సాక్షి, అమరావతి: పశుసంవర్థక రంగంలోని పాలు, గుడ్లు, మాంసం ఉత్పత్తిలో ఐదు రాష్ట్రాలు మంచి ఫలితాలు కనబరిచాయని నాబార్డు నివేదిక వెల్లడించింది. ఇవి కోవిడ్ సంక్షోభంలో ఈ ఘనత సాధించాయని తెలిపింది. గుడ్ల ఉత్పత్తిలో టాప్ ఐదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని పేర్కొంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పశుసంవర్థక రంగం ఉత్పత్తుల వృద్ధిపై నాబార్డు తన అధ్యయన నివేదికను విడుదల చేసింది.
2020–21 ఆర్థిక సంవత్సరంలో ఈ ఐదు రాష్ట్రాలు గుడ్ల ఉత్పత్తిలో 64.77 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో తమిళనాడు, మూడో స్థానంలో తెలంగాణ, నాల్గో స్థానంలో పశ్చిమ బెంగాల్, ఐదో స్థానంలో కర్ణాటక నిలిచాయి. ఏపీ ప్రభుత్వం కోవిడ్ సమయంలో పశు సంవర్థక, వ్యవసాయ కార్యకలాపాలు నిలిచిపోకుండా అవసరమైన చర్యలను తీసుకోవడంవల్లే ఈ ఘటన సాధించింది. అలాగే..
♦మాంసం ఉత్పత్తి విషయానికొస్తే.. టాప్ ఐదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నాల్గో స్థానంలో ఉంది.
♦పాల ఉత్పత్తిలో ఏపీ ఐదో స్థానంలో నిలిచింది. 2020–21లో ఏపీ సహా ఐదు రాష్ట్రాలు 52.70 శాతం వాటా కలిగి ఉన్నాయి.
♦అలాగే, మాంసం ఉత్పత్తిలో ఈ ఐదు రాష్ట్రాలు 57 శాతం వాటా కలిగి ఉన్నాయి.
♦దేశంలో పశువుల జనాభా 1951లో 155.3 మిలియన్లు ఉండగా 2019 నాటికి 193.46 మిలియన్లకు పెరిగింది.
పశుసంవర్థక రంగం వాటా పెరుగుదల
మరోవైపు.. వ్యవసాయ రంగంలో పశుసంవర్థక రంగం వాటా దేశంలో భారీగా పెరిగినట్లు నివేదిక తెలిపింది. 1950–51లో వ్యవసాయ రంగం స్థూల విలువల జోడింపులో పశు సంవర్థక రంగం వాటా 17.95 శాతం ఉండగా 2020–21 నాటికి అది 30.13 శాతానికి పెరిగింది. వ్యవసాయ రంగం స్థిరత్వానికి పశువుల రంగం చాలా ముఖ్యమైనదిగా నివేదిక స్పష్టం చేసింది.
చదవండి: ఏది నిజం?: పచ్చ పైత్యం ముదిరిపోయింది!
గ్రామీణ ఆదాయ వృద్ధికి పశుపోషణ ప్రధాన చోదకశక్తి అని నివేదిక వ్యాఖ్యానించింది. అలాగే, రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు పశుసంవర్థక రంగంలో అధిక ప్రభుత్వ పెట్టుబడులు అవసరమని సూచించింది. పాలు, పాల ఉత్పత్తుల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని నివేదిక పేర్కొంది. ఇటీవల కాలంలో శాస్త్రీయ, ఆధునిక సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా దేశంలో పశువుల ఉత్పత్తిని పెంచినట్లు నివేదిక పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment