సాక్షి, కాకినాడ: కాకినాడలో నిన్నటి నుంచి ఎడతెగని మంత్రాంగంలో మునిగిపోయారు పవన్ కళ్యాణ్. తన వైఫల్యాలను నియోజకవర్గ ఇంఛార్జ్‌లపై నెడుతూ జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లపై అసంతృప్తి వెళ్లగక్కారు. కాకినాడ పార్లమెంటు పరిధిలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో ముఖాముఖి సమీక్షలో పవన్ మాట్లాడుతూ వార్డు స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేసుకోలేరా? అంటూ మండిపడ్డారు. పవన్ తీరుపై జనసేన నేతల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వచ్చే ఎన్నికలకు త్యాగాలకు సిద్దం కావాలని స్పష్టత ఇచ్చిన పవన్ ముందు కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ సహకరించడం లేదంటూ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన నేతల ఫిర్యాదులను కూడా పవన్ పట్టించుకోవడం లేదు.
మరోవైపు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు మాట దేవుడెరుగు.. కనీసం సమన్వయం కూడా కుదరడం లేదు. రెండు పార్టీ నాయకులు పైకి పొత్తులు.. లోపల కత్తులు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. శ్రేణులు సైతం ధృతరాష్ట్ర కౌగిలి తరహాలోనే వ్యవహరిస్తున్నాయి. సమన్వయం కోసం నిర్వహిస్తున్న సంయుక్త సమావేశాలు రచ్చరచ్చ అవుతున్నాయి.
జగ్గంపేట సీటు టీడీపీకి ఇస్తే సహకరించేది లేదని పాఠంశెట్టి సూర్యచంద్ర తేల్చిచెప్పారు. పెద్దాపురం సీటు జనసేనకు ఇవ్వాలని తుమ్ముల బాబు పట్టుబడుతున్నారు. పిఠాపురం నుండి జనసేన పోటీ చేస్తే టీడీపీ నేత వర్మ స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగే అవకాశం ఉందని తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్.. పవన్‌కు చెప్పారు.
మిగతా సీట్లు సరే, భీమవరంలో పరిస్థితేంటని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్.. భీమవరంలో జనసేన గెలిచే అవకాశాలపై ఆరా తీశారు. తెలుగుదేశం మద్ధతిస్తే జనసేన బయటపడుతుందా అన్న విషయంపై చర్చ జరిగింది. మరో సారి భీమవరం నుంచి అదృష్టం పరీక్షించుకునే యోచనలో ఉన్న పవన్ కళ్యాణ్.. ఈ సారి కూడా ఎమ్మెల్యేగా గెలవకపోతే.. పొలిటికల్ కెరియర్ ప్రమాదంలో పడుతుందన్న ఆందోళనలో ఉన్నారు.
ఇదీ చదవండి: అందుకేనట బాబు రహస్య మంతనాలు!
Comments
Please login to add a commentAdd a comment