పోలీసులకు తెలియజేసిన దేవాదాయ శాఖ అధికారులు
అమ్మవారి మెడలోని లాకెట్ హుండీలోకి ఎలా చేరిందో?
ఇది ఇంటి దొంగల పనే అంటున్న భక్తులు
ఉత్తరాంధ్రుల ఇలవేల్పు అనకాపల్లి నూకాంబిక అమ్మవారి మెడలో అదృశ్యమైన లాకెట్ హుండీలో కనిపించింది. అమ్మవారి ఆభరణాలకే రక్షణ లేదనే విషయం బయటి ప్రపంచానికి తెలిస్తే పరువుపోతుందని ఈ విషయం గోప్యంగా ఉంచేందుకు ఆలయ అధికారులు ప్రయత్నించినా, ఈ విషయం వెలుగులోకి వచ్చి పోలీసు కేసు వరకూ వెళ్లింది. అయితే సోమవారం అమ్మవారి హుండీలో ఈ లాకెట్ ప్రత్యక్షమైంది. పోయిన నగ దొరికిందని అధికారులు ఊపిరి పీల్చుకున్నప్పటికీ ఇది హుండీలోకి ఎలా చేరిందనే విషయం మాత్రం అంతుచిక్కడం లేదు. ఇది ఇంటి దొంగల పనే అని భక్తులు అంటున్నారు.
అనకాపల్లి: జిల్లాలో సంచలనం సృష్టించిన అనకాపల్లి నూకాంబిక అమ్మవారి లాకెట్ అదృశ్యం కథ సుఖాంతమైంది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సోమవారం చేపట్టిన హుండీ లెక్కింపులో పోయిన బ ంగారు లాకెట్ కనిపించింది. దీంతో దేవాదాయ ధర్మాదాయ శాఖకు, ఇటు అధికారులకు తలనొప్పిగా మారిన ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినా అదృశ్యం వెనక మిస్టరీ మాత్రం వీడలేదు. ఈనెల 15న అమ్మవారి బంగారు గొలుసులో ఉన్న 30.533 గ్రాముల బంగారు లాకెట్ మాయం కావడంతో సంచలనం రేకెత్తింది. అది కూడా ఆలస్యంగా వెలుగులోకి రావడంతో నూకాంబిక అమ్మవారి ఆలయ పరిసరాల్లో జరుగుతున్న పరిణామాలపై విమర్శలు వినిపించాయి. పలు ప్రజాసంఘాలు సైతం ఈ అంశంలో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశాయి. అదే సమయంలో లాకెట్ పోయిన అంశంపై ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆధ్వర్యంలో డీఎస్పీ పురుషోత్తం సమక్షంలో పూజారులను విచారించారు. సంఘటన జరిగిన రోజు సీసీ కెమెరా దృశ్యాలు రికార్డు కాలేదని తేలడంతో ఆలయ అధికారులపై విమర్శలు, అనుమానాలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో పూజారులను పోలీసులు విచారించారు. సహజంగా అమ్మవారి ఆలయంలో బంగారు ఆభరణాలు పూజారుల నియంత్రణలో ఉంటాయి. ఆ కారణంగా బంగారు ఆభరణాలు పోయినట్లయితే పూజారుల నుంచే రికవరీ చేసే సంప్రదాయం కొనసాగుతోంది.
దీన్ని కూడా పూజారుల నుంచి రికవరీ చేయాలని భావించి అమ్మవారి గర్భాలయంలో లాకెట్ మాయమైన విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు ఆలయ వర్గాలు ప్రయత్నించాయి. అయితే ఆ తరువాత ఈ అంశం వెలుగులోకి రావడంతో పోలీసుల వరకు చేరింది. ఎట్టకేలకు సోమవారం తె రిచిన అమ్మవారి హుండీ ఆదాయం లెక్కింపులో బంగారు లాకెట్ కనిపించింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ డీసీ ఎన్.వి.ఎస్.ఎన్.మూర్తి, ఆలయ ఈవో సుజాత ఆధ్వర్యంలో బయటపడిన ఈ బంగారు లాకెట్ దొరికిన అంశాన్ని అనకాపల్లి పట్టణ పోలీసులు తెలియజేశారు. క్రైం ఎస్‌ఐ వెంకటేశ్వరరావు లాకెట్‌ను పరిశీలించారు. ఎవరో ఒక భక్తుడు ఈ లాకెట్‌ను హుండీలో పడేసి ఉంటాడని పేర్కొన్నారు.
ఇంటి దొంగ పనే?
నూకాంబిక అమ్మవారి ఆలయంలో బంగారు లాకెట్ అదృశ్యం వెనుక ఇంటి దొంగల హస్తముందని ప్రచారం జరుగుతోంది. గర్భగుడిలోకి వచ్చే ప్రతి భక్తుడిపైన ప్రత్యేకమైన నిఘా ఉంటుంది. అదే సమయంలో అమ్మవారి మూలవిరాట్‌ను తాకేందుకు బారికేడు ఉంటుంది. మూలవిరాట్‌కు దగ్గరలో పూజారులు మాత్రమే విధులు నిర్వహిస్తారు. వీఐపీలు వచ్చినప్పుడు మాత్రమే గర్భగుడిలో ఫొటోలు తీయించడం ఆనవాయితీగా మారింది. అయితే అమ్మవారి మెడలో లాకెట్ హుండీలోకి ఎలా వెళ్లిందనేది చర్చనీయాంశమైంది. ఆలయవర్గాలకు చెందిన అధికార, అనధికార వ్యక్తుల్లో ఎవరో ఒకరు బంగారు లాకెట్‌ను మాయం చేసి, తర్వాత ఈ అంశం తీవ్ర దుమారాన్ని రేపడంతో హుండీలో వేసి ఉంటారని భావిస్తున్నారు. ఒక వేళ భక్తునికే దొరికి ఉంటే అది కచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి ఉండేవారని పలువురు విశ్లేషిస్తున్నారు. పోనీ గర్భగుడిలోని దృశ్యాలను సీసీ కెమెరాల ద్వారా చూడాలని ప్రయత్నిస్తే అవి పని చేయకపోవడంపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి. చివరకు హుండీలో అమ్మవారి లాకెట్ దొరికినప్పటికీ అమ్మవారి మెడలో ఉండాల్సిన బంగారు లాకెట్ హుండీలోకి చేరడం వెనక మిస్టరీ ఆ దేవునికే తెలియాలని భక్తులు వ్యాఖ్యానిస్తున్నారు.