
కాకినాడ: వచ్చే ఎన్నికల్లో మరే ఇతర పార్టీకి కొమ్ము కాయకుండా జనసేన ఒంటరిగా పోటీ చేస్తే మద్దతుపై నిర్ణయం తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కాపునాడు అధ్యక్షుడు పురంశెట్టి మంగారావు పవన్‌కల్యాణ్‌కు స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం కాకినాడలో మీడియాతో మాట్లాడారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల నుంచి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి కాలేదన్నారు. పవన్‌కల్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని రాష్ట్రంలోని కాపులు ఎదురుచూస్తున్నారని, అయితే రాజకీయంగా పవన్ వ్యవహరించే తీరుపైనే కాపునాడు నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.
జనసేన పార్టీ రాష్ట్రంలోని అన్ని స్థానాలకు ఒంటరిగా పోటీ చేయాలని కోరారు. కాపుల ఆత్మాభిమానాన్ని కాపాడుతూ మరే ఇతర పార్టీకి కొమ్ముకాసేలా వ్యవహరించకుండా ఉంటే మద్దతుపై ఆలోచిస్తామని స్పష్టం చేశారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఎవరినో ముఖ్యమంత్రిని చేసేందుకు పవన్‌కల్యాణ్ పాట్లు పడుతున్నట్టు కనిపిస్తోందన్నారు. అదే జరిగితే రాష్ట్రంలోని కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల ఓటర్లు, కాపు సంఘాలు కూడా మద్దతు ఇచ్చే పరిస్థితి ఉండదన్నారు. దీనిపై పవన్‌కల్యాణ్ కాపుల ఆత్మగౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment