
టార్గెట్ టెంపుల్
పెందుర్తిలో ఒకేసారి 5 ఆలయాల్లో చోరీలు
పెందుర్తి : పట్టణంలో చోరులు చెలరేగిపోయారు. ఏకకాలంలో ఐదు ఆలయాల్లో దొగతనానికి పాల్పడ్డారు. నాలుగు ఆలయాల్లో ఏకంగా హుండీలను మాయం చేశారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలివి.. పెందుర్తి గ్రామదేవత నూకాంబిక ఆలయం, పాతూరు పైడితల్లమ్మ, శివాలయం, ఆంజనేయస్వామి, సరిపల్లి దుర్గమాంబ ఆలయాల్లో దొంగలు చొరబడ్డారు. నూకాంబిక ఆలయంలోని దక్షిణ హుండీతో పాటు ముడుపుల హుండీని తెరిచారు.
అందులోని దాదాపు 15 వేల నగదుతో పాటు, అమ్మవారి బంగారు, వెండి ఆభరణాలను తస్కరించారు. మిగిలిన ఆలయాల్లో ఉన్న హుండీలను ఎత్తుకెళ్లిపోయారు. ఒకవైపు వినాయకచవితి ఉత్సవాలతో అలజడిగా ఉన్న సమయంలో ఇలా ఏకకాలంలో ఒకే ప్రాంతంలో దొంగతనాలు జరగడంపై పోలీసులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పెందుర్తి క్రైం పోలీసులు ఘటనా స్థలాలను పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.