మైనింగ్ వ్యాపారి అయ్యేందుకే చోరీలు | for making Mining merchant became theft | Sakshi
Sakshi News home page

మైనింగ్ వ్యాపారి అయ్యేందుకే చోరీలు

Published Mon, Jun 8 2015 3:19 AM | Last Updated on Sun, Sep 3 2017 3:23 AM

మైనింగ్ వ్యాపారి అయ్యేందుకే చోరీలు

మైనింగ్ వ్యాపారి అయ్యేందుకే చోరీలు

‘స్టీలు ప్లాంటులో తండ్రి ఉద్యోగం పోయింది. ఆర్థిక ఇబ్బందులో చదువును ఎనిమిదో తరగతితోనే ఆపాను. ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు చోరీల బాట పట్టాను. ఎప్పటికైనా ఛత్తిస్‌గఢ్‌లో గనులు కొనుగోలు చేసి మైనింగ్ వ్యాపారంలో స్థిరపడాలనేది లక్ష్యం’ అంటూ సీసీఎస్ పోలీసుల విచారణలో అంతర్రాష్ట్ర దేవాలయాల గజదొంగ ప్రకాష్ కుమార్ సాహూ చెప్పాడు.

విజయవాడ సిటీ: మైనింగ్ వ్యాపారి అవతారం ఎత్తాలనే లక్ష్యంతో దేవాలయాల్లో చోరీని లక్ష్యంగా ఎంచుకున్న ప్రకాష్ కుమార్ సాహూ.. ఇప్పటి వరకు 47 చోరీలు చేశాడు. ఇందులో రెండు మినహా మిగిలినవన్నీ కూడా దేవాలయాల్లో చేసినవే. దొంగ వెండి కొనుగోలు చేసే వ్యాపారులతో ఉన్న పరిచయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆలయాల్లో దొంగతనాలను ఎంచుకున్నట్టు పోలీసుల విచారణలో తెలిపాడు. సాహూ నేపథ్యం.. అరెస్టు.. రికవరీ తదితర అంశాలను ఆదివారం కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు డీసీపీలు ఎల్.కాళిదాస్, జి.వి.జి.అశోక్‌కుమార్‌తో కలిసి వెల్లడించారు.

ఛత్తిస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లా భిలాయ్‌కి చెందిన సాహూ అక్కడి స్టీల్‌ప్లాంట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నాడు. తండ్రిని ఉద్యోగం నుంచి తొలగించడంతో చిన్ననాటి నుంచే చోరీల బాటను ఎంచుకున్నాడు. 1998లో రాష్ట్రంలో సంచలనం కలిగించిన కనకదుర్గమ్మవారి కిరీటం, అరసవెల్లి సూర్యదేవాలయంలో చోరీతో సాహూ పేరు వెలుగులోకి వచ్చింది. ఒడిశాలోని భువనేశ్వర్‌లో స్థిరపడి భార్యను చదివిస్తున్న సాహూ.. నాలుగు రాష్ట్రాల పోలీసుల చిట్టాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.

సాహూ నేరాల చిట్టా
1998లో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి కిరీటంతో పాటు అరసవెల్లి సూర్యదేవాలయంలో భారీ చోరీకి పాల్పడ్డాడు. 2009, 2010లో కర్నాటకలోని పలు ఆలయాల్లోను,  2011-2012లో హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలోని ఎస్.ఆర్.నగర్, బంజారా హిల్స్, కేపీహెచ్‌బీ, వనస్థలిపురం, మార్కెట్, గాంధీనగర్, అబీబ్‌నగర్, కూకట్‌పల్లి, నల్లకుంట, ఉప్పల్ దేవాలయాల్లో చోరీలు చేశాడు. వీటికి సంబంధించి ఓ కేసులో కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. 2013లో మంగళూరు జైన మ్యూజియంలో కోట్లాది రూపాయల విలువైన బంగారం, వజ్రాలు పొదిగిన విగ్రహాలు దొంగిలించిన కేసులో మంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. 2014లో జైలు నుంచి బయటకు వచ్చాడు. 2015లొ శ్రీకాకుళం, రావులపాలెం, అమలాపురం, ఒంగోలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డాడు. మార్చి 24న ప్రసాదంపాడు సాయిబాబా గుడిలో చోరీ చేశాడు.

ఇలా చేస్తాడు
ముందుగా నేరం చేయాలనుకున్న నగరాలకు వెళ్లి లాడ్జిల్లో బస చేస్తాడు. అనంతరం నగరాన్ని కలియ తిరిగి నేరం చేసేందుకు అనువుగా ఉన్న ఆలయాలను ఎంచుకొని రెక్కీ నిర్వహిస్తాడు. రాత్రి వేళల్లో ఆలయం తలుపులను వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్, ఇనుప రాడ్, స్క్రూ డ్రైవర్ ఉపయోగించి పగులగొట్టుకొని లోపలికి వెళతాడు. నగలు, నగదు తీసుకొని టాక్సీ లేదా బస్సు ఎక్కి ఒడిశా వెళ్లి చోరీ సొత్తు విక్రయిస్తాడు.

రికవరీకి తిప్పలు
సాహూను పట్టుకోవడం ఎంత కష్టమో చోరీ సొత్తు స్వాధీనం చేసుకోవడం అంతకంటే కష్టం. ప్రసాదంపాడు సాయిబాబా గుడిలో చోరీ చేసిన తర్వాత సీసీఎస్ పోలీసులకు పట్టుబడి రికవరీ కోసం ముప్పతిప్పలు పెట్టాడు. తానా సొత్తును ఛత్తిస్‌ఘడ్‌లో విక్రయించినట్టు చెప్పడంతో పలువురు వ్యాపారులను అదుపులోకి తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేదు. పదే పదే విచారంచిన తర్వాత ఒడిస్సా, మహారాష్ట్రలో తాను సొత్తు విక్రయించిన వారి వివరాలు దశల వారీగా వెల్లడించాడు. దీంతో సీసీఎస్ పోలీసులు వ్యయప్రయాసలకోర్చి రూ.25లక్షల విలువైన వెండి, రూ.1.19 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో అదనపు డీసీపీ(క్రైమ్స్) జి.రామకోటేశ్వరరావు, క్రైం ఏసీపీలు వర్మ, పి.సుందరరాజు, సీసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement