
గుంటూరు: ప్రజా ఉద్యమాల్లో సుదీర్ఘ ప్రస్థానం, దళిత సమస్యలపై అలుపెరుగని పోరాటం, అంబేద్కర్ ఆశయాల సాధన దిశగా అడుగులేయడం.. ఇవి గుంటూరు జిల్లాలో మేరుగ నాగార్జున గురించి స్థానికులు చెప్పే మాటలు. దళితుల జీవితాలు చదువులతోనే మారతాయని ప్రతీ చోట చెప్పే మేరుగ నాగార్జున.. పార్టీ ఎజెండాను బలంగా వినిపించగల సత్తా ఉన్న నాయకుడు. స్వయంగా ఉన్నత చదువులు చదివిన మేరుగ నాగార్జున.. రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మైలు రాళ్లు అధిగమించారు. సమస్య వచ్చిందంటే చాలు రాత్రనక, పగలనక ప్రజల్లోకి దూసుకెళ్లే తత్వం ఉన్న మేరుగ నాగార్జున ఇప్పుడు మంత్రిగా తన పరిధిని మరింత విస్తృతం చేసుకోబోతున్నారు.
నేపథ్యం
మేరుగు నాగార్జున జూన్ 15, 1966లో గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామంలో జన్మించాడు. వెల్లటూరులోనే పదో తరగతి వరకు చదివాడు. 1982లో ఇంటర్మీడియట్, 1985లో రేపల్లె లోని ఏబిఆర్ డిగ్రీ కాలేజీలో బీకామ్ పూర్తి చేశారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి 1987లో ఎం.కామ్, 1989లో ఎంఫిల్, 1994లో పి.హెచ్.డి పూర్తి చేశాడు.
ఉద్యమ జీవితం
విద్యార్థి జీవితం నుంచే ఉద్యమాలకు ఆకర్షితుడయిన మేరుగ నాగార్జున.. కాలేజీ రాజకీయాల్లో చైతన్యంగా ఉండేవాడు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు.
రాజకీయ ప్రస్థానం
2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వేమూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ తర్వాత ఎస్సీ & ఎస్టీ కమిషన్‌కు చైర్మన్ గా నియమితుడయ్యారు. 2012లో కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి, ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్ గా పని చేశాడు. గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న వేమూరు నియోజకవర్గం నుంచి 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.
ప్రజా సమస్యలపై పదునైన గళం
దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు వ్యాఖ్యలు చేసినప్పుడు.. కడిగిపారేశారు మేరుగ నాగార్జున. 40 ఏళ్ల అనుభవం దళితులను అవమానించడమేనా అని ప్రశ్నించిన మేరుగ నాగార్జున.. చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసులు పెట్టాలని బలంగా డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment