వారంతా పదేళ్ళుగా జనసేన జెండా మోస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు ఆ జెండా కర్రలే మిగిలాయి. పార్టీని నమ్మినవారిని పవన్‌కల్యాణ్ నిలువునా ముంచేశారు. అందుకే వారంతా ఆ జెండా కర్రలతోనే తిరగబడుతున్నారు. పవన్ చేసిన మోసానికి తాము బలయ్యామని మండిపడుతున్నారు. ప్యాకేజీ స్టార్‌గా మారిపోయి పార్టీని చంద్రబాబుకు అద్దెకిచ్చిన పవన్ అందరినీ నట్టేట ముంచేశారని రోదిస్తున్నారు. రానున్న రోజుల్లో జనసేన పూర్తిగా అదృశ్యమవుతుందని శాపనార్థాలు పెడుతున్నారు. అసలు జనసేనలో ఏం జరుగుతోందో చూద్దాం.
ఎవరైనా రాజకీయ పార్టీ స్థాపిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తారు. అంతకంటే ముందు పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తారు. నాయకుల్ని తయారు చేసుకుంటారు. కాని జనసేనను పదేళ్ళ క్రితం స్థాపించిన పవన్‌కల్యాణ్ తన పార్టీని టీడీపీకి అద్దెకిచ్చేశారు. అప్పటి నుంచి చంద్రబాబు కోసమే కష్టపడుతున్నారు. అందుకు తగిన ప్రతిఫలం ప్యాకేజీ రూపంలో అందుకుంటున్నారు.
ఇవన్నీ జనసేనలో పదేళ్ళుగా పనిచేస్తున్నవారే చెబుతున్న మాటలు. తనకు కులం లేదంటూ కులాల మధ్య చిచ్చు పెట్టిన పవన్ తన సొంత కులానికి, బీసీలకు పూర్తిగా అన్యాయం చేశారని పవన్‌ను నమ్మి మునిగిపోయిన నాయకులు చెబుతున్నారు. అందుకే జనసేన జెండా మోసినందుకు సిగ్గుపడుతూ ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వెళ్ళిపోతున్నారు.
విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి చెందిన పోతిన మహేష్ పవన్ కళ్యాణ్ తీరును ఎండగడుతూ జనసేన పార్టీకి రాజీనామా చేశారు. పశ్చిమ సీటును తనకు ఇస్తున్నట్లు ప్రకటించి చివరికి చంద్రబాబు ఆదేశం మేరకు ఆయన బినామీ సుజనాచౌదరికి బీజేపీ తరపున టిక్కెట్ దక్కేలా చేశారని పోతిన చెప్పారు. పవన్ చేసిన మోసానికి ఆగ్రహించిన పోతిన తన కార్యాలయంలో ఆయన ఫ్లెక్సీలను, ఫోటోలను తొలగించారు.
బడుగు బలహీన వర్గాల వారిని పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు బినామీ కోసం బీసీ నేతనైన తనను బలి పశువును చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలే త్యాగాలు చేయాలా అగ్రకుల నేతలతో త్యాగాలు చేయించలేరా అంటూ పవన్‌ను నిలదీశారు పోతిన మహేశ్..
కైకలూరు టిక్కెట్ ఆశించిన బివి రావు కూడా పోతిన మహేష్ దారిలోనే పయనించి..జనసేన పార్టీకి రాజీనామా చేశారు. గతంలో ఆయన కైకలూరు నుంచి జనసేన తరపున పోటీ చేశారు. ఈసారి పొత్తులో భాగంగా చంద్రబాబు తొత్తుగా వ్యవహరించే బీజేపీ నేత కామినేని శ్రీనివాస్‌కు కైకలూరు అసెంబ్లీ సీటు కేటాయించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన బి వి. రావు జనసేన పార్టీకి గుడ్ బై చెప్పేసారు.
పితాని బాలకృష్ణ ఉభయగోదావరి జిల్లాలో బలమైన శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన నేత. ముమ్మిడివరం జనసేన ఇన్‌ఛార్జ్‌గా పనిచేసేవారు.. బాలకృష్ణ ముమ్మిడివరం నుంచి పోటీ చేస్తారని అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ప్రకటించారు. బీసీలు అంటే తనకు అభిమానమని తెలిపారు. చివరికి పవన్ కళ్యాణ్ మాటలు నీటి మీద రాతలు గానే తేలిపోయాయి. ముమ్మిడివరం సీటును పొత్తులో భాగంగా టిడిపికి కేటాయించారు. బీసీలకు జరుగుతున్న మోసాన్ని తట్టుకోలేక పితాని బాలకృష్ణ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు.
కాకినాడ మాజీ మేయర్ పొలసపల్లి సరోజ కాకినాడ రూరల్ సీటుపై గంపెడాశలు పెట్టుకున్నారు. పార్టీ కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో తనకే సీటు వస్తుందని ఆశించారు. కానీ అక్కడ సరోజని కాదని మరొకరికి పవన్ సీటు ఇచ్చారు. దీంతో ఆమె ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ తీరుపై భగ్గుమన్నారు.
పార్టీలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు. అనకాపల్లి లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.. అనకాపల్లిలో మొదటి నుంచి పార్టీ కార్యక్రమాలను నియోజకవర్గ ఇంఛార్జ్‌గా పరుచూరి భాస్కరరావు బాధ్యతలు నిర్వహించేవారు.
పవన్ కళ్యాణ్ అనకాపల్లి జిల్లాకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ భాస్కరరావే ఖర్చు భరించేవారు. భాస్కరరావుని కాదని ఇటీవల పార్టీలో చేరిన కొణతాల రామకృష్ణకు అనకాపల్లి ఎమ్మెల్యే సీటు పవన్ కళ్యాణ్ జనసేన తరపున కేటాయించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన భాస్కరరావు జనసేన పార్టీకి రాజీనామా చేశారు.
పిఠాపురంలో మాకినీడు శేషుకుమారికి సీటు ఇస్తామని చెప్పి ఆమెతో పార్టీ కోసం భారీగా ఖర్చు పెట్టించారు. పిఠాపురంలో పోటీ చేయాలని భావించిన పవన్ ఆమెను పక్కనపెట్టారు. పార్టీకి పనిచేసిన మహిళా నేతగా పిఠాపురంలో ఆమెకు సీటు ఇవ్వకపోయినా వేరే నియోజకవర్గంలో సీటు ఇస్తారని ఆమె ఆశించారు.
కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆమెకు ఎక్కడా సీటు లేదంటూ చెప్పేశారు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై జనసేనకు రాజీనామా సమర్పించి ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంకా మిగిలిన మరికొందరు నేతలు కూడా జనసేనను వీడేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment