Kapunadu
-
బాలకృష్ణకు కాపునాడు అల్టిమేటం
సాక్షి, విజయవాడ: టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తెలుగు సినీ దిగ్గజాలను ఉద్దేశించి తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై కాపునాడు తాజాగా ఆయనకు అల్టిమేటం జారీ చేసింది. బాలకృష్ణ వ్యాఖ్యలు కాపుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్నాయని, ఈ నెల 25వ తేదీలోపు క్షమాపణ చెప్పాలని బాలయ్యను డిమాండ్ చేశాయి. ఒకవేళ బాలకృష్ణ గనుక క్షమాపణలు చెప్పని తరుణంలో.. రంగా విగ్రహాల వద్ద మౌన ప్రదర్శన పాటించి నిరసన తెలపాలని కాపు సోదరులకు కాపునాడు పిలుపు ఇచ్చింది. నిర్ణీత సమయంలోపు బాలకృష్ణ కాపు సామాజిక వర్గానికి క్షమాపణలు చెప్పాలి. గతంలో దేవీబ్రహ్మణులపై వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్న బాలయ్య.. సంతకం లేని లేఖ రిలీజ్ చేసి క్షమాపణలు చెప్పాడు. ఇప్పుడు అలాకాకుండా ప్రెస్‌మీట్ పెట్టి మరీ కాపు సామాజిక వర్గానికి క్షమాపణలు చెప్పాలని కాపునాడు డిమాండ్ చేస్తోంది. అలా జరగని పక్షంలో.. టీడీపీ నుంచి బాలకృష్ణను పదేళ్ల పాటు బహిష్కరించాలి. ఇవేవీ జరగకుంటే నారా లోకేష్ చేపట్టబోయే యువ గళం పాదయాత్రను అడ్డుకుంటామని కాపునాడు హెచ్చరికలు జారీ చేసింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ దిగ్గజ నటుడు ఎస్వీ రంగారావును ఉద్దేశిస్తూ నందమూరి బాలకృష్ణ ‘‘ఆ రంగా రావు.. ఈ రంగా రావు’’ అని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను కాపునాడు తీవ్రంగా పరిగణించింది. గతంలో కూడా.. కాపు సామాజిక వర్గాన్ని ఉద్దేశిస్తూ బాలయ్య తీవ్ర వ్యాఖ్యలే చేశారు. రాజకీయాలలో చిరంజీవి విఫలమయ్యారని వ్యాఖ్యానించిన క్రమంలో.. రాజకీయాలలో విజయం తమకే సాధ్యమని.. ‘‘మా బ్లడ్డు వేరు మా బ్రీడు వేరు’’ అంటూ చేసిన కామెంట్లు కూడా కాపుల మనోభావాలని తీవ్రంగా దెబ్బతీశాయి. అటుపై జనసేన పార్టీ లో తిరిగే వారందరూ అలగాజనం అనీ సంకరజాతి జనం అని అంటూ చేసిన వ్యాఖ్యలైతే ఏకంగా గుండెల్లో గునపాలు దింపాయని కాపు సామాజిక వర్గం పేర్కొంది. -
కాపుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దు పవన్
కాకినాడ: వచ్చే ఎన్నికల్లో మరే ఇతర పార్టీకి కొమ్ము కాయకుండా జనసేన ఒంటరిగా పోటీ చేస్తే మద్దతుపై నిర్ణయం తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కాపునాడు అధ్యక్షుడు పురంశెట్టి మంగారావు పవన్‌కల్యాణ్‌కు స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం కాకినాడలో మీడియాతో మాట్లాడారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల నుంచి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి కాలేదన్నారు. పవన్‌కల్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని రాష్ట్రంలోని కాపులు ఎదురుచూస్తున్నారని, అయితే రాజకీయంగా పవన్ వ్యవహరించే తీరుపైనే కాపునాడు నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. జనసేన పార్టీ రాష్ట్రంలోని అన్ని స్థానాలకు ఒంటరిగా పోటీ చేయాలని కోరారు. కాపుల ఆత్మాభిమానాన్ని కాపాడుతూ మరే ఇతర పార్టీకి కొమ్ముకాసేలా వ్యవహరించకుండా ఉంటే మద్దతుపై ఆలోచిస్తామని స్పష్టం చేశారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఎవరినో ముఖ్యమంత్రిని చేసేందుకు పవన్‌కల్యాణ్ పాట్లు పడుతున్నట్టు కనిపిస్తోందన్నారు. అదే జరిగితే రాష్ట్రంలోని కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల ఓటర్లు, కాపు సంఘాలు కూడా మద్దతు ఇచ్చే పరిస్థితి ఉండదన్నారు. దీనిపై పవన్‌కల్యాణ్ కాపుల ఆత్మగౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని సూచించారు. -
అశ్వనీదత్.. నోరు అదుపులో పెట్టుకో
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై సినీ నిర్మాత చలసాని అశ్వనీదత్ చౌదరి చేసిన వ్యాఖ్యలను అమరావతి కాపునాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యర్రంశెట్టి అంజిబాబు గురువారం ఖండించారు. ముద్రగడపై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. అశ్వనీదత్ ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముద్రగడను వాడు, వీడు అంటూ సంబోధించడాన్ని తప్పుబట్టారు. కుల అహంకారంతో ముద్రగడను దూషించిన అశ్వనీదత్‌కు కాపుల నుంచి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. కాపులది పిచ్చి ఉద్యమమని వ్యాఖ్యానించి.. కాపు జాతిని అవమానించారని మండిపడ్డారు. -
కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు
-
‘చంద్రబాబు వల్లే ఈడబ్ల్యూఎస్‌లో కాపులకు నష్టం’
సాక్షి, అమరావతి : చంద్రబాబు నాయుడు నిర్వాహకం వల్ల ఈడబ్ల్యూఎస్ పథకంలో కాపుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ల సుబ్రహ్మణ్యం విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈడబ్ల్యూఎస్ పథకం దేశవ్యాప్త పథకం అయితే చంద్రబాబు అది కేవలం ఏపీకి మాత్రమేనన్న భ్రమలు కల్పించారని మండిపడ్డారు. ఈడబ్ల్యూఎస్‌పై చంద్రబాబు గతంలో తూతూమంత్రంగా జీవో జారీ చేశారని ఆరోపించారు. చంద్రబాబు నిర్వాహకంతో ఈడబ్ల్యూఎస్ పథకంపై స్పష్టత లేక చాలా మంది విద్యార్థులు నష్టపోయారన్నారు. ఈడబ్ల్యూఎస్‌పై వస్తున్న పుకార్లను ఎవరూ నమ్మొద్దని కోరారు. కాపునాడు విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వ జీవోని యధాతదంగా అమలు చేయడం వల్ల అగ్రవర్ణాల్లోని పేద పిల్లలకు పదివేల సీట్లు పెరిగాయని చెప్పారు. దీంతో జనాభాశాతం ఎక్కువగా ఉన్న కాపు విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయని వివరించారు. తన రాజకీయ లబ్ధి కోసమే కాపులను చంద్రబాబు తప్పుదారి పట్టించారని ఆరోపించారు. -
ఇప్పటికే చిరంజీవి చేతిలో నష్టపోయారు
విజయవాడ : ఇప్పటికే కాపు సామాజిక వర్గం సినీ నటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి చేతుల్లో తీవ్ర నష్టాలకు గురైందని ఏపీ కాపునాడు అధ్యక్షుడు పిళ్లా వెంకటేశ్వర రావు ఓ ప్రకటనలో సంచనల వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ రూపంలో మరో చిరంజీవి నాటి పరిస్థితులకు కాపు సామాజిక వర్గం గురైతే, సభ్య సమాజంలో మరో పాతికేళ్ల వరకూ తలెత్తుకు తిరగలేని పరిస్థితి ఎదుర్కోవలసి వస్తోందని అన్నారు. ఈ దుస్థితిని కాపు సామాజిక వర్గానికి కల్పించవద్దని పవన్ కల్యాణ్‌కు విజ్ఞప్తి చేశారు. ఏపీ హక్కుల సాధనకు పోరాటం చేస్తోన్న సీఎం చంద్రబాబు నాయుడికి అభినందనలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు పోరాటాన్ని బలహీనపరిచే ఏ చర్య అయినా..కాపు సామాజిక వర్గ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని గట్టిగా భావిస్తున్నానని తెలిపారు. చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచవలసిన తరుణంలో పవన్ కల్యాణ్ వ్యవహార శైలి కాపులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నదని వెల్లడించారు. బీజేపీ హామీలు మరచిన విధానం చూడగానే తెలుగువారికి ఒళ్లు కంపరం పుడుతున్న దశలో..బీజేపీ భావాలకు వకాల్తా పుచ్చుకుని కాపు సామాజిక వర్గానికి ద్రోహం తలపెట్టవద్దని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. -
ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యం
పులివెందుల : బలిజ కులస్తులందరూ ఐకమత్యంగా ఉండి, అభివృద్ధి సాధించాలని రాష్ట్ర కాపు నాడు అధ్యక్షుడు నారాయణస్వామి రాయల్ తెలిపారు. పట్టణంలోని శ్రీకృష్ణ దేవరాయ బలిజ సంఘం నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక శ్రీకృష్ణదేవరాయ కల్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని ఇతర జిల్లాల బలిజ సంఘ కమిటీ సభ్యులతోపాటు పట్టణంలోని బలిజ సంఘీయులు పాల్గొన్నారు. ఇటీవల శ్రీకృష్ణదేవరాయ బలిజ సంఘ అధ్యక్షునిగా గంగల వీరాంజనేయులును ఎన్నుకున్నారు. ఆయన తన పదవికి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఏర్పాటైన సభలో నారాయణస్వామి మాట్లాడుతూ పులివెందులలో బలిజ సంఘీయుల కోసం నూతన కల్యాణ మండపం ఏర్పాటు చేస్తున్నారని.. దానికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానన్నారు. రాష్ట్రంలోని బలిజ సంఘీయులమందరం శాంతి, సహనంతో తమకు రావాల్సిన హక్కుల కోసం పోరాటం చేద్దామన్నారు. ముఖ్యంగా యువత ఇందులో ఎక్కువగా భాగస్వామ్యం కావాల్సి ఉందన్నారు. రాయలసీమ బలిజ సోదరుల ఐక్య పోరాట సమితి అధ్యక్షుడు రాము మాట్లాడుతూ బలిజలంతా ఐక్యతతో ముందుకెళ్లాలని సూచించారు. రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా అందరూ ఏకమైతే మన హక్కులను సులభంగా సాధించుకొని తీరుతామన్నారు. అనంతరం నూతన అధ్యక్షుడు వీరాంజనేయులు మాట్లాడుతూ తనను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు బలిజ సోదరులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. బలిజ కులస్తుల సాధక బాధలు తీర్చుటకు శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కాపు సమాఖ్య అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు కుమార్, ఆంజనేయకుమార్, వేంపల్లె బలిజ సంఘ అధ్యక్షుడు రెడ్డయ్య, రాష్ట్ర బలిజ సోదరుల ఐక్య పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కృష్ణమూర్తి, రిటైర్డు డీఎస్పీ శివశంకర్, రాష్ట్ర బలిజ సంఘ మాజీ ప్రధాన కార్యదర్శి పత్తి నాగేశ్వరరావు, పులివెందుల మాజీ అధ్యక్షుడు బాలు, రాధాకృష్ణ, నూతన ఉపాధ్యక్షుడు శ్రీరామసుబ్బయ్య, పూల రమేష్, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
‘బీసీ జాబితాలోకి చేర్చేదాకా పోరాటం’
కదిరి టౌన్: అన్ని విధాలా వెనుకబడి ఉన్న బలిజలను బీసీ జాబితాలోకి చేర్చి అభివృద్ధి పరచాలని కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు నారాయణస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని దత్తా ఫంక్ష¯Œన్ హాల్లో బలిజ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాౖటెన బలిజ చైతన్య యాత్ర అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బలిజ తాలూకా అ«ధ్యక్షుడు గరడాల రమణ అధ్యక్షత వహించగా, కార్పొరేట్ కంపెనీ ఎండీ రమేష్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి అందరూ ఏకతాటిపై వచ్చి బలిజల హక్కులు సాధించేవరకు నిరంతరం పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. బీసీల్లోకి చేర్చేవరకు ఎవరూ విశ్రమించరాదని, హక్కుల్ని పొందేవరకు ప్రభుత్వంపై పోరాడాలన్నారు. సమావేశంలో ఆ సంఘం నాయకులు సురేష్, శ్రీనివాసులు ప్రసాద్, రమేష్, సూరి, శీన, సుబ్బయ్య, రమణ, వెంకటనారాయణ, సురేష్‌బాబు, రాముడు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
‘మంజునాథన్’అనుకూలంగా లేకుంటే పోరాటమే
జిల్లా కాపునాడు ప్రధాన కార్యదర్శి బండారు చంద్రశేఖర్ చిలకలపూడి : కాపు సామాజిక వర్గానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంజునాథన్ కమిషన్ నివేదిక తమకు అనుకూలంగా లేకపోతే పోరాటం తప్పదని జిల్లా కాపునాడు ప్రధాన కార్యదర్శి బండారు చంద్రశేఖర్ అన్నారు. ప్రభుత్వం విధించిన గడువు ప్రకారం 31వ తేదీలోపు మంజునాథన్ కమిషన్ నివేదిక ఇవ్వాల్సి ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన విధంగా కాపులను బీసీల్లో చేర్చాలని, సంవత్సరానికి వెయ్యి కోట్లు రూపాయలు బడ్జెట్లో నిధులు కేటాయించాలని నిర్ణయం తీసుకోకపోతే సెప్టెంబరు నుంచి ముద్రగడ పద్మనాభం నిర్వహించే పోరాటానికి కాపు జాతి అంత సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే కాపు కార్పొరేషన్ ద్వారా 13 జిల్లాలో కాపులు ఎంత మందికి రుణాలు మంజూరు చేశారు. ఇప్పటి వరకు ఎంత మందికి సబ్సిడీ రూపంలో నగదును వారి బ్యాంకు ఖాతాలకు జమ చేశారో వివరాలు తెలియపరచాల్సి ఉందన్నారు. వెల్లడించని పక్షంలో పార్టీలకు అతీతంగా కాపు సామాజిక వర్గం అంతా పోరాటాలు చేసేందుకు సిద్ధం కావాలన్నారు. -
ప్రవాసాంధ్రులు ఐక్యంగా ఉండాలి
–కాపునాడు జిల్లా అధ్యక్షుడు భాస్కర్ పిలుపు యూనివర్సిటీ క్యాంపస్: అమెరికాలోని ప్రవాసాంధ్రులు ఐకమత్యంతో మెలగాలని ఏపీ కాపునాడు చిత్తూరు జిల్లా అధ్యక్షుడు దేపూరి భాస్కర్ కోరారు. అమెరికాలోని అట్లాంటా ప్రాంతంలో అమెరికన్ పోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఏపీటీఏ) ఆధ్వర్యంలో మంగళవారం ప్రవాసాంధ్రుల సమ్మర్ ఫెస్టివల్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన దేపూరి భాస్కర్ మాట్లాడుతూ ప్రవాసాంధ్రులు ఏపీలోని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి సహకరించాలని కోరారు. ఏపీలో కాపులను బీసీలుగా మార్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పసుపులేటి సురేష్ పాల్గొన్నారు. -
ఆరు నెలల్లో నెరవేర్చకుంటే ఆమరణదీక్ష
అన్నవరం (తూర్పు గోదావరి): ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల హామీ ప్రకారం.. ఆరు నెలల్లో కాపులను బీసీల్లో చేర్చి, కాపుల సంక్షేమం కోసం రూ.1,000 కోట్లు విడుదల చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు పిళ్లా వెంక టేశ్వరరావు ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో మంగళవారం జరిగిన కాపునాడు కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపులను బీసీలలో ఎన్నికల ముందు పాదయాత్ర సందర్భంగా చంద్రబాబు ప్రకటించారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఆ డిమాండ్ నెరవేర్చలేదన్నారు. అలాగే, కాపుల సంక్షేమం కోసం ఏడాదికి రూ.1,000 కోట్లు ఇస్తానన్న చంద్రబాబు కేవలం రూ.100 కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించారని, అందులో రూ.50 కోట్లు విడుదల చేశారన్నారు. ఇది కూడా తమను మోసం చేయడమేనని విమర్శించారు. ఈ రెండు డిమాండ్లు ఆరు నెలల్లో నెరవేర్చకపోతే తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాపునాడు ప్రధానకార్యదర్శి ప్రగడ సుబ్బారావు, కార్యదర్శి తోటకూర నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
మిరియాల కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపునాడు అధ్యక్షుడు దివంగత మిరియాల వెంకట్రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. హైదరాబాద్ నుంచి మంగళవారం విశాఖపట్నం వెళ్లిన వైఎస్ జగన్ మిరియాల వెంకట్రావు ఇంటికి వెళ్లారు. వెంకట్రావు చిత్రపటం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. వైఎస్ జగన్.. వెంకట్రావు కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
వైఎస్సార్ సీపీకే కాపుల మద్దతు
ముదినేపల్లి రూరల్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో కాపు కులస్తులు వైఎస్సార్ సీపీకే మద్దతివ్వాలని కాపునాడు రాష్ట్ర కార్యదర్శి జె.ఎస్.ఆర్.నాయుడు కోరారు. ఎన్నికల పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం ముదినేపల్లిలో ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు కాపు ద్వేషిగా వ్యవహరిస్తున్నారని, తమకు తక్కువ సీట్లు ఇచ్చి పక్షపాత వైఖరి నిరూపించున్నాని విమర్శించారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి 6 ఎంపీ, 32 ఎమ్మెల్యే సీట్లు కేటాయించి అభిమానాన్ని చాటుకున్నారని కొని యాడారు. జిల్లాలో కాపులకు ఆరు సీట్లు ఇచ్చిన ఘనత వైఎస్సార్ సీపీదేనని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీకే కాపు కులస్తులంతా మద్దతు ఇచ్చి అధికారంలోకి తేవాలన్నారు. ఏలూరు ఎంపీ, కైకలూరు ఎమ్మెల్యే అభ్యర్థులు తోట చంద్రశేఖర్, ఉప్పాలను గెలిపిం చాలని కాపు కులస్తులను కోరారు. -
కాపుల రిజర్వేషన్ నివేదిక తొక్కిపెట్టిన చంద్రబాబు
హైదరాబాద్: కాపులకు రిజర్వేషన్ కల్పించే ఉద్దేశంతో ఏర్పాటైన పుట్టిస్వామి కమిషన్ నివేదికను తొక్కిపెట్టింది టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడేనని తూర్పు గోదావరి జిల్లా కాపునాడు జిల్లా అధ్యక్షుడు పురంశెట్టి మంగారావు స్పష్టం చేశారు. కాకినాడలో జరిగిన కాపునాడు సమావేశానికి భారీ ఎత్తున కాపులు హాజరయ్యారు. చంద్రబాబు తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపుల సంక్షేమానికి పాటుపడింది దివంగత నేత వైఎస్సారేనని మంగారావు చెప్పారు. ఇప్పుడు ఆయన కుమారుడు జగన్మోహన్రెడ్డి కూడా కాపులకు సముచిత స్థానం ఇస్తున్నారన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోనే కాపులకు 9 సీట్లిచ్చి గౌరవించారని ఆయన తెలిపారు. అందువల్ల జగన్ గెలుపు కోసం కాపులంతా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తమ బాగోగులు పట్టించుకోని పవన్‌కల్యాణ్ గురించి మాట్లాడటం కూడా దండగని వాళ్లు అభిప్రాయపడుతున్నారు. -
వైఎస్ఆర్ సీపీకి సంపూర్ణ మద్దతు: కాపునాడు
కాపు కులస్థులకు న్యాయం చేసింది దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక్కరే అని ఏపీ కాపునాడు రాష్ట్ర కన్వీనర్ డా.ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో డా.ఎస్. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... కాపు సామాజికవర్గ విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్ ఇచ్చిన ఘనత వైఎస్‌దే అని ఆయన స్పష్టం చేశారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు వైఎస్ఆర్ నిరంతరం పోరాడారని గుర్తు చేశారు. కాపులను అన్ని రంగాల్లో మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని వెంకటేశ్వరరావు అభివర్ణించారు. కాపులకు రిజర్వేషన్‌పై ఏర్పాటు చేసిన జస్టిస్ పుట్టుస్వామి కమిషన్‌ను బుట్టదాఖలు చేసింది చంద్రబాబేనని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ వెంటే కాపు సామాజిక వర్గమంతా ఉంటుందని తెలిపారు. అటు అసెంబ్లీ, ఇటు లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పిస్తే... టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మాత్రం తమ కులస్థులకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. ఏపీలో వైఎస్ఆర్ సీపీకే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎస్. వెంకటేశ్వరరావు తెలిపారు.