సాక్షి, అమరావతి: టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారానికి సంబంధించి గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన నారాయణను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నారాయణ విద్యాసంస్థల నుంచే ఈ లీకేజ్ జరిగినట్లు పోలీసులు సైతం నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలో.. తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు చేస్తున్న విమర్శలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి స్పందించారు.
వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొత్తం నారాయణ విద్యాసంస్థల్లోనే ఈ ప్రశ్న పత్రాల మాల్ ప్రాక్టీస్ జరిగిందని అన్నారు. ఇప్పటికే ప్రశ్న పత్రాలు మాల్ ప్రాక్టీస్ కేసులో 60 మందిని అరెస్ట్ చేసినట్లు ఆయన గుర్తు చేశారు. అందులో పూర్తి విచారణ జరిగాకే.. ఇప్పుడు నారాయణను అరెస్ట్ చేశారన్నారు మంత్రి పెద్దిరెడ్డి.
‘ఇందులో ఎలాంటి కక్ష సాధింపు లేదు. విచారణలోనే అంతా తేలింది. వాస్తవాల ఆధారంగానే పోలీసులు అరెస్ట్ చేశారు’ అని స్పష్టం చేశారు. ఇక పొత్తులపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేస్తున్న ప్రకటనలపైనా మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు.
‘‘చంద్రబాబుకి మతిమరుపు వచ్చి రోజుకో మాట మాట్లాడుతున్నాడు. పొత్తులపై మాట్లాడింది ఆయనే, మాట మార్చింది ఆయనే. చంద్రబాబుకి జనం ఎలాగూ తనను గెలిపించరని తెలుసు. అందుకే పొత్తుల కోసం రోజు మాట్లాడుతారు. వైఎస్సార్‌సీపీ మాత్రం ఒంటరిగా పోటీ చేసి మళ్ళీ గెలిచి తీరుతుంద’’ని ధీమా వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి.
చదవండి👉: ఏపీ సీఐడీ అదుపులో మాజీ మంత్రి నారాయణ
Comments
Please login to add a commentAdd a comment