AP New Cabinet Minister Amzath Basha Political Profile And Biography In Telugu, Details Inside - Sakshi
Sakshi News home page

AP Cabinet Minister Amzath Basha: అంజద్‌బాషాను రెండోసారి వరించిన మంత్రిపదవి

Published Mon, Apr 11 2022 7:43 AM | Last Updated on Mon, Apr 11 2022 8:18 AM

AP New Cabinet Minister Amzath Basha Profile YSR Kadapa - Sakshi

పెద్దదర్గాకు చాదర్‌ తీసుకు వస్తున్న  అంజద్‌బాషా

కడప కార్పొరేషన్‌: కడప గడపకు మరోమారు మంత్రి హోదా దక్కింది. సమర్థత, విశ్వాసం, సామాజిక సమతుల్యత నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గంలో కడప ఎమ్మెల్యే ఎస్‌బీ అంజద్‌బాషాకు రెండోసారి అరుదైన అవకాశం లభించింది. ఈయనను మంత్రివర్గంలోకి తీసుకొని ముస్లీం మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అగ్రపీఠం వేశారు. శనివారం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించనున్నారు. కాగా, రాష్ట్ర రాజధానికి ఎమ్మెల్యే అభిమానులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు తరలివెళ్లాయి. 

వ్యాపారవేత్తగా కడప వాసులకు సుపరిచితుడైన అంజద్‌బాషా 2005లో రాజకీయ ఆరంగ్రేటం చేశారు. కాంగ్రెస్‌ కార్పొరేటర్‌గా ప్రారంభమైన ఆయన ప్రస్థానం, వైఎస్‌ కుటుంబాన్ని అనుసరిస్తూ వైఎస్సార్‌సీపీ పార్టీలో క్రియాశీలక భూమిక పోషించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. కడప నియోజకవర్గ సమన్వయకర్తగా ఎంపికై వైఎస్సార్‌సీపీ ఉన్నతికి కృషి చేశారు. అనంతరం 2014లో శాసనసభకు పోటీచేసే అవకాశం దక్కింది. కడప నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనా రాష్ట్రంలో ఆపార్టీ అధికారం చేజేక్కించుకోలేకపోయింది. నిరంతరం ప్రజల పక్షాన నిలిచి, ప్రత్యక్ష పోరాటాల్లో తనవంతు పాత్రను పోషించారు.

ఈనేపథ్యంలో రాష్ట్ర మైనార్టీ సెల్‌ విభాగం అధ్యక్షుడిగా బాధ్యతలు కట్టబెట్టారు. తర్వాత వైఎస్సార్‌సీపీ స్టేట్‌ జనరల్‌ సెక్రెటరీగా ఎంపికయ్యారు. అనంతరం 2019 ఎన్నికల మేనిఫేస్టో కమిటీ మెంబర్‌గా అంజద్‌బాషా నియమితులయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసిన ఆయన మరోమారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించారు. ఆనక ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది. ఆయనకు రెండవసారి మంత్రి పదవి లభించడం పట్ల పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

విధేయుత..విశ్వాసం..సమర్థత
పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్ల విశ్వాసం, ముస్లీం మైనార్టీ వర్గీయుడైనా అత్యంత సమర్థత కల్గిన నాయకుడుగా ఎస్‌బి అంజద్‌బాషా గుర్తింపు దక్కించుకున్నారు. 2014లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాకపోగా, వైఎస్సార్‌ జిల్లాలో ఆ పార్టీని విచ్ఛిన్నం చేయాలనే దిశగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్ని ప్రలోభాలు పెట్టిన అటువైపు మొగ్గు చూపకుండా విశ్వాసంగా ఉండడం, పార్టీ కోసం శక్తికి మించి శ్రమించడం ఇవన్నీ కలిసివచ్చాయని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. పాతవారిని తొలగించి కొత్తవారిని మంత్రులుగా తీసుకుంటారని ప్రచారం సాగినా సామాజిక సమీకరణల నేపథ్యంలో అంజద్‌బాషాను మళ్లీ మంత్రిపదవి వరించిందని పరిశీలకులు భావిస్తున్నారు.  

చేపట్టిన పదవులు
అంజద్‌బాషా మదీనా ఇంజినీరింగ్‌ కళాశాల డైరెక్టర్‌గా,బుఖారియా విద్యాసంస్థ ఉపాధ్యక్షుడిగా, అల్‌ హజ్‌ ఎస్‌బి అబ్దుల్‌ ఖాదర్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీకి, హరూన్‌ ఛారిటబుల్‌ ట్రస్టు, నిర్మలా ఇంగ్లీషు మీడియం స్కూల్‌ అల్యూమిని అసోషియేట్‌లకు అధ్యక్షుడిగా ఉన్నారు. హౌస్‌ మసీదు కమిటీ కోశాధికారిగా, ఏపీ ముస్లిం కౌన్సిల్‌ ఉపాధ్యక్షుడిగా, ఏపీఎస్‌ఆర్‌టీసీలో నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌కు గౌరవాధ్యక్షుడిగా, కడప మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఫైనాన్స్‌ కమిటీ సభ్యుడిగా ఉన్నారు.

2005లో కాంగ్రెస్‌ పార్టీ తరపున కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలుపొందారు. 2012లో వైఎస్సార్‌సీపీ కడప సమన్వయకర్త. 2014లో వైఎస్‌ఆర్‌సీపీ తరుపున పోటీ చేసి 45వేలపైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. 2016లో వైఎస్సార్‌సీపీ మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు. 2018లో జనరల్‌ సెక్రెటరీ,2019 ఎన్నికల మేనిఫెస్టో కమిటీ మెంబర్‌. సార్వత్రిక ఎన్నికల్లో 54వేల  మెజార్టీతో విజయం సాధించారు. 

కుటుంబ నేపథ్యం
కడప జిల్లా సిద్దవటంకు చెందిన జనాబ్‌ ఎస్‌బి హరూన్‌ సాహెబ్‌ 1935 నుంచి 1953 వరకు సుమారు 18 సంవత్సరాలు సిద్దవటం సర్పంచ్‌గా పనిచేశారు. సిద్దవటంలో హరూన్‌ సాహెబ్‌ అందించిన సేవలకు అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వం ఆయన్ను బహదూర్‌ అనే బిరుదుతో సత్కరించింది. హరూన్‌ సాహెబ్‌ కుమారుడైన అబ్దుల్‌ ఖాదర్‌  పెద్ద కుమారుడే ఎస్‌బి అంజద్‌బాషా. 1963లో వారి కుటుంబం వ్యాపార పరమైన సౌకర్యాల కోసం కడప నగరంలో స్థిరపడ్డారు. కడప, కర్నూల్, మహబూబ్‌ నగర్‌ జిల్లాల్లో వీరికి వ్యాపారాలు ఉన్నాయి. నిర్మలా ఇంగ్లీషు మీడియం స్కూలులో ఆయన విద్యాభ్యాసం కొనసాగించారు.

సెయింట్‌ జోసెఫ్స్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియెట్, ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో బీఏ పూర్తి చేశారు. పూర్వీకుల అడుగుజాడల్లో నడుస్తూ క్రమశిక్షణ, అంకిత భావం, కష్టపడే తత్వం, నాయకత్వ లక్షణాలు, సేవాగుణంతో అంజద్‌బాషా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొన్నారు. వీరి సేవా తత్పరతను గుర్తించి ఆనాటి ముఖ్యమంత్రి డా. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. 2005లో కాంగ్రెస్‌ తరపున కార్పొరేటర్‌గా పోటీ చేసే అవకాశం కల్పించారు.  

కడపకు మరో అవకాశం..
కడప ఎమ్మెల్యే అంజద్‌బాషాకు మంత్రిహోదా దక్కడంతో కడప నియోజకవర్గానికి మరోసారి అవకాశం దక్కింది. ఇదివరకు కడప నుంచి ఎమ్మెల్యేగా ఎంపికై మంత్రి హోదా దక్కించుకున్న వారి జాబితాలో అంజద్‌బాషా రెండోసారి  చేరారు. ఎస్‌ రామమునిరెడ్డి(1983), సి రామచంద్రయ్య(1985), డాక్టర్‌ ఎస్‌ఏ ఖలీల్‌బాషా(1999), ఎస్‌ఎండీ అహమ్మదుల్లా (2009), ఇదివరకు మంత్రి పదవులు అలంకరించారు. తాజాగా 2019లో అంజద్‌బాషాకు ఆ హోదా దక్కింది.

ఇప్పుడు మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో  మళ్లీ మంత్రిగా అవకాశం దక్కింది. కడప నుంచి మంత్రి హోదా దక్కించుకున్న వారిలో ఈయన ఐదో ఎమ్మెల్యే కాగా, గడిచిన 3 పర్యాయాలు పరిశీలిస్తే పదేళ్లకు ఓమారు కడప నియోజకవర్గానికి మంత్రి హోదా దక్కుతూ రావడం మరో విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement