correct
-
జగనన్న విద్యా కానుక టెండర్ నిబంధనలు సరైనవే..
సాక్షి, అమరావతి: జగనన్న విద్యా కానుక పథకం కింద స్కూల్ బ్యాగుల పంపిణీ కాంట్రాక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన టెండర్ నిబంధనలన్నీ సరైనవేనని హైకోర్టు ప్రకటించింది. టెండర్ నిబంధనల రూపకల్పన, కాంట్రాక్టు అప్పగింత పూర్తిగా ప్రభుత్వ పరిధిలోని అంశాలని న్యాయస్థానం తేల్చి చెప్పింది. ప్రభుత్వ చర్యలు దురుద్దేశపూర్వకంగా, అధికార దుర్వినియోగంతో కూడుకున్నప్పుడు మాత్రమే న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయని స్పష్టం చేసింది. కాంట్రాక్టు వ్యవహారాల్లో ప్రభుత్వ చర్యలు నిష్పాక్షికంగా, సహేతుకంగా ఉన్నప్పుడు అందులో న్యాయస్థానాల జోక్యం చాలా పరిమితమని తేల్చి చెప్పింది. కాంట్రాక్టులో నిర్దేశించిన పనులను విజయవంతంగా పూర్తి చేయడానికి అవసరమైన సమర్థత, వనరుల కల్పన నిమిత్తమే ప్రీ–కండీషన్లు, అర్హతల నిర్ణయం జరుగుతుందని తెలిపింది. చదవండి: పా‘పాల’ పుట్ట హెరిటేజ్! కాంట్రాక్టు అప్పగింత వ్యవహారంలో ప్రభుత్వం, ప్రభుత్వ వ్యవస్థలు సహేతుకంగా, నిష్పాక్షికంగా, ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించినప్పుడు ఏ వ్యక్తి కూడా ప్రభుత్వంతో లావాదేవీలు నిర్వహించేందుకు తమకు ప్రాథమిక హక్కు ఉందని చెప్పలేరని స్పష్టం చేసింది. ప్రీ–బిడ్డింగ్ సమావేశంలో పాల్గొన్నంత మాత్రాన అది టెండర్ ప్రక్రియలో పాల్గొన్నట్లు కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. టెండర్ దాఖలు చేయని వ్యక్తి ఆ టెండర్ నోటిఫికేషన్ చట్టబద్ధత, చెల్లుబాటును ప్రశ్నించలేరని పేర్కొంది. జగనన్న విద్యా కానుక కాంట్రాక్టుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన టెండర్ నిబంధనలను చట్ట విరుద్ధమైనవిగా, ఏకపక్షమైనవిగా, అహేతుకమైనవిగా చెప్పడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ పథకం టెండర్ నిబంధనలను సవాల్ చేస్తూ అటల్ ప్లాస్టిక్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గా ప్రసాదరావు రెండు రోజుల క్రితం తీర్పు వెలువరించారు. ఇదీ నేపథ్యం... జగనన్న విద్యా కానుక పథకం కింద విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీకి టెండర్లను ఆహ్వానిస్తూ 2021 జనవరిలో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. రూ.39 కోట్లకు సాల్వెన్సీ సర్టిఫికెట్‌తోపాటు కంపెనీ వార్షిక టర్నోవర్ రూ.100 కోట్లకు పైగా ఉండాలని టెండర్ నిబంధనల్లో పేర్కొంది. దీన్ని సవాల్ చేస్తూ అటల్ ప్లాస్టిక్స్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ సత్యనారాయణమూర్తి టెండర్ నోటిఫికేషన్‌ను రద్దు చేసి అసాధ్యమైన నిబంధనలు లేకుండా తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. సింగిల్ జడ్జి తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీల్‌పై విచారణ జరిపిన సీజే ధర్మాసనం టెండర్ దక్కించుకున్న కంపెనీ వాదన వినకుండానే సింగిల్ జడ్జి తీర్పునిచ్చారంటూ ఆ తీర్పును రద్దు చేసింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ వ్యవహారంపై తిరిగి విచారణ జరపాలని సింగిల్ జడ్జిని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రోస్టర్ ప్రకారం ఈ వ్యాజ్యంపై జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు విచారణ జరిపారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, అటల్ ప్లాస్టిక్స్ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ దుర్గాప్రసాద్ రెండు రోజుల క్రితం తీర్పు వెలువరించారు. ఆ నిబంధనను ఇప్పుడు ప్రశ్నించలేరు.. పిటిషనర్ అటల్ ప్లాస్టిక్స్ టెండర్ ప్రక్రియలో పాల్గొనలేదని, కేవలం ప్రీ–బిడ్డింగ్ సమావేశంలో మాత్రమే పాల్గొందని, ప్రీ–బిడ్డింగ్ సమావేశంలో పాల్గొనడం టెండర్ ప్రక్రియలో పాల్గొన్నట్లు కాదన్న అదనపు ఏజీ సుధాకర్‌రెడ్డి వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. సాల్వెన్సీ సర్టిఫికెట్ సమర్పించాలన్న నిబంధనను మొదటి టెండర్ నోటిఫికేషన్లోనే పొందుపరిచారని, పిటిషనర్ అప్పుడు ప్రశ్నించకుండా అన్యాయమంటూ కోర్టును ఆశ్రయించడం సరికాదన్న అదనపు ఏజీ వాదనలో వాస్తవముందని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. తయారీదారు 90 రోజుల్లో 45 లక్షల బ్యాగులు సరఫరా చేయడం అంత చిన్న విషయం కాదని, అందుకే ఆర్థిక పరిపుష్టికి సంబంధించిన సాల్వెన్సీ సర్టిఫికెట్ నిబంధనను పొందుపరిచారని, ఇది ఎంత మాత్రం తప్పు కాదన్నారు. గత మూడేళ్ల వార్షిక టర్నోవర్ రూ.100 కోట్లకు పైగా ఉండాలన్న నిబంధన బిడ్డర్ ఆర్థిక పరిస్థితి, సమర్థతను తెలుసుకునేందుకు తెచ్చారని, ఈ నిబంధనను ఏ రకంగానూ తప్పుపట్టడానికి వీల్లేదన్నారు. వీటన్నింటి దృష్ట్యా టెండర్ నిబంధనలను సవాలు చేస్తూ అటల్ ప్లాస్టిక్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టి వేస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. -
క్యాష్‌లెస్ ఇలాగేనా ?
-
ఓటర్ల జాబితాను సరిచేయాలి
మహబూబ్‌నగర్ న్యూటౌన్: ఓటర్ల జాబితాల్లో చోటు చేసుకున్న తప్పులను ఈ నెల 22 లోపు సరిచేయాలని చీఫ్ ఎన్నికల అధికారి బన్వర్‌లాల్ సూచించారు. గురువారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లా అధికారులతో సమీక్షించారు. ఓటర్ల జాబితాలోని తప్పులు, డబుల్ ఎంట్రీలు, కచ్చితమైన ఫోటోలు, ఓటర్ వివరాలు సరిచేయడంతో పాటు డూప్లికేట్ ఓటర్లను జాబితా నుంచి తొలగించాలని అన్నారు. మున్సిపాలిటీలలోని పోలింగ్ కేంద్రాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి బౌండరీలను పేపర్‌పై స్కెచ్ వేసుకొని గూగుల్ మ్యాప్‌కు అప్లోడ్ చేయాలని సూచించారు.కచ్చితమైన ఓటర్ వివరాలతో సెప్టెంబర్ 31 వరకు సాంకేతిక ప్రక్రియను పూర్తి చేసి డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలను ప్రకటించాలని అన్నారు. వీసీలో డిఆర్వో భాస్కర్, ఎన్ఐసీ డీఐఓ మూర్తి, ఎన్నికల విభాగం సీనియర్ సహాయకులు హనీఫ్, కృష్ణకుమార్‌లు హాజరయ్యారు. -
అమ్మవారి లాకెట్ హుండీలో ప్రత్యక్షం
పోలీసులకు తెలియజేసిన దేవాదాయ శాఖ అధికారులు అమ్మవారి మెడలోని లాకెట్ హుండీలోకి ఎలా చేరిందో? ఇది ఇంటి దొంగల పనే అంటున్న భక్తులు ఉత్తరాంధ్రుల ఇలవేల్పు అనకాపల్లి నూకాంబిక అమ్మవారి మెడలో అదృశ్యమైన లాకెట్ హుండీలో కనిపించింది. అమ్మవారి ఆభరణాలకే రక్షణ లేదనే విషయం బయటి ప్రపంచానికి తెలిస్తే పరువుపోతుందని ఈ విషయం గోప్యంగా ఉంచేందుకు ఆలయ అధికారులు ప్రయత్నించినా, ఈ విషయం వెలుగులోకి వచ్చి పోలీసు కేసు వరకూ వెళ్లింది. అయితే సోమవారం అమ్మవారి హుండీలో ఈ లాకెట్ ప్రత్యక్షమైంది. పోయిన నగ దొరికిందని అధికారులు ఊపిరి పీల్చుకున్నప్పటికీ ఇది హుండీలోకి ఎలా చేరిందనే విషయం మాత్రం అంతుచిక్కడం లేదు. ఇది ఇంటి దొంగల పనే అని భక్తులు అంటున్నారు. అనకాపల్లి: జిల్లాలో సంచలనం సృష్టించిన అనకాపల్లి నూకాంబిక అమ్మవారి లాకెట్ అదృశ్యం కథ సుఖాంతమైంది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సోమవారం చేపట్టిన హుండీ లెక్కింపులో పోయిన బ ంగారు లాకెట్ కనిపించింది. దీంతో దేవాదాయ ధర్మాదాయ శాఖకు, ఇటు అధికారులకు తలనొప్పిగా మారిన ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినా అదృశ్యం వెనక మిస్టరీ మాత్రం వీడలేదు. ఈనెల 15న అమ్మవారి బంగారు గొలుసులో ఉన్న 30.533 గ్రాముల బంగారు లాకెట్ మాయం కావడంతో సంచలనం రేకెత్తింది. అది కూడా ఆలస్యంగా వెలుగులోకి రావడంతో నూకాంబిక అమ్మవారి ఆలయ పరిసరాల్లో జరుగుతున్న పరిణామాలపై విమర్శలు వినిపించాయి. పలు ప్రజాసంఘాలు సైతం ఈ అంశంలో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశాయి. అదే సమయంలో లాకెట్ పోయిన అంశంపై ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆధ్వర్యంలో డీఎస్పీ పురుషోత్తం సమక్షంలో పూజారులను విచారించారు. సంఘటన జరిగిన రోజు సీసీ కెమెరా దృశ్యాలు రికార్డు కాలేదని తేలడంతో ఆలయ అధికారులపై విమర్శలు, అనుమానాలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో పూజారులను పోలీసులు విచారించారు. సహజంగా అమ్మవారి ఆలయంలో బంగారు ఆభరణాలు పూజారుల నియంత్రణలో ఉంటాయి. ఆ కారణంగా బంగారు ఆభరణాలు పోయినట్లయితే పూజారుల నుంచే రికవరీ చేసే సంప్రదాయం కొనసాగుతోంది. దీన్ని కూడా పూజారుల నుంచి రికవరీ చేయాలని భావించి అమ్మవారి గర్భాలయంలో లాకెట్ మాయమైన విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు ఆలయ వర్గాలు ప్రయత్నించాయి. అయితే ఆ తరువాత ఈ అంశం వెలుగులోకి రావడంతో పోలీసుల వరకు చేరింది. ఎట్టకేలకు సోమవారం తె రిచిన అమ్మవారి హుండీ ఆదాయం లెక్కింపులో బంగారు లాకెట్ కనిపించింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ డీసీ ఎన్.వి.ఎస్.ఎన్.మూర్తి, ఆలయ ఈవో సుజాత ఆధ్వర్యంలో బయటపడిన ఈ బంగారు లాకెట్ దొరికిన అంశాన్ని అనకాపల్లి పట్టణ పోలీసులు తెలియజేశారు. క్రైం ఎస్ఐ వెంకటేశ్వరరావు లాకెట్‌ను పరిశీలించారు. ఎవరో ఒక భక్తుడు ఈ లాకెట్‌ను హుండీలో పడేసి ఉంటాడని పేర్కొన్నారు. ఇంటి దొంగ పనే? నూకాంబిక అమ్మవారి ఆలయంలో బంగారు లాకెట్ అదృశ్యం వెనుక ఇంటి దొంగల హస్తముందని ప్రచారం జరుగుతోంది. గర్భగుడిలోకి వచ్చే ప్రతి భక్తుడిపైన ప్రత్యేకమైన నిఘా ఉంటుంది. అదే సమయంలో అమ్మవారి మూలవిరాట్‌ను తాకేందుకు బారికేడు ఉంటుంది. మూలవిరాట్‌కు దగ్గరలో పూజారులు మాత్రమే విధులు నిర్వహిస్తారు. వీఐపీలు వచ్చినప్పుడు మాత్రమే గర్భగుడిలో ఫొటోలు తీయించడం ఆనవాయితీగా మారింది. అయితే అమ్మవారి మెడలో లాకెట్ హుండీలోకి ఎలా వెళ్లిందనేది చర్చనీయాంశమైంది. ఆలయవర్గాలకు చెందిన అధికార, అనధికార వ్యక్తుల్లో ఎవరో ఒకరు బంగారు లాకెట్‌ను మాయం చేసి, తర్వాత ఈ అంశం తీవ్ర దుమారాన్ని రేపడంతో హుండీలో వేసి ఉంటారని భావిస్తున్నారు. ఒక వేళ భక్తునికే దొరికి ఉంటే అది కచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి ఉండేవారని పలువురు విశ్లేషిస్తున్నారు. పోనీ గర్భగుడిలోని దృశ్యాలను సీసీ కెమెరాల ద్వారా చూడాలని ప్రయత్నిస్తే అవి పని చేయకపోవడంపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి. చివరకు హుండీలో అమ్మవారి లాకెట్ దొరికినప్పటికీ అమ్మవారి మెడలో ఉండాల్సిన బంగారు లాకెట్ హుండీలోకి చేరడం వెనక మిస్టరీ ఆ దేవునికే తెలియాలని భక్తులు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఎలా మాట్లాడుతున్నారు..?
కమ్యూనికేషన్ చాలా వరకు ప్రతీ ఒక్కరూ పనిచేసే చోట అతి తక్కువ మందితో కనెక్ట్ అయి ఉంటారు. అలా కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటూ, తమని తాము కరెక్ట్ చేసుకుంటే.. కెరీర్లో ఎదుగుదల ఉంటుంది. పరిచయం చేసుకునే పద్ధతిలో తేడాలు ఉద్యోగంలో చేరినప్పుడు... మొదటి పరిచయంలోనే మీపై ఎదుటివారికి మంచి అభిప్రాయం ఏర్పడాలి. అందుకే చాలా సందర్భాలలో ‘మొదటి పరిచయమే అత్యంత మేలైనద’ని చెబుతుంటారు. ఉదాహరణకు:‘హలో, నేను... నా పేరు ఆనంద్, నేను ...’ ఇలా మొదలుపెట్టేస్తే అవతలి వారు విసుక్కుంటారు. అలా కాకుండా ‘హలో! నా పేరు ఆనంద్..’ అని ముందుగా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుని కొంత విరామమిస్తే అవతలి వారు తమపట్ల ఆసక్తి చూపుతారు. మాటల్లో అతి వేగం అనర్ధమే! అవతలివారితో ముందు మీరు మాట్లాడాలనుకుంటే మీరేం అనుకుంటున్నారో క్లుప్తంగా చెప్పండి. అయితే, ఆ వెంటనే అవతలి వారికీ మాట్లాడే అవకాశం ఇవ్వండి. మీ మాటల్లో స్పష్టతా లోపం లేకుండా చూసుకోండి. తరచూ అంతరాయాలు ఎదుటివారు మనల్ని పలకరించడం లేదు అని వదిలేయడం ఎంత మాత్రమూ మంచిది కాదు. అవతలివారితో పరిచయం ఒక అవసరం కావచ్చు. అలాంటప్పుడు ముందు మీరే వెళ్లి ‘ఎక్స్‌క్యూజ్‌మి’.. అని మర్యాదగా పరిచయం చేసుకోవచ్చు. అవతలి వారి పలకరింపు, సమయాన్ని బట్టి సంభాషణను తగ్గించడం, పొడిగించడం చేయవచ్చు. అర్థంలేని పదాలు చెప్పే విషయం సరళంగా, సందేశం సులువుగా అర్థమయ్యేలా ఉండాలి. మాట్లాడుతున్నప్పుడు అర్థం కాని పదాలను ఉపయోగించడం వల్ల అవతలి వారికి అవి తప్పుడు సంకేతాలను ఇవ్వచ్చు. అలాంటి పదాలు మీ నోటి వెంట ఎంత ఎక్కువ వస్తుంటే మీ మధ్య సంబంధం అంతగా తగ్గిపోతుంటుందని గ్రహించాలి. ప్రతికూల పదజాలం మీరు ఏది ఇస్తే అదే మీకు తిరిగి చేరుతుంది. అందుకే, అన్ని వేళలా మీ మాటల్లో, మీ భాషలో సానుకూల ధోరణియే కనిపించాలి. అదే అదనపు బలంగా మిమ్మల్ని చేరుతుంది. అనుకూల భాష, మాట ఎప్పుడూ మీకు సాయపడుతుంది. మీ ఎదుగుదలకు తోడ్పడుతుంది. పని చేసే చోట అపసవ్యత పని చేసే చోట వాతావరణం బాగుండాలనే ఆలోచన అందరిలోనూ ఉంటుంది. అదే రక్షణగా, సురక్షితంగా అంతా భావిస్తారు. వివక్ష ఉన్నట్టు మీ చుట్టూ ఉన్న మనుషుల ప్రవర్తనల ద్వారా తెలుస్తుంది. అవి జాతి, కులం, రంగు, లైంగిక సంబంధాలు... మొదలైనవి. ఇవి చాలా సున్నితమైన అంశాలు. వాటికి సంబంధించిన విషయాలను ఇతరుల దగ్గర తప్పుగా మాట్లాడకూడదు. అనువుగాని పరిస్థితిల్లో భీతిల్లడం ఉద్యోగభద్రతకు సంబంధించి మీ చుట్టూ ఉన్నవారు రకరకాల ప్రశ్నలు వేయొచ్చు మీ దగ్గర నుంచి సమాధానం రాబట్టడానికి. మీకు సరైన విషయం తెలిస్తే చెప్పండి. లేదంటే అలాంటి వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది. -
టార్గెట్ టెంపుల్
పెందుర్తిలో ఒకేసారి 5 ఆలయాల్లో చోరీలు పెందుర్తి : పట్టణంలో చోరులు చెలరేగిపోయారు. ఏకకాలంలో ఐదు ఆలయాల్లో దొగతనానికి పాల్పడ్డారు. నాలుగు ఆలయాల్లో ఏకంగా హుండీలను మాయం చేశారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలివి.. పెందుర్తి గ్రామదేవత నూకాంబిక ఆలయం, పాతూరు పైడితల్లమ్మ, శివాలయం, ఆంజనేయస్వామి, సరిపల్లి దుర్గమాంబ ఆలయాల్లో దొంగలు చొరబడ్డారు. నూకాంబిక ఆలయంలోని దక్షిణ హుండీతో పాటు ముడుపుల హుండీని తెరిచారు. అందులోని దాదాపు 15 వేల నగదుతో పాటు, అమ్మవారి బంగారు, వెండి ఆభరణాలను తస్కరించారు. మిగిలిన ఆలయాల్లో ఉన్న హుండీలను ఎత్తుకెళ్లిపోయారు. ఒకవైపు వినాయకచవితి ఉత్సవాలతో అలజడిగా ఉన్న సమయంలో ఇలా ఏకకాలంలో ఒకే ప్రాంతంలో దొంగతనాలు జరగడంపై పోలీసులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పెందుర్తి క్రైం పోలీసులు ఘటనా స్థలాలను పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
శబరిమల అయ్యప్పకు రూ. 141 కోట్ల ఆదాయం
గత ఏడాది కంటే రూ.14 కోట్లు ఎక్కువ శబరిమల: శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయ ఆదాయం ఈ ఏడాది మరింత పెరిగింది. ఈ ప్రముఖ క్షేత్రానికి యాత్రికుల తాకిడి పెరగటంతో రూ.141.64 కోట్ల ఆదాయం చేకూరింది. ఇది గత ఏడాది కంటే రూ.14 కోట్లు ఎక్కువ. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి దీక్షా పరుల సంఖ్య పెరగడమే ఇందుకు కారణమని ఆలయ వర్గాలు తెలిపాయి. రూ.141.64 కోట్లలో హుండీ ద్వారా రూ.51.17 కోట్లు లభించాయని, ఇది కూడా గత ఏడాది కంటే దాదాపు రూ.4 కోట్లు ఎక్కువేనని పేర్కొంది. -
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.1.86 కోట్లు
విజయవాడ : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో కనకదుర్గమ్మను దర్శించుకున్న భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకల ద్వారా భారీ ఆదాయం వచ్చింది. హుండీల్లోని కానుకలను భవానీదీక్ష మండపంలో గురువారం లెక్కించారు. రూ.1,86,85,910 నగదు, 315 గ్రాముల బంగారం, 6.392 కిలోల వెండి లభించాయని ఆలయ ఈవో త్రినాథరావు తెలిపారు. 14 హుండీల ద్వారా 18 రోజుల్లో ఈ ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. రెండో దఫా హుండీల కానుకల లెక్కింపు 11వ తేదీన, మూడో విడత 14వ తేదీన జరుగుతుందని వివరించారు. గత ఏడాది దసరా ఉత్సవాల్లో 29 రోజులు 8 హుండీల ద్వారా మొదటి దఫా రూ.1.37 కోట్లు, మొత్తం రూ. 3.49 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాదితో పోల్చితే 11 రోజులు తక్కువ ఉన్నప్పటి కీ రూ.49 లక్షల మేర ఆదాయం అధికంగా వచ్చిందని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. మొత్తంగా కూడా గత ఏడాది ఆదాయాన్ని మించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని పేర్కొంటున్నారు.