సాక్షి, అమరావతి: ‘‘ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల్లో దివంగత సీఎం (వైఎస్ రాజశేఖరరెడ్డి) ఫొటో ఉండకూడదంటున్నారు.. ఇలా ఉండకూడదని ఏ నిబంధనల్లో ఉంది? సుప్రీంకోర్టు తీర్పులో కూడా అలా ఉండ కూడదని ఎక్కడా లేదే! అయినా, ఆయన ఫొటో ఉండటంలో తప్పేంటి? ఆయన కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించారు కదా! ప్రభుత్వ ప్రకటనల్లో ఇలాంటి వాటిపై మీకు అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టుకే వెళ్లి చెప్పుకోండి’’.
– హైకోర్టు ధర్మాసనం
రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటో ఉండటానికి వీల్లేదని సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు నివేదించారు. ముఖ్యమంత్రి ఫొటో ఉండటం వరకు అభ్యంతరంలేదని, అయితే ఆయన తండ్రి, దివంగత సీఎం ఫొటో ఉండటం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని వివరించారు. ప్రభుత్వ ప్రకటనల్లో అధికార పార్టీ రంగులు వినియోగిస్తోందని కూడా దమ్మాలపాటి కోర్టుకు తెలియజేశారు. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులను వాడరాదని సీజే నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చిందన్నారు. ఈ వ్యాజ్యాన్ని సీజే ధర్మాసనానికి పంపుతామంటూ న్యాయమూర్తులు జస్టిస్ రాకేష్‌కుమార్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ ప్రకటనల్లో సీఎం ఫొటోను పెద్దగా వాడడంతోపాటు, ప్రకటనల జారీ విషయంలో పత్రికలపట్ల వివక్ష చూపుతున్నారంటూ విజయవాడకు చెందిన కిలారి నాగశ్రవణ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ రాకేశ్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
సుప్రీంకోర్టుకెళ్లి చెప్పుకోండి : ధర్మాసనం
పిటిషనర్ తరఫున దమ్మాలపాటి వాదనలు వినిపిస్తూ.. ప్రకటనల జారీ విషయంలో ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. అలా అయితే ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లండని సూచించింది. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని దమ్మాలపాటి చెప్పగా.. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్రాలు ఏవైనా మార్గదర్శకాలు రూపొందించాయా? అని ప్రశ్నించింది. లేదని దమ్మాలపాటి చెప్పగా, అలా అయితే సుప్రీంకోర్టుకే వెళ్లి చెప్పండని ధర్మాసనం సూచించింది. ప్రభుత్వం తన ప్రకటనల్లో ముఖ్యమంత్రి ఫొటోతో పాటు దివంగత సీఎం (వైఎస్ రాజశేఖరరెడ్డి) ఫొటో కూడా వాడుతోందని దమ్మాలపాటి చెప్పారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. అలా వాడకూడదని ఏ చట్ట నిబంధనలు చెబుతున్నాయి.. ఆయన కూడా ఈ రాష్ట్రానికి సీఎంగా సేవలు అందించారని గుర్తుచేసింది. ప్రకటనల్లో సీఎం ఫొటో మినహా మంత్రులతో సహా ఎవరి ఫొటోలు ఉండరాదని సుప్రీంకోర్టు చెప్పిందని దమ్మాలపాటి చెప్పారు. ఈ వ్యాజ్యాన్ని సీజే ధర్మాసనానికే పంపుతామంటూ ధర్మాసనం ఆ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.
చంద్రబాబు హయాంలో పిటిషనర్ ఏం చేస్తున్నారు?
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ... పిటిషనర్‌కు చంద్రబాబు బాస్ అని, అతను టీడీపీ చుట్టూ తిరుగుతుంటారని తెలిపారు. చంద్రబాబు హయాంలో పత్రికలకు ప్రకటనలిచ్చినప్పుడు పసుపు రంగు వాడారంటూ, ఓ పత్రికా ప్రకటనను ఏజీ ధర్మాసనానికి చూపించారు. ప్రభుత్వ ప్రకటనల్లో చంద్రబాబు, లోకేశ్, నారాయణ వంటి వారి ఫొటోలను విరివిగా వాడారని, అప్పుడు పిటిషనర్ చప్పుడు చేయలేదని, ఇలాంటి వైఖరిని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. సుప్రీంకోర్టు చెప్పిన దానికి పిటిషనర్ చెబుతున్న దానికి పొంతనలేదన్నారు. అనంతరం ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని సీజే ధర్మాసనానికి పంపుతూ ఉత్తర్వులు జారీచేసింది.
Comments
Please login to add a commentAdd a comment