణాలను పాటించే కంపెనీల వాటర్ బాటిళ్లను కూడా విక్రయించవచ్చునని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు బస్టాండ్‌లలోని వాటర్ బాటిళ్ల విక్రేతలకు హైకోర్టు అనుమతినిచ్చింది. అయితే బిస్లరీయేతర బాటిళ్లను (బీఎస్‌ఐ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రమాణాలున్నవి) అదనపు లైసెన్స్ రుసుము చెల్లించి అమ్ముకోవచ్చునంది. ఒకవేళ ఎవరైనా వ్యాపారులు నాణ్యాత ప్రమాణాలు లేని వాటర్ బాటిళ్లను విక్రయిస్తే వారిపై టీఎస్‌ఆర్టీసీ చర్యలు తీసుకోవచ్చంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఆర్టీసీ అధికారులు కేవలం బిస్లరీ కంపెనీ వాటర్ బాటిళ్లనే, అది కూడా నిర్ధిష్టంగా ఓ పంపిణీదారు నుంచే కొనుగోలు చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని, తమ వ్యాపారంలో జోక్యం చేసుకోకుండా వారిని ఆదేశించాలంటూ డి.జాహెద్‌బాషా, మరో 19 మంది దుకాణదారులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జ్... దుకాణదారుల పిటిషన్లను కొట్టేస్తూ ఉత్తర్వులిచ్చారు. దీన్ని సవాలు చేస్తూ దుకాణదారులు ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు.