Locket
-
Anant-Radhika జుకర్‌బర్గ్ భార్య నగ మిస్..? నెటిజనుల కామెంట్స్ వైరల్
రిలయన్స్ అధినేత, బిలియనీర్ ముఖేష్ ,నీతా అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ బాష్‌లో ఒక ఆశ్యర్యకరమైన విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లో మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ భార్య పెండెంట్‌ను కోల్పోయిందట. దీంతో సోషల్ మీడియా సంస్థలు ఎఫ్బీ, ఇన్స్టాగ్రామ్ డౌన్‌కి ఇదే కారణమంటున్న నెటిజన్లు ఛలోక్తులు వైరల్‌గా మారాయి. గుజరాత్‌లోని జామ్ నగర్లో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించిన వేడుకలకు బాలీవుడ్, క్రీడారంగ సెలబ్రిటీలతోపాటు, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ , భార్య న్, బిల్ గేట్స్ ఆయన భార్య, గ్లోబల్ పాప్ ఐకాన్, రిహన్నా సందడి చేసిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం మార్క్ భార్యప్రిస్సిల్లా చాన్ లాకెట్ మిస్ అయింది. దీంతో భారీ గందరగోళం ఏర్పడి, జుకర్‌బర్గ్ దంపతులతో పాటు అతిథులంతా మూడున్నర గంటలపాటు లాకెట్టు కోసం వెతికినా ఫలితం లేక పోయింది. ఈ ఘటనపై రెడిట్యూజర్ వెల్లడించడంతో నెటిజన్లు ఫన్నీ కమెంట్లతో సందడి చేశారు. అందుకే ఫేస్బుక్, ఇన్‌స్టా పనిచేయ లేదంటూ కమెంట్ చేశారు. ఈ సంఘటన దురదృష్టకరం అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. అయితే చాన్ లాకెట్టు నిజంగానే పోయిందా? ఒక వేళ పోతే మళ్లీ దొరికిందా లేదా అనే దానిపై స్పష్టత లేదు. కాగా మెటా యాజమాన్యంలోని యాప్‌లు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్, థ్రెడ్లు నాలుగు రోజుల క్రితం భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా డౌన్ అయిన సంగతి తెలిసిందే. -
ఆకతాయిల నుంచి రక్షించే లాకెట్.. ఎలాగంటారా..
ఆకతాయిలుంటున్న సమాజంలో మహిళలకు రక్షణ కరవైంది. వేధింపుల నుంచి మహిళలకు రక్షణ కల్పించే విధంగా పోలీస్ శాఖ పటిష్టమైన భద్రత కల్పిస్తూ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నా ఆకతాయిల ఆగడాలను పూర్తిగా కట్టడి చేయలేకపోతున్నారు. టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో మహిళలకు భద్రత కల్పించేలా పలు యాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. అందులో భాగంగా అపరిచితులు వెంబడిస్తునప్పుడు మనం ప్రమాదంలో ఉన్నామనే విషయాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులకు తెలియజేసేలా ప్రత్యేక ‘స్మార్ట్ జ్యూవెలరీ’ని రూపొందించారు. ఈ ‘సేఫర్ స్మార్ట్ జ్యూవెలరీ’లో లాకెట్ ఉంటుంది. అది మొబైల్ యాప్‌తో కనెక్ట్ చేసుకొని మనకు కావాల్సినవారి నంబర్లు సెట్ చేసుకోవాలి. దీన్ని చెయిన్‌లా మెడలో వేసుకుని ప్రమాదం వచ్చినప్పుడు లాకెట్ వెనుక బటన్ని రెండుసార్లు నొక్కితే చాలు. మనకు కావాల్సిన వారికి మనం ప్రమాదంలో ఉన్నామని మెసేజ్ వెళ్తుంది. ఇదీ చదవండి: విమానం కంటే వేగంగా వెళ్లే రైలు.. ప్రత్యేకతలివే.. అంతేకాదు, యాప్ నుంచి మీ లైవ్ లొకేషన్ కూడా షేర్ అవుతుంది. దీంతో మిమ్మల్ని వారు సులభంగా చేరుకోగలుగుతారు. అలాగే, ప్రమాదంలో ఉన్నవారు సమీపంలోని హాస్పిటల్ లేదా పోలీస్ స్టేషన్‌కి వెళ్లేలా నావిగేట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లోని యాప్‌ల ద్వారా ఈ స్మార్ట్లాకెట్ను కనెక్ట్ చేసుకునేలా ఏర్పాటు చేశారు. -
మూఢ నమ్మకాల వల్ల జరిగే అనర్థాల నేపథ్యంలో ‘లాకెట్’
అనిల్, విభీష హీరోహీరొయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘లాకెట్’. ఫణికుమార్ అద్దేపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ పటేల్ సమర్పణలో ఇంద్రకంటి మురళీధర్ అఖిల్ విజన్ మూవీస్ బ్యానర్ ద్వారా నిర్మించారు. తాజాగా ఈ చిత్ర ప్రదర్శన హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. సమాజంలో పెరుగుతున్న మూఢనమ్మకాల పై వాటి వల్ల జరిగే అనర్దాలపై ఈ చిత్రం లో వివరించడం జరిగింది. ఈ చిత్రం విడుదలకు సిద్ధమైన సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఈ చిత్ర సమర్పకులు మహేష్ పటేల్ తో పాటు శివలాల్ పటేల్, చందూలాల్ పటేల్, భరత్ పటేల్, చమన్ పటేల్, ఘనశ్యం పటేల్, ప్రముఖ పారిశ్రామిక వేత్త రాజు అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైన్మెంట్స్ సీఈవో రాజీవ్ మాట్లాడుతూ .. దర్శకుడికి ఇది తొలి చిత్రమైన ఎంతో అనుభవం ఉన్న వాళ్లలా తెరకెక్కించారని మెచ్చుకున్నారు. మ్యూజిక్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుదందని కితాబిచ్చాడు. ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్ లో ఉండే 17 ఓటీటీ లలో 569 వ సినిమాగా లాకెట్‌ని విడుదల చేస్తున్నామని, ఈ సినిమా చిత్రం ద్వారా టీం అందరికీ మంచి పేరు వస్తుంది అన్నారు. చిత్ర సమర్పకుడి గా మహేష్ పటేల్ మాట్లాడుతూ.. మనం ఇంకా అంధ విశ్వాసాలలో ఉంటె సొసైటీ మీద మనకు ఏమి విశ్వాసం ఉంటుంది ? అని సమాజానికి మంచి మెసేజ్ ఇస్తూ దర్శక నిర్మాతలు చేసిన ఈ ప్రయత్నం చాలా బాగుంది. నటీనటులు అందరూ చాలా చక్కగా నటించారు . మంచి కాన్సెప్ట్ తో తీసిన ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలి అన్నారు. చిత్ర నిర్మాత ఇంద్రకంటి మురళీధర్ మాట్లాడుతూ .. తనతో 30 సంవత్సరాలుగా జర్నీ చేస్తున్నాను . దర్శకుడు ఫణి కుమార్ అద్దేపల్లి చెప్పిన ఒక కాన్సెప్ట్ తో కథను రెడీ చేసుకోవడంతో నేను ఈ సినిమా నిర్మించాను . తనతో ఇంకా చాలా సినిమా లు చేసే అవకాశం ఉంది . ఈ సినిమా ధియేటర్ రిలీజ్ రైట్స్ , ఆడియో , వీడియో రైట్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి . త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం తప్పక గొప్ప విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు. -
తేడా వస్తే.. ఆ బటన్‌ను రెండుసార్లు నొక్కితే చాలు.. వాళ్లకు అలర్ట్ వెళ్లిపోద్ది
ఆరోజు రాత్రి పనిఒత్తిడి వల్ల శ్వేతకు ఆఫీసు నుంచి బయటకు రావడం బాగా ఆలస్యం అయింది. ఆ సమయంలో వాళ్ల ఏరియాకు వెళ్లే బస్సులు లేవు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆటో ఎక్కాల్సి వచ్చింది. కొంత దూరం వెళ్లాక డ్రైవర్ ప్రవర్తనలో మార్పు కనిపించింది. అట్టే ఆలస్యం చేయకుండా తన మెడలోని లాకెట్‌ను రెండుసార్లు నొక్కింది శ్వేత. ప్రమాదం నుంచి బయటపడింది. అది మంత్రం దట్టించిన లాకెట్ కాదు. మామూలు లాకెట్టే...కాకపోతే టెక్నో లాకెట్టు! ‘ఆభరణాలు అందం కోసం’ అనేది నిన్నటి మాట. ‘అభరణాలు అందం కోసమే కాదు స్వీయరక్షణ కోసం కూడా’ అనేది నేటి మాట. ‘ఏ పుట్టలో ఏ పాము ఉందో’ అన్నట్లుగా ఎక్కడ, ఎప్పుడు, ఎలా ప్రమాదాలు పొంచి ఉంటాయో తెలియదు మనకు. వైద్యసూక్తి ‘చికిత్స కంటే నివారణ ముఖ్యం’లాగే మన వ్యక్తిగత భద్రత విషయంలోనూ నివారణ అనేది ముఖ్యం కావాలి. ప్రమాదాలను నివారించడంలో అందమైన ఆభరణాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. మచ్చుకు కొన్ని... మీ మెడలో కనిపించే ఇన్విసావేర్ లాకెట్‌ను చూసిన వాళ్లు ‘ఎంత బాగుందో’ అంటారు. అయితే ఈ లాకెట్పని అందంగా కనిపించడం మాత్రమే కాదు అంతకంటే ఎక్కువ. మీరు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దీనిలోని హిడెన్ బటన్‌ను రెండుసార్లు నొక్కితే చాలు మీ కుటుంబసభ్యులు, స్నేహితులలో అయిదుమందికి మీరు ప్రమాదంలో ఉన్నట్లు తెలియజేసే మెసేజ్ చేరుతుంది. బ్లూటూత్‌తో అనుసంధానమై ఉన్న ఈ లాకెట్ జీపిఎస్ లొకేషన్ తెలియజేస్తుంది. ఈ గోల్డ్ప్లేటెడ్ లాకెట్ మన భద్రత విషయంలో బంగారంలాంటి విలువైనది అని చెప్పుకోవచ్చు. ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ‘పెండెంట్ విత్ వైట్సేఫర్ వీఐ.0’ లాకెట్ గురించి... గ్రీన్‌కలర్‌లో మెరిసిపోయే ఈ లాకెట్‌లోని బాక్స్‌లో మైక్రో యుఎస్బి అమర్చబడి ఉంటుంది. బ్లూటూత్ టెక్నాలజీతో, ‘సేఫర్ బీ లీఫ్’ యాప్‌తో కలిసిపనిచేస్తుంది. ప్రమాదపరిస్థితుల్లో ఈ లాకెట్ బటన్‌ను రెండుసార్లు నొక్కితే చాలు మన వాళ్లకు సమాచారం చేరిపోతుంది. సమీపంలో ఉన్న పోలిస్‌స్టేషన్, హాస్పిటల్‌ను యూజర్ నేవిగేట్ చేసే ఆప్షన్ ఉంది. మెడలో సులభంగా ఇమిడిపోయి, ఆకర్షణీయంగా కనిపించే గ్లాస్ పెండెంట్ ‘సేఫర్’ కూడా ప్రమాద సమయాలలో మన వాళ్లను అప్రమత్తం చేయడానికి ఉపయోగపడుతుంది. ఐఐటీ–దిల్లీ, దిల్లీ టెక్నలాజికల్ యూనివర్శిటీ విద్యార్థులు దీనికి రూపకల్సన చేశారు. ‘ఒంటరి సమయంలో కూడా నా చుట్టూ పదిమంది ఉన్నారు అనే ధైర్యాన్ని సేఫర్ ఇస్తుంది’ అంటున్నారు. ‘ఏదో కొన్నామంటే కొన్నాం అన్నట్లుగా కాకుండా ప్రతిరోజు విధిగా లాకెట్‌ను మెడలో ధరించాలి’ అంటున్నారు భద్రత నిపుణులు. -
కవితపై అభిమానం.. బంగారంతో లాకెట్
సాక్షి, నిజామాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవితది ప్రత్యేక స్థానం. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తెగానే కాక తెలంగాణ ఉద్యమ నాయకురాలిగా, జాగృతి అధ్యక్షురాలిగా, ఓసారి ఎంపీగా గెలిచి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న కవిత.. నిత్య జీవితంలోనూ అదేస్థాయిలో అభిమానులు కలిగి ఉన్నారు. అయితే కొందరు అభిమానులు తాము అభిమానించే వ్యక్తి కోసం ఏం చేయడానికైన సిద్ధపడతారు. ఈ కోవకే చెందుతారు నవీపేట మండలం బినోల సొసైటీ చైర్మన్ మగ్గారి హన్మాండ్లు.. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అభిమాని ఆయన. ఆమె బొమ్మను ఏడు గ్రాముల బంగారంతో చేయించుకొని మెడలో లాకెట్ వేసుకున్నారు. కవిత ఎమ్మెల్సీగా గెలుస్తుందన్న సంతోషంలో ఈ లాకెట్ చేయించుకున్నానని హన్మాండ్లు పేర్కొన్నారు. ఆయన గతంలో కవిత పేరును చేతిపై పచ్చబొట్టు సైతం వేయించుకున్నారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఫలితాలు రేపు (సోమవారం) విడుదల కానున్నాయి. -
‘మయన్ ’ లాకెట్ గుర్తింపు
వాషింగ్టన్ : పురాతన మయన్ రాజ్యానికి చెందిన పచ్చ లాకెట్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అమెరికాలోని ఒకప్పటి మయన్ రాజ్య శిఖరాలపై ఉన్న దక్షిణ బెలిజ్ ప్రాంతంలో 2015లో జరిపిన తవ్వకాల్లో ఇది బయటపడగా, తాజాగా దీన్ని అప్పటి మయన్ రాజుకి చెందినదిగా గుర్తించారు. అలాగే లాకెట్‌ను ధరించిన మొదటిరాజుకి సంబంధించిన వివరాలను దీనిపై చెక్కిఉన్నట్లు వారు పేర్కొన్నారు. ఆంగ్ల అక్షరం ‘టీ’ఆకారంలో ఉండే ఈ లాకెట్ 7.4 అంగుళాల వెడల్పు, 4.1 అంగుళాల పొడవు ఉండి 0.3 అంగుళాల మందం ఉందని వెల్లడించారు. ఇప్పటివరకు కనుగొన్న లాకెట్ల్లో ఇది రెండో అతిపెద్దదని కాలిఫోర్నియా వర్సిటీ ప్రొఫెసర్ జెఫ్రీ బ్రాస్‌వెల్ చెప్పారు. దీనిని క్రీస్తు శకం 672 సంవత్సరంలో వాడినట్లుగా దానిపై ఉన్న చిత్రలిపిని బట్టి అర్థమవుతోందని తెలిపారు. -
అమ్మవారి లాకెట్ హుండీలో ప్రత్యక్షం
పోలీసులకు తెలియజేసిన దేవాదాయ శాఖ అధికారులు అమ్మవారి మెడలోని లాకెట్ హుండీలోకి ఎలా చేరిందో? ఇది ఇంటి దొంగల పనే అంటున్న భక్తులు ఉత్తరాంధ్రుల ఇలవేల్పు అనకాపల్లి నూకాంబిక అమ్మవారి మెడలో అదృశ్యమైన లాకెట్ హుండీలో కనిపించింది. అమ్మవారి ఆభరణాలకే రక్షణ లేదనే విషయం బయటి ప్రపంచానికి తెలిస్తే పరువుపోతుందని ఈ విషయం గోప్యంగా ఉంచేందుకు ఆలయ అధికారులు ప్రయత్నించినా, ఈ విషయం వెలుగులోకి వచ్చి పోలీసు కేసు వరకూ వెళ్లింది. అయితే సోమవారం అమ్మవారి హుండీలో ఈ లాకెట్ ప్రత్యక్షమైంది. పోయిన నగ దొరికిందని అధికారులు ఊపిరి పీల్చుకున్నప్పటికీ ఇది హుండీలోకి ఎలా చేరిందనే విషయం మాత్రం అంతుచిక్కడం లేదు. ఇది ఇంటి దొంగల పనే అని భక్తులు అంటున్నారు. అనకాపల్లి: జిల్లాలో సంచలనం సృష్టించిన అనకాపల్లి నూకాంబిక అమ్మవారి లాకెట్ అదృశ్యం కథ సుఖాంతమైంది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సోమవారం చేపట్టిన హుండీ లెక్కింపులో పోయిన బ ంగారు లాకెట్ కనిపించింది. దీంతో దేవాదాయ ధర్మాదాయ శాఖకు, ఇటు అధికారులకు తలనొప్పిగా మారిన ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినా అదృశ్యం వెనక మిస్టరీ మాత్రం వీడలేదు. ఈనెల 15న అమ్మవారి బంగారు గొలుసులో ఉన్న 30.533 గ్రాముల బంగారు లాకెట్ మాయం కావడంతో సంచలనం రేకెత్తింది. అది కూడా ఆలస్యంగా వెలుగులోకి రావడంతో నూకాంబిక అమ్మవారి ఆలయ పరిసరాల్లో జరుగుతున్న పరిణామాలపై విమర్శలు వినిపించాయి. పలు ప్రజాసంఘాలు సైతం ఈ అంశంలో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశాయి. అదే సమయంలో లాకెట్ పోయిన అంశంపై ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆధ్వర్యంలో డీఎస్పీ పురుషోత్తం సమక్షంలో పూజారులను విచారించారు. సంఘటన జరిగిన రోజు సీసీ కెమెరా దృశ్యాలు రికార్డు కాలేదని తేలడంతో ఆలయ అధికారులపై విమర్శలు, అనుమానాలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో పూజారులను పోలీసులు విచారించారు. సహజంగా అమ్మవారి ఆలయంలో బంగారు ఆభరణాలు పూజారుల నియంత్రణలో ఉంటాయి. ఆ కారణంగా బంగారు ఆభరణాలు పోయినట్లయితే పూజారుల నుంచే రికవరీ చేసే సంప్రదాయం కొనసాగుతోంది. దీన్ని కూడా పూజారుల నుంచి రికవరీ చేయాలని భావించి అమ్మవారి గర్భాలయంలో లాకెట్ మాయమైన విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు ఆలయ వర్గాలు ప్రయత్నించాయి. అయితే ఆ తరువాత ఈ అంశం వెలుగులోకి రావడంతో పోలీసుల వరకు చేరింది. ఎట్టకేలకు సోమవారం తె రిచిన అమ్మవారి హుండీ ఆదాయం లెక్కింపులో బంగారు లాకెట్ కనిపించింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ డీసీ ఎన్.వి.ఎస్.ఎన్.మూర్తి, ఆలయ ఈవో సుజాత ఆధ్వర్యంలో బయటపడిన ఈ బంగారు లాకెట్ దొరికిన అంశాన్ని అనకాపల్లి పట్టణ పోలీసులు తెలియజేశారు. క్రైం ఎస్ఐ వెంకటేశ్వరరావు లాకెట్‌ను పరిశీలించారు. ఎవరో ఒక భక్తుడు ఈ లాకెట్‌ను హుండీలో పడేసి ఉంటాడని పేర్కొన్నారు. ఇంటి దొంగ పనే? నూకాంబిక అమ్మవారి ఆలయంలో బంగారు లాకెట్ అదృశ్యం వెనుక ఇంటి దొంగల హస్తముందని ప్రచారం జరుగుతోంది. గర్భగుడిలోకి వచ్చే ప్రతి భక్తుడిపైన ప్రత్యేకమైన నిఘా ఉంటుంది. అదే సమయంలో అమ్మవారి మూలవిరాట్‌ను తాకేందుకు బారికేడు ఉంటుంది. మూలవిరాట్‌కు దగ్గరలో పూజారులు మాత్రమే విధులు నిర్వహిస్తారు. వీఐపీలు వచ్చినప్పుడు మాత్రమే గర్భగుడిలో ఫొటోలు తీయించడం ఆనవాయితీగా మారింది. అయితే అమ్మవారి మెడలో లాకెట్ హుండీలోకి ఎలా వెళ్లిందనేది చర్చనీయాంశమైంది. ఆలయవర్గాలకు చెందిన అధికార, అనధికార వ్యక్తుల్లో ఎవరో ఒకరు బంగారు లాకెట్‌ను మాయం చేసి, తర్వాత ఈ అంశం తీవ్ర దుమారాన్ని రేపడంతో హుండీలో వేసి ఉంటారని భావిస్తున్నారు. ఒక వేళ భక్తునికే దొరికి ఉంటే అది కచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి ఉండేవారని పలువురు విశ్లేషిస్తున్నారు. పోనీ గర్భగుడిలోని దృశ్యాలను సీసీ కెమెరాల ద్వారా చూడాలని ప్రయత్నిస్తే అవి పని చేయకపోవడంపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి. చివరకు హుండీలో అమ్మవారి లాకెట్ దొరికినప్పటికీ అమ్మవారి మెడలో ఉండాల్సిన బంగారు లాకెట్ హుండీలోకి చేరడం వెనక మిస్టరీ ఆ దేవునికే తెలియాలని భక్తులు వ్యాఖ్యానిస్తున్నారు.