ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యం
పులివెందుల : బలిజ కులస్తులందరూ ఐకమత్యంగా ఉండి, అభివృద్ధి సాధించాలని రాష్ట్ర కాపు నాడు అధ్యక్షుడు నారాయణస్వామి రాయల్ తెలిపారు. పట్టణంలోని శ్రీకృష్ణ దేవరాయ బలిజ సంఘం నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక శ్రీకృష్ణదేవరాయ కల్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని ఇతర జిల్లాల బలిజ సంఘ కమిటీ సభ్యులతోపాటు పట్టణంలోని బలిజ సంఘీయులు పాల్గొన్నారు. ఇటీవల శ్రీకృష్ణదేవరాయ బలిజ సంఘ అధ్యక్షునిగా గంగల వీరాంజనేయులును ఎన్నుకున్నారు. ఆయన తన పదవికి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఏర్పాటైన సభలో నారాయణస్వామి మాట్లాడుతూ పులివెందులలో బలిజ సంఘీయుల కోసం నూతన కల్యాణ మండపం ఏర్పాటు చేస్తున్నారని.. దానికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానన్నారు. రాష్ట్రంలోని బలిజ సంఘీయులమందరం శాంతి, సహనంతో తమకు రావాల్సిన హక్కుల కోసం పోరాటం చేద్దామన్నారు. ముఖ్యంగా యువత ఇందులో ఎక్కువగా భాగస్వామ్యం కావాల్సి ఉందన్నారు. రాయలసీమ బలిజ సోదరుల ఐక్య పోరాట సమితి అధ్యక్షుడు రాము మాట్లాడుతూ బలిజలంతా ఐక్యతతో ముందుకెళ్లాలని సూచించారు. రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా అందరూ ఏకమైతే మన హక్కులను సులభంగా సాధించుకొని తీరుతామన్నారు. అనంతరం నూతన అధ్యక్షుడు వీరాంజనేయులు మాట్లాడుతూ తనను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు బలిజ సోదరులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. బలిజ కులస్తుల సాధక బాధలు తీర్చుటకు శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కాపు సమాఖ్య అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు కుమార్, ఆంజనేయకుమార్, వేంపల్లె బలిజ సంఘ అధ్యక్షుడు రెడ్డయ్య, రాష్ట్ర బలిజ సోదరుల ఐక్య పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కృష్ణమూర్తి, రిటైర్డు డీఎస్పీ శివశంకర్, రాష్ట్ర బలిజ సంఘ మాజీ ప్రధాన కార్యదర్శి పత్తి నాగేశ్వరరావు, పులివెందుల మాజీ అధ్యక్షుడు బాలు, రాధాకృష్ణ, నూతన ఉపాధ్యక్షుడు శ్రీరామసుబ్బయ్య, పూల రమేష్, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.