సాక్షి, అమరావతి: అమరావతి పాదయాత్ర విషయంలో హైకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. పాదయాత్రలో కేవలం 600 మంది మాత్రమే ఉండాలని, డీజీపీకి అందచేసిన జాబితాలో ఉన్న వ్యక్తులే పాల్గొనాలని స్పష్టం చేసింది. పాదయాత్రకు సంఘీభావం తెలపాలనుకునే వ్యక్తులు ఇరువైపులా ఉండి మద్దతు తెలపవచ్చని, అయితే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ యాత్రలో పాల్గొనడానికి వీల్లేదని ఆదేశించింది. ఈమేరకు తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. దీనివల్ల అసాంఘిక శక్తులతో శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నారంటూ పిటిషనర్లు వ్యక్తం చేస్తున్న ఆందోళన తొలగిపోతుందని పేర్కొంది.
పాదయాత్ర మార్గంలో ఇతరులు పోటీ కార్యక్రమాలు చేపట్టేందుకు అనుమతులు ఇవ్వొద్దని, అయితే సమీప దూరం ఎంత ఉండాలన్నది పోలీసులే నిర్ణయిస్తారని హైకోర్టు స్పష్టం చేసింది. పాదయాత్ర చేస్తున్నవారు, వ్యతిరేకిస్తున్న వారు పరస్పరం తారసపడకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. పాదయాత్రలో హైకోర్టు గతంలో అనుమతించిన నాలుగు వాహనాలు మినహా ఎలాంటివి ఉండటానికి వీల్లేదని స్పష్టం చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేశారు. దీనికి సంబంధించి అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావు, మరో ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు విచారించింది.
వారి హక్కులను మేమెలా కాలరాస్తాం?
మంత్రులు, ఎమ్మెల్యేల ప్రోద్బలంతో పాదయాత్రను అడ్డుకునేందుకు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని, వాటిని నిరోధించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది ఉన్నం మురళీధరరావు కోరారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ ప్రతి ఒక్కరికీ నిరసన తెలియచేసే హక్కు ఉంటుందని, అందులో భాగంగానే మీరు (అమరావతి రైతులు) పాదయాత్ర చేస్తున్నారని, అదే రీతిలో ఇతరులు నిరసన తెలుపుతుంటే వారి హక్కులను తామెలా కాలరాయగలమని ప్రశ్నించారు. 600 మందితోనే యాత్ర చేపట్టేందుకు హైకోర్టు అనుమతి పొందారని గుర్తు చేశారు. సంఘీభావం పేరుతో యాత్రలో ఇతరులెవరూ పొల్గొనడానికి వీల్లేదని పునరుద్ఘాటించారు. ఈ సమయంలో అసలు సంఘీభావం నిర్వచనం ఏమిటన్న అంశంపై కొద్దిసేపు వాదనలు జరిగాయి.
న్యాయమూర్తి స్పందిస్తూ పాదయాత్రకు షరతులతో కోర్టు నుంచి అనుమతి తీసుకుని, ఇప్పుడు వాటిని అమలు చేయకుంటే ఎలా అని ప్రశ్నించారు. షరతులను అమలు చేయడం ఇష్టం లేకుంటే ఆదేశాలను పునః సమీక్షించాలంటూ పిటిషన్ దాఖలు చేసుకోవాలన్నారు. యాత్రలోకి అసాంఘిక శక్తులు వచ్చి గొడవలు సృష్టిస్తున్నాయని ఒకవైపు ఆరోపిస్తూ మరోపక్క సంఘీభావం పేరుతో ఇతరులను యాత్రలోకి అనుమతించాలని కోరడం ఏమిటని న్యాయమూర్తి ప్రశ్నించారు. దీనికి మురళీధరరావు స్పందిస్తూ సంఘీభావం కోరకుండా అలా నడుచుకుంటూ వెళ్లిపోతే తమ యాత్ర ఉద్దేశం నెరవేరదన్నారు. ప్రజల మద్దతు కూడగట్టడమే తమ యాత్ర ప్రధాన ఉద్దేశమన్నారు. ‘అంటే మీకు ఎవరూ అడ్డు రాకూడదంటారు. పోలీసులు మాత్రం ప్రతి ఒక్కరినీ ప్రశ్నిస్తూ సంఘీభావం తెలిపే వారిని మాత్రమే యాత్రలోకి అనుమతించాలి. సంఘీభావం తెలపని వారిని పక్కకు నెట్టేయాలంటున్నారా?’ అని న్యాయమూర్తి ప్రశ్నించారు.
అనుమతి రద్దు చేయాలంటూ డీజీపీ పిటిషన్...
పాదయాత్రకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని కోరుతూ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. దీన్ని పరిగణలోకి తీసుకుంటూ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని అమరావతి పరిరక్షణ సమితిని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. పాదయాత్ర సందర్భంగా కోర్టు ఆదేశాలను ఎలా ఉల్లంఘించారో అనుబంధ పిటిషన్‌లో సవివరంగా తెలియచేశామని డీజీపీ తరఫు న్యాయవాది వేలూరు మహేశ్వరరెడ్డి నివేదించారు. పాదయాత్రను రాజకీయ యాత్రగా మార్చారని, ఇది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనన్నారు.
వారింటికి వెళ్లి వారినే తిడుతున్నారు...!
హోంశాఖ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. గతంలో పాదయాత్ర చేసినప్పుడు కూడా నిర్వాహకులు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని, అందుకు తగిన ఆధారాలున్నాయని నివేదించారు. అసలు యాత్రలో పాల్గొంటున్న వ్యక్తులెవరో కూడా తెలియని పరిస్థితి నెలకొందన్నారు. యాత్రకు ముందు, వెనుక భారీ వాహనాలతో కాన్వాయ్‌లు నడుపుతున్నారని తెలిపారు. 4 వాహనాలకే హైకోర్టు అనుమతినిచ్చిందని గుర్తు చేశారు. నిర్వాహకుల చర్యలను కోర్టు ధిక్కారంగా పరిగణించాలన్నారు. పాదయాత్ర పేరుతో 3 రాజధానులను సమర్థిస్తున్న ప్రాంతాలకు వెళ్లి అక్కడి ప్రజల మనోభావాలకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేస్తుంటే ఎవరు సహిస్తారని ప్రశ్నించారు. ఒక్క మాటలో చెప్పాలంటే 3 రాజధానులను సమర్థిస్తున్న వాళ్ల ఇళ్లకు వెళ్లి వాళ్లను తిట్టి వస్తున్నారన్నారు. యాత్ర సందర్భంగా మీటింగ్‌లు పెట్టి మాట్లాడటం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనన్నారు. పాదయాత్రను వ్యతిరేకించే వారికి కూడా ప్రాథమిక హక్కులున్నాయన్నారు.
అలాంటి వ్యాఖ్యలు చేశారో లేదో తేల్చండి
పాదయాత్రకు మద్దతు తెలిపినా, పాల్గొన్నా తీవ్ర పరిణామాలుంటాయంటూ ఎమ్మెల్యే పి.ఉమాశంకర్ గణేష్, అనుచరులు బెదిరిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ విశాఖ, అనకాపల్లి జిల్లాలకు చెందిన 9 మంది రైతులు లంచ్‌మోషన్ రూపంలో ఓ పిటిషన్ దాఖలు చేశారు. పత్రికల్లో వచ్చిన కథనాలను దీనికి జత చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్‌రావు పత్రికా కథనాలను పరిగణలోకి తీసుకోలేమన్నారు. ప్రజా ప్రతినిధులుగా ఉంటూ అలా వ్యాఖ్యలు చేయడం ఏమిటన్నారు. ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్, నర్సీపట్నం మునిసిపల్ చైర్‌పర్సన్ జి.ఆదిలక్ష్మీ తదితరులు అలాంటి వ్యాఖ్యలు చేశారో లేదో విచారణ జరపాలని పోలీసులను ఆదేశించారు.
ఇది కూడా చదవండి: అమరావతి యాత్రపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment