గ్లోబల్ ఫోర్‌కాస్ట్ సిస్టం తుపాను అంచనా చిత్రం
సాక్షి, విశాఖపట్నం/అమరావతి బ్యూరో: కోస్తాంధ్రకు మరో తుపాను ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు వాతావరణ నిపుణులు. ఈ నెల 10వ తేదీన ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఇప్పటికే ప్రకటించింది. ఇది క్రమంగా బలపడి పశ్చిమ వాయవ్య దిశగా దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర వైపు పయనిస్తూ 12వ తేదీన మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. ఆపై మరింత బలపడి ఈ నెల 13, 14 తేదీల్లో తుపానుగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇది తుపానుగా మారితే పూరీ నుంచి మచిలీపట్నం మధ్య ముఖ్యంగా విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల మధ్య ఈ నెల 15న తీరం దాటే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.‘అక్టోబర్ నెల తుపానుల సీజన్. 10వ తేదీన ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది బలపడుతూ దక్షిణ ఒడిశా–ఉత్తర కోస్తాంధ్ర తీరాల వైపు పయనిస్తుంది. తుపానుగా మరే అవకాశాలను పరిశీలిస్తున్నాం. దీనిపై 10 తర్వాత స్పష్టత వస్తుంది’ అని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా చెప్పారు. ‘10న ఏర్పడే అల్పపీడనం తుపానుగా మారేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇది తుపానుగా మారినా, వాయుగుండానికే పరిమితమైనా ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయి’ అని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి ఆర్.మురళీకృష్ణ పేర్కొన్నారు.
చదవండి: (బొగ్గు సంక్షోభంలో భారత్)
ఉధృతంగా ప్రవహిస్తున్న పచ్చార్ల వంక
నేడు వర్షసూచన
మరోవైపు ఆంధ్రప్రదేశ్ తీరాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకూ ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడింది. నైరుతి రుతుపవనాలు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల నుంచి నిష్క్రమించాయి. రాగల రెండు రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని కొన్ని భాగాల నుంచి తిరోగమించనున్నాయని ఐఎండీ వెల్లడించింది. వీటి ప్రభావంతో శనివారం దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శని, ఆదివారాల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నాయి.
చిత్తూరులో కుండపోత
చిత్తూరు అగ్రికల్చర్/పెద్ద దోర్నాల: చిత్తూరు జిల్లాలో గురువారం రాత్రి పలుచోట్ల భారీ వర్షం కురిసింది. అత్యధికంగా పెనుమూరు మండలంలో 176.8 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, మరో ఏడు మండలాల్లో 100 మి.మీ. పైగా వర్షపాతం నమోదైంది. మరోవైపు ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలో శుక్రవారం 10 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
చదవండి: (తగ్గిన వంట నూనెల మంట)
Comments
Please login to add a commentAdd a comment