ధూళిపాళ్లకు హైకోర్టులో ఎదురుదెబ్బ | AP High Court Dismisses TDP Leader Narendra Quash Petition | Sakshi
Sakshi News home page

ధూళిపాళ్లకు హైకోర్టులో ఎదురుదెబ్బ

Published Thu, Apr 29 2021 11:53 AM | Last Updated on Thu, Apr 29 2021 2:18 PM

AP High Court Dismisses TDP Leader Narendra Quash Petition - Sakshi

సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ధూళిపాళ్ల క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఆయనను విచారించాలని కోర్టు ఆదేశించింది. మే 5లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని సంగం డెయిరీలో పలు అక్రమాలు, అవినీతి కేసులో ధూళిపాళ్ల నరేంద్రను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. సంగం డెయిరీ అక్రమాల కేసులో ఏ1గా ఉన్న ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ కస్టడీకి కోరనుంది.

ధూళిపాళ్ల నరేంద్ర అక్రమాల చిట్టా ఇదీ..
సంగం డెయిరీకి ప్రభుత్వం ఇచ్చిన పదెకరాల భూమిని ప్రభుత్వ అనుమతి లేకుండా తన తండ్రి వీరయ్య చౌదరి పేరుతో ఉన్న ట్రస్ట్‌కు నరేంద్ర బదలాయించారు. అప్పటి డెయిరీ ఎండీగా ఉన్న గోపాలకృష్ణ ఆ పదెకరాలను ట్రస్టుకు బదలాయించినట్టు తీర్మానం చేయడం, మేనేజింగ్‌ ట్రస్టీగా నరేంద్ర వాటిని తీసేసుకోవడం జరిగిపోయాయి. ఇది బైలా నంబర్‌ 439 ప్రకారం ఉల్లంఘన.

ప్రభుత్వ భూమిలో వీరయ్య చౌదరి పేరుతో నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్‌ ఆస్పత్రి, రీసెర్చ్‌ సెంటర్‌ నిర్మించుకున్నారు. ఈ ఆస్పత్రికి నరేంద్ర భార్య జ్యోతిర్మయి ఎండీగా వ్యవహరిస్తున్నారు. 

ఏదైనా సహకార సంఘాన్ని కంపెనీగా మార్చుకోవాలంటే ప్రభుత్వానికి బకాయిలు చెల్లించి, భూములు అప్పగించి జిల్లా కోఆపరేటివ్‌ అధికారి నుంచి ఎన్‌వోసీ (నిరభ్యంతర పత్రం) తెచ్చుకోవాలి. 2011 ఫిబ్రవరి 28న రిటైర్‌ అయిన డీసీవో గురునాథం నుంచి ఆయన రిటైర్మెంట్‌కు రెండు రోజుల ముందు తేదీతో ఎన్‌వోసీ తెచ్చి.. సంగం డెయిరీని కంపెనీ చట్టం కిందకు తెచ్చుకున్నారు. ఫలితంగా తన సొంత కంపెనీగా నరేంద్ర డెయిరీని మార్చేశారు.

దీనికి సంబంధించి గుంటూరు జిల్లా కోఆపరేటివ్‌ అధికారి కార్యాలయంలో తనిఖీలు చేసిన ఏసీబీ.. ఎన్‌వోసీకి సంబంధించిన దరఖాస్తు, ఇతర ఉత్తరప్రత్యుత్తరాలు లేవని నిర్ధారించింది. అక్రమ పద్దతుల్లో ఎన్‌వోసీని సృష్టించినట్టు తేలింది. మరోవైపు ఏపీడీడీసీ కమిషనర్‌ పేరుతో ఉన్న డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి వాటిని నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు (ఎన్‌డీడీబీ)లో తనఖా పెట్టి 2013లో ధూళిపాళ్ల నరేంద్ర రూ.115.58 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ మొత్తాన్ని తన తండ్రి పేరుతో ఆస్పత్రి నిర్మాణానికి, నిర్వహణకు మళ్లించారు.

సంగం డెయిరీ లాభాలు, ప్రభుత్వ నిధులతో 1973, 1976, 1977, 1978లో కొనుగోలు చేసిన 72.54 ఎకరాలకు చెందిన 51 డాక్యుమెంట్లను కూడా ఏసీబీ సేకరించింది. ఈ భూములను కొట్టేసేందుకు ధూళిపాళ్ల నరేంద్ర తప్పుడు పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో డాక్యుమెంట్లు సృష్టించారు.  

ప్రభుత్వం 1995లో మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ సొసైటీ (మ్యాక్స్‌) చట్టం తెచ్చింది. దీని ప్రకారం.. ఒక సహకార సంఘాన్ని మ్యాక్స్‌ పరిధిలోకి తేవాలంటే ప్రభుత్వానికి చెందిన భూములు తిరిగి అప్పగించడంతోపాటు బకాయిలను చెల్లించాలి. అలా చేయకుండానే 1997 ఫిబ్రవరి 1న గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాన్ని మాక్స్‌ చట్టం పరిధిలోకి తెచ్చారు. నరేంద్ర సంగం డెయిరీ నిర్వహణ చూస్తునే మరోవైపు సొంతంగా మిల్క్‌లైన్‌ అనే ప్రయివేటు పాల సేకరణ కంపెనీని నిర్వహించారు. ఇది నిబంధనలకు విరుద్ధం. తర్వాత మిల్క్‌లైన్‌ కంపెనీకి తన భార్య జ్యోతిర్మయిని ఎండీని చేశారు.

చదవండి: చంద్రబాబు అండతోనే..
Sangam Dairy: ప్రభుత్వ పరిధిలోకి సంగం డెయిరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement