దేవుడా.. భద్రత ఏదీ!
Published Mon, Feb 27 2017 9:06 AM | Last Updated on Sat, Aug 11 2018 6:04 PM
► ఆలయాల్లో పెరిగిపోతున్న చోరీలు
► రక్షణ లేకపోవడంతో
► విజృంభిస్తున్న దొంగలు
► ఆందోళన చెందుతున్న భక్తులు
ప్రొద్దుటూరు క్రైం:
చాలా ప్రాంతాల్లో ఆలయాలు గ్రామ శివారులో ఉంటాయి. కొన్ని చోట్ల లోయలు, నిర్మానుష్య కొండ ప్రాంతాల్లో వీటిని నిర్మిం చారు. చాలా చోట్ల దాతలు, భక్తుల సహకారంతో దేవతామూర్తుల విగ్రహాలకు వెండి తొ డుగులు, బంగారు ఆభరణాలతో అలంకరించి ఉంటారు. ఆలయాల్లో ఎంతో విలువైన ఆభరణాలు ఉన్నప్పటికీ ఏళ్ల తరబడి చెక్కు చెదరకుండా ఉండేవి. సరైన రక్షణ లేకనో ఏమో గానీ ఇటీవల జిల్లా వ్యాప్తంగా గుళ్లలో చోరీలు అధికమయ్యాయి. శివారు ప్రాంతాలతోపాటు పట్టణాలు, గ్రామం నడిబొడ్డున ఉన్న దేవస్థానాల్లోనూ దొంగలు విజృంభిస్తున్నారు. దీంతో భక్తులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
హుండీ.. వెండి ఆభరణాలే లక్ష్యంగా
జిల్లాలో ఇటీవల జరిగిన చోరీలను పరిశీలిస్తే హుండీ డబ్బు, వెండి వస్తువులనే దొంగలు లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆదాయం ఎక్కువగా వస్తున్న ప్రైవేట్, దేవాదాయశాఖ ఆలయాలకు రక్షణ ఉంటుంది. ఆదాయం లేని సాధారణ ఆలయాలకు రక్షణ అంతంత మాత్రంగా ఉంటుంది. ఉదయం నుంచి రాత్రి వరకూ అర్చకులు, భక్తులు ఆలయాల్లో ఉం టారు. రాత్రి అయితే అక్కడ ఎవరూ ఉండరు. ఈ తరహా గుళ్లలో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో చోరీలు ఎక్కువగా జరిగాయి. ప్రతి ఆలయంలో హుండీలో నగదు, కొంత మేర వెండి వస్తువులు, పంచలోహ విగ్రహాలు ఉంటాయనే ఉద్దేశంతో దుండగులు చోరీలకు పాల్పడుతున్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
వరుస చోరీలతో భక్తుల్లో ఆందోళన
వరుస చోరీలు జరగడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ప్రొద్దుటూరు మండలంలోని నరసింహాపురం గ్రామంలో వెలసిన లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో గుర్తు తెలియని దుండగులు సుమారు 6 కిలోల వెండి, బంగారు వస్తువులను దోచుకెళ్లారు. ఆలయం గ్రామం మధ్యలో ఉన్నప్పటికీ దొంగలు చాకచక్యంగా ఈ పని చేశారు. అలాగే రామేశ్వరంలోని చౌడేశ్వరి ఆలయంలో హుండీని పగులకొట్టారు. ఏడాదిలో ఇదే ఆలయంలో రెండు సార్లు చోరీ జరగడం విశేషం. కొండాపురం మండలం, దత్తాపురం, తాళ్లప్రొద్దుటూరులోని రెండు ఆలయాల్లో చోరీ జరిగింది. ఆంజనేయస్వామి, అంకాలమ్మ ఆలయాల్లో హుండీలను పగులకొట్టి డబ్బు, వెండి వస్తువులను దోచుకొని వెళ్లారు. ఎర్రగుంట్ల మండలంలోని సున్నపురాళ్లపల్లె, చిలంకూరు గ్రామాల్లోని చౌడేశ్వరి, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాల్లో దొంగతనం జరిగింది. హుండీ డబ్బుతో పాటు వెండి, బంగారు ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. రాజుపాళెం మండలంలోని వెల్లాలలో ఉన్న చెన్నకేశవస్వామి, శివాలయాల్లో ఇటీవల దొంగలు పడ్డారు. అలా గే టంగుటూరులోని వీరభద్రస్వామి, రామాలయాల్లో ఒకే రోజు రాత్రి దొంగతనం జరిగింది. ఈ నెల 18న వేంపల్లెలోని రెండు ఆలయాల్లో ఒకే రోజు రాత్రి చోరీలు జరిగాయి. దీంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
కొన్ని రోజుల క్రితం ప్రొద్దుటూరులోని వన్‌టౌన్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 25 కిలోల మేర వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో దేవతా మూర్తులకు అలంకరించే కిరీటం, దీపాలు, తొడుగులు ఉన్నాయి. కాగా జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చోరీలు జరిగాయి. ఈ ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆలయాల్లో చోరీలకు పాల్పడే ప్రత్యేక ముఠా జిల్లాలో సంచరిస్తోందేమోనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు హెచ్చరించినా
ఇళ్లతో పాటు ఆలయాల్లో చోరీలు ఎక్కువగా జరుగుతుండటంతో పోలీసులు నివారణ చర్యలు చేపట్టారు. ప్రొద్దుటూరుతో పాటు ఎర్రగుంట్ల, మైదుకూరు, కమలాపురం ప్రాంతాల్లోని ఆలయ ధర్మకర్తలతో పోలీసులు సమావేశం నిర్వహించారు. ఆలయాల్లో విలువైన బంగారు, వెండి వస్తువులు ఉంచరాదని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. పండుగలు, ఉత్సవాల సమయంలో దేవతా మూర్తుల విగ్రహాలను ఆభరణాలతో అలంకరించుకోవాలని మిగతా సమయాల్లో మాత్రం విలువైన ఆభరణాలను భద్రపరుచుకోవాలని పోలీసులు పేర్కొన్నారు. గతంలో కూడా పలుమార్లు పోలీసులు అన్ని ఆలయ కమిటీలకు నోటీసులు జారీ చేశారు. అయితే వరుసగా చోరీలు జరుగుతున్నందున మళ్లీ నోటీసులు ఇస్తున్నారు.
Advertisement
Advertisement