
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.1.86 కోట్లు
విజయవాడ : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో కనకదుర్గమ్మను దర్శించుకున్న భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకల ద్వారా భారీ ఆదాయం వచ్చింది. హుండీల్లోని కానుకలను భవానీదీక్ష మండపంలో గురువారం లెక్కించారు. రూ.1,86,85,910 నగదు, 315 గ్రాముల బంగారం, 6.392 కిలోల వెండి లభించాయని ఆలయ ఈవో త్రినాథరావు తెలిపారు. 14 హుండీల ద్వారా 18 రోజుల్లో ఈ ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు.
రెండో దఫా హుండీల కానుకల లెక్కింపు 11వ తేదీన, మూడో విడత 14వ తేదీన జరుగుతుందని వివరించారు. గత ఏడాది దసరా ఉత్సవాల్లో 29 రోజులు 8 హుండీల ద్వారా మొదటి దఫా రూ.1.37 కోట్లు, మొత్తం రూ. 3.49 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాదితో పోల్చితే 11 రోజులు తక్కువ ఉన్నప్పటి కీ రూ.49 లక్షల మేర ఆదాయం అధికంగా వచ్చిందని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. మొత్తంగా కూడా గత ఏడాది ఆదాయాన్ని మించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని పేర్కొంటున్నారు.