ఎలా మాట్లాడుతున్నారు..?
కమ్యూనికేషన్
చాలా వరకు ప్రతీ ఒక్కరూ పనిచేసే చోట అతి తక్కువ మందితో కనెక్ట్ అయి ఉంటారు. అలా కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటూ, తమని తాము కరెక్ట్ చేసుకుంటే.. కెరీర్‌లో ఎదుగుదల ఉంటుంది.
పరిచయం చేసుకునే పద్ధతిలో తేడాలు
ఉద్యోగంలో చేరినప్పుడు... మొదటి పరిచయంలోనే మీపై ఎదుటివారికి మంచి అభిప్రాయం ఏర్పడాలి. అందుకే చాలా సందర్భాలలో ‘మొదటి పరిచయమే అత్యంత మేలైనద’ని చెబుతుంటారు. ఉదాహరణకు:‘హలో, నేను... నా పేరు ఆనంద్, నేను ...’ ఇలా మొదలుపెట్టేస్తే అవతలి వారు విసుక్కుంటారు. అలా కాకుండా ‘హలో! నా పేరు ఆనంద్..’ అని ముందుగా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుని కొంత విరామమిస్తే అవతలి వారు తమపట్ల ఆసక్తి చూపుతారు.
మాటల్లో అతి వేగం అనర్ధమే!
అవతలివారితో ముందు మీరు మాట్లాడాలనుకుంటే మీరేం అనుకుంటున్నారో క్లుప్తంగా చెప్పండి. అయితే, ఆ వెంటనే అవతలి వారికీ మాట్లాడే అవకాశం ఇవ్వండి. మీ మాటల్లో స్పష్టతా లోపం లేకుండా చూసుకోండి.
తరచూ అంతరాయాలు
ఎదుటివారు మనల్ని పలకరించడం లేదు అని వదిలేయడం ఎంత మాత్రమూ మంచిది కాదు. అవతలివారితో పరిచయం ఒక అవసరం కావచ్చు. అలాంటప్పుడు ముందు మీరే వెళ్లి ‘ఎక్స్‌క్యూజ్‌మి’.. అని మర్యాదగా పరిచయం చేసుకోవచ్చు. అవతలి వారి పలకరింపు, సమయాన్ని బట్టి సంభాషణను తగ్గించడం, పొడిగించడం చేయవచ్చు.
అర్థంలేని పదాలు
చెప్పే విషయం సరళంగా, సందేశం సులువుగా అర్థమయ్యేలా ఉండాలి. మాట్లాడుతున్నప్పుడు అర్థం కాని పదాలను ఉపయోగించడం వల్ల అవతలి వారికి అవి తప్పుడు సంకేతాలను ఇవ్వచ్చు. అలాంటి పదాలు మీ నోటి వెంట ఎంత ఎక్కువ వస్తుంటే మీ మధ్య సంబంధం అంతగా తగ్గిపోతుంటుందని గ్రహించాలి.
ప్రతికూల పదజాలం
మీరు ఏది ఇస్తే అదే మీకు తిరిగి చేరుతుంది. అందుకే, అన్ని వేళలా మీ మాటల్లో, మీ భాషలో సానుకూల ధోరణియే కనిపించాలి. అదే అదనపు బలంగా మిమ్మల్ని చేరుతుంది. అనుకూల భాష, మాట ఎప్పుడూ మీకు సాయపడుతుంది. మీ ఎదుగుదలకు తోడ్పడుతుంది.
పని చేసే చోట అపసవ్యత
పని చేసే చోట వాతావరణం బాగుండాలనే ఆలోచన అందరిలోనూ ఉంటుంది. అదే రక్షణగా, సురక్షితంగా అంతా భావిస్తారు. వివక్ష ఉన్నట్టు మీ చుట్టూ ఉన్న మనుషుల ప్రవర్తనల ద్వారా తెలుస్తుంది. అవి జాతి, కులం, రంగు, లైంగిక సంబంధాలు... మొదలైనవి. ఇవి చాలా సున్నితమైన అంశాలు. వాటికి సంబంధించిన విషయాలను ఇతరుల దగ్గర తప్పుగా మాట్లాడకూడదు.
అనువుగాని పరిస్థితిల్లో భీతిల్లడం
ఉద్యోగభద్రతకు సంబంధించి మీ చుట్టూ ఉన్నవారు రకరకాల ప్రశ్నలు వేయొచ్చు మీ దగ్గర నుంచి సమాధానం రాబట్టడానికి. మీకు సరైన విషయం తెలిస్తే చెప్పండి. లేదంటే అలాంటి వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది.