జట్టు కట్టారు.. లాభాల గుట్టు పట్టారు | AP Nellore Young Farmers Earning Profits With Latest Technology | Sakshi
Sakshi News home page

జట్టు కట్టారు.. లాభాల గుట్టు పట్టారు

Published Mon, Jan 23 2023 11:18 AM | Last Updated on Mon, Jan 23 2023 3:25 PM

AP Nellore Young Farmers Earning Profits With Latest Technology - Sakshi

సోలార్‌ డ్రయ్యర్‌లో కొబ్బరి చిప్పలు ఎండబెడుతున్న రైతు

వ్యవసాయ రంగంలో లాభాల గుట్టు పట్టాలన్న ఓ యువరైతు ఆలోచన తోటి రైతులను సైతం జట్టు కట్టేలా చేసింది. ఒక్కొక్కరుగా చేయి కలుపుతూ ఆ రైతులంతా దళారులను తరిమికొట్టి.. సాగులో లాభాల పంట పండిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సాంకేతిక పద్ధతుల్ని అవలంబిస్తూ.. తమకు అవసరమైన సదుపాయాలను తామే సమకూర్చుకుంటున్నారు. పొలం బడుల్లో ప్రగతి దారులు పరుచుకుంటున్న ఆ రైతులను చూడాలంటే.. నెల్లూరు జిల్లా లేగుంటపాడు వెళ్లాల్సిందే..!

సాక్షి, నెల్లూరు:  నెల్లూరు జిల్లా కోవూరు మండలం లేగుంటపాడు గ్రామానికి చెందిన రైతులు 2016లో చేయిచేయి కలిపి సంఘటితమయ్యారు. ఎంబీఏ చదివిన యువరైతు భూపేష్‌రెడ్డితో కలిసి నాబార్డు సహకారంతో రైతు ఉత్పత్తిదారులు సంఘం (ఎఫ్‌పీవో) తరఫున ప్రగతి యువ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తొలుత 20 ఎకరాల పొలంతో 100 మంది రైతులు రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు కాగా.. ఆ తర్వాత కోవూరు మండలంతో పాటు ఇందుకూరుపేట మండలంలోని పల్లెపాడు, జగదేవీపేట, కొత్తూరు, లేబూరు, కొడవలూరు మండలంలోని తలమంచి గ్రామ రైతులు కూడా వారితో జత కలిశారు.

ఇలా దాదాపు 2,500 మంది పండ్లు, పూలు, కూరగాయలు సాగు చేసే రైతులు ఎఫ్‌పీవోలో సభ్యులుగా చేరారు. ఒక్కో సభ్యుడు రూ.100 చొప్పున సభ్యత్వ రుసుం, షేర్‌ క్యాపిటల్‌ రూ.వెయ్యి వంతున చెల్లించి దాదాపు రూ.25 లక్షల వరకు సమకూర్చుకున్నారు. ఆ సొమ్ముతో వసతుల కల్పన దిశగా అడుగులు వేస్తున్నారు. సభ్యుల్లో అత్యధికులు కౌలు రైతులే కావటం విశేషం.   
అల్లికల కోసం అరటి నార తీస్తున్న రైతులు

యంత్రాల బాటపట్టి.. 
ఉద్యాన శాఖ, నాబార్డు ద్వారా సబ్సిడీ రుణం పొంది రవాణా వాహనాన్ని, తూకంలో మోసపోకుండా విద్యుత్‌ తూకం యంత్రాలను, వీడర్లను సమకూర్చుకున్నారు. అంతేకాకుండా కలెక్షన్‌ సెంటర్లు, సోలార్‌ కోల్డ్‌ రూమ్, సోలార్‌ డ్రయ్యర్, పోర్టబుల్‌ కోల్డ్‌ స్టోరేజ్‌ యూనిట్లతోపాటు ఎలక్ట్రిక్‌ వాహనాలను సైతం సమకూర్చుకున్నారు.

సోలార్‌ కోల్డ్‌ రూమ్‌ నిర్మాణానికి దాదాపు రూ.14.5 లక్షల వ్యయం కాగా.. ప్రభుత్వం రూ.11 లక్షల సబ్సిడీ ఇచ్చింది. రైతులకు కొత్త వంగడాలు అందించడం, గిట్టుబాటు ధరకే పంట ఉత్పత్తులు అమ్ముకునేలా అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. ఒకవేళ పంట ఉత్పత్తులకు 
ధర లేకపోయినా కోల్డ్‌ స్టోరేజ్‌లో నిల్వ చేసి ధర వచ్చినప్పుడే మార్కెట్‌కు పంపిస్తున్నారు.  

జేఎల్‌జీ గ్రూపులకు రుణ సదుపాయం 
ఐదుగురు చొప్పున రైతులను జాయింట్‌ లయబిలిటీ గ్రూపులుగా (జేఎల్‌జీ) ఏర్పాటు చేసి అధికారులు వారికి రుణాలు అందేలా సహకారం అందిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 500 గ్రూపులను ఏర్పాటు చేశారు. ఒక్కో గ్రూపునకు రూ.5 లక్షల వరకు పెట్టుబడుల కోసం రుణం మంజూరు చేయిస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులకు గ్రీన్‌హౌస్‌ టెక్నాలజీ అందించేందుకు కృషి జరుగుతోంది. 10 సెంట్ల విస్తీర్ణంలో సైతం రూ.లక్ష వ్యయంతో ఇజ్రాయెల్‌ టెక్నాలజీ ఉపయోగించి పంటల సాగు చేసేలా కృషి చేస్తున్నారు.


పచ్చి మిర్చి గ్రేడింగ్‌ చేస్తున్న రైతులు

విదేశాలకు ఎగుమతులు చేసే లక్ష్యంతో.. 
రైతులకు అన్ని అవసరాలు తీర్చడంతో పాటు రైతులే సొంతంగా మార్కెటింగ్‌ చేసుకునే స్థాయికి చేరుకున్నాం. ఆధునిక పద్ధతులతో సేంద్రియ పంటలు పండించే పరిస్థితి తీసుకొచ్చాం. ప్రభుత్వ సహకారంతో పంట ఉత్పత్తులు నిల్వ చేసుకునేందుకు సోలార్‌ కోల్డ్‌ స్టోరేజ్‌లు, మార్కెటింగ్‌ కోసం వారాంతపు సం­త ఏర్పాటు చేసుకున్నాం. విదేశాలకు ఎగుమతులు చేయాలనే లక్ష్యంతో ఉన్నాం 
– భూపేష్‌రెడ్డి , రైతు ఉత్పత్తిదారుల సంఘ రూపకర్త 

ఆధునిక పద్ధతులతో సాగు  
రైతులంతా ఐకమత్యంతో రైతు ఉత్పత్తిదారుల సంఘంలో చేరాం. మాకు పంటల సాగుపై శిక్షణ కూడా ఇస్తున్నారు. ఆ«ధునిక పద్ధతులతో సాగు చేస్తున్నాం. ఏటా భూసార పరీక్షలు చేయించి అవసరమైన ఎరువులు మాత్రమే వాడుతున్నాం. దీనివల్ల పంటల దిగుబడి పెరిగి వ్యయం తగ్గింది. 
– రాజశేఖర్, యువ రైతు, లేగుంటపాడు
చదవండి: ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్‌లో నవ్వులు పూయించిన తాత.. వీడియో వైరల్..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement