జగనన్న విద్యా కానుక టెండర్‌ నిబంధనలు సరైనవే..  | AP High Court Said Jagananna Vidya Kanuka Tender Terms Correct | Sakshi
Sakshi News home page

జగనన్న విద్యా కానుక టెండర్‌ నిబంధనలు సరైనవే.. 

Published Sat, Feb 5 2022 2:32 PM | Last Updated on Mon, Jun 20 2022 4:06 PM

AP High Court Said Jagananna Vidya Kanuka Tender Terms Correct - Sakshi

సాక్షి, అమరావతి: జగనన్న విద్యా కానుక పథకం కింద స్కూల్‌ బ్యాగుల పంపిణీ కాంట్రాక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన టెండర్‌ నిబంధనలన్నీ సరైనవేనని హైకోర్టు ప్రకటించింది. టెండర్‌ నిబంధనల రూపకల్పన, కాంట్రాక్టు అప్పగింత పూర్తిగా ప్రభుత్వ పరిధిలోని అంశాలని న్యాయస్థానం తేల్చి చెప్పింది. ప్రభుత్వ చర్యలు దురుద్దేశపూర్వకంగా, అధికార దుర్వినియోగంతో కూడుకున్నప్పుడు మాత్రమే న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయని స్పష్టం చేసింది. కాంట్రాక్టు వ్యవహారాల్లో ప్రభుత్వ చర్యలు నిష్పాక్షికంగా, సహేతుకంగా ఉన్నప్పుడు అందులో న్యాయస్థానాల జోక్యం చాలా పరిమితమని తేల్చి చెప్పింది. కాంట్రాక్టులో నిర్దేశించిన పనులను విజయవంతంగా పూర్తి చేయడానికి అవసరమైన సమర్థత, వనరుల కల్పన నిమిత్తమే ప్రీ–కండీషన్లు, అర్హతల నిర్ణయం జరుగుతుందని తెలిపింది.

చదవండి: పా‘పాల’ పుట్ట హెరిటేజ్‌!

కాంట్రాక్టు అప్పగింత వ్యవహారంలో ప్రభుత్వం, ప్రభుత్వ వ్యవస్థలు సహేతుకంగా, నిష్పాక్షికంగా, ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించినప్పుడు ఏ వ్యక్తి కూడా ప్రభుత్వంతో లావాదేవీలు నిర్వహించేందుకు తమకు ప్రాథమిక హక్కు ఉందని చెప్పలేరని స్పష్టం చేసింది. ప్రీ–బిడ్డింగ్‌ సమావేశంలో పాల్గొన్నంత మాత్రాన అది టెండర్‌ ప్రక్రియలో పాల్గొన్నట్లు కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. టెండర్‌ దాఖలు చేయని వ్యక్తి ఆ టెండర్‌ నోటిఫికేషన్‌ చట్టబద్ధత, చెల్లుబాటును ప్రశ్నించలేరని పేర్కొంది. జగనన్న విద్యా కానుక కాంట్రాక్టుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన టెండర్‌ నిబంధనలను చట్ట విరుద్ధమైనవిగా, ఏకపక్షమైనవిగా, అహేతుకమైనవిగా చెప్పడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ పథకం టెండర్‌ నిబంధనలను సవాల్‌ చేస్తూ అటల్‌ ప్లాస్టిక్స్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉప్మాక దుర్గా ప్రసాదరావు రెండు రోజుల క్రితం తీర్పు వెలువరించారు.

ఇదీ నేపథ్యం...
జగనన్న విద్యా కానుక పథకం కింద విద్యార్థులకు స్కూల్‌ బ్యాగులు పంపిణీకి టెండర్లను ఆహ్వానిస్తూ 2021 జనవరిలో ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చింది. రూ.39 కోట్లకు సాల్వెన్సీ సర్టిఫికెట్‌తోపాటు కంపెనీ వార్షిక టర్నోవర్‌ రూ.100 కోట్లకు పైగా ఉండాలని టెండర్‌ నిబంధనల్లో పేర్కొంది. దీన్ని సవాల్‌ చేస్తూ అటల్‌ ప్లాస్టిక్స్‌ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి జస్టిస్‌ సత్యనారాయణమూర్తి టెండర్‌ నోటిఫికేషన్‌ను రద్దు చేసి అసాధ్యమైన నిబంధనలు లేకుండా తిరిగి నోటిఫికేషన్‌ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.

సింగిల్‌ జడ్జి తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేసింది. ఈ అప్పీల్‌పై విచారణ జరిపిన సీజే ధర్మాసనం టెండర్‌ దక్కించుకున్న కంపెనీ వాదన వినకుండానే సింగిల్‌ జడ్జి తీర్పునిచ్చారంటూ ఆ తీర్పును రద్దు చేసింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని  ఈ వ్యవహారంపై తిరిగి విచారణ జరపాలని సింగిల్‌ జడ్జిని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రోస్టర్‌ ప్రకారం ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాదరావు విచారణ జరిపారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, అటల్‌ ప్లాస్టిక్స్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎల్‌.రవిచందర్‌ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్‌ దుర్గాప్రసాద్‌ రెండు రోజుల క్రితం తీర్పు వెలువరించారు.

ఆ నిబంధనను ఇప్పుడు ప్రశ్నించలేరు..
పిటిషనర్‌ అటల్‌ ప్లాస్టిక్స్‌ టెండర్‌ ప్రక్రియలో పాల్గొనలేదని, కేవలం ప్రీ–బిడ్డింగ్‌ సమావేశంలో మాత్రమే పాల్గొందని, ప్రీ–బిడ్డింగ్‌ సమావేశంలో పాల్గొనడం టెండర్‌ ప్రక్రియలో పాల్గొన్నట్లు కాదన్న అదనపు ఏజీ సుధాకర్‌రెడ్డి వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. సాల్వెన్సీ సర్టిఫికెట్‌ సమర్పించాలన్న నిబంధనను మొదటి టెండర్‌ నోటిఫికేషన్‌లోనే పొందుపరిచారని, పిటిషనర్‌ అప్పుడు ప్రశ్నించకుండా అన్యాయమంటూ కోర్టును ఆశ్రయించడం సరికాదన్న అదనపు ఏజీ వాదనలో వాస్తవముందని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.

తయారీదారు 90 రోజుల్లో 45 లక్షల బ్యాగులు సరఫరా చేయడం అంత చిన్న విషయం కాదని, అందుకే ఆర్థిక పరిపుష్టికి సంబంధించిన సాల్వెన్సీ సర్టిఫికెట్‌ నిబంధనను పొందుపరిచారని, ఇది ఎంత మాత్రం తప్పు కాదన్నారు. గత మూడేళ్ల వార్షిక టర్నోవర్‌ రూ.100 కోట్లకు పైగా ఉండాలన్న నిబంధన బిడ్డర్‌ ఆర్థిక పరిస్థితి, సమర్థతను తెలుసుకునేందుకు తెచ్చారని, ఈ నిబంధనను ఏ రకంగానూ తప్పుపట్టడానికి వీల్లేదన్నారు. వీటన్నింటి దృష్ట్యా టెండర్‌ నిబంధనలను సవాలు చేస్తూ అటల్‌ ప్లాస్టిక్స్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టి వేస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement