నాగు పాము నోటిని అదిమిపట్టి విషం కక్కిస్తున్న దృశ్యం
సాక్షి, వెల్దుర్తి (కర్నూలు): పాములోళ్ల నుంచి నాగు పాముల విషాన్ని తులం (10 గ్రాములు) రూ.4 వేలకు కొంటారట. అదే విషాన్ని దళారులు రూ.40 వేలకు అమ్ముతారట. దేశీయ మార్కెట్‌లో లీటరు నాగు పాముల విషం ధర రూ.40 లక్షలట. అంతర్జాతీయ మార్కెట్‌లో ఆ ధర రూ.కోటి పైమాటేనట. అంతటి విలువైన విషాన్ని ప్రాణాలొడ్డి మరీ పాముల నుంచి కక్కించే పాములోళ్లు మాత్రం కూటికి లేని నిరుపేదలే. వెల్దుర్తి వద్ద నాగుపాముల్ని ఒడిసి పట్టి వాటి విషం సేకరించే వారి నుంచి ‘సాక్షి’ సేకరించిన ఆసక్తికర విషయాల్లోకి వెళితే...
విషం తీసేందుకు తెచ్చిన నాగులను చూపుతూ..
నాగుల నుంచే సేకరిస్తారు
కట్ల పింజరి, కట్ల పాము, రాచ నాగు తదితర విషం కలిగిన పాములున్నా.. పాములోళ్లు నాగు పాముల్ని మాత్రమే పట్టుకుంటారు. ఎందుకంటే.. మన రాష్ట్రంలో నాగు పాములు విరివిగా దొరుకుతాయి. సరీసృపాల జాతికి చెందిన ఆడ నాగులు 12 నుంచి 30 వరకు గుడ్లు పెడతాయి. రెండు నెలలు పొదుగుతాయి. అప్పుడే పుట్టిన పిల్ల పాములకు సైతం పూర్తిస్థాయిలో పనిచేసే విషపు గ్రంథులుంటాయి. ఏ వయసు నాగు పామును పట్టినా విషం సేకరించేందుకు అవకాశం ఉంటుంది. నాగు పాము చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. ఇతర పాములకు భిన్నంగా నాగు పాము పడగ విప్పుతుంది.
పాముకాటు వేసినచోట పాము తల నుంచి తీసిన రాయి, నాగమల్లి చెట్టు వేరు
టి పడగ వెనుక వివిధ రంగుల్లో కృష్ణపాదాలు (అండాకార గుర్తుల నడుమ గీత, లోపలి వైపు వివిధ ఆకారాలు) ఆకర్షణీయంగా ఉంటాయి. పాములోళ్ల నాద స్వరానికి అనుగుణంగా (పాములకు చెవులు లేకపోయినా నాదస్వరం కదలికలకు, పాములోడి కాళ్లు భూమిని తడుతుంటే వచ్చే తరంగాలకు) పడగ విప్పి ఆడే నాగు పాముల ఆట చూసేవాళ్లకు హృద్యంగా ఉంటుంది. నాగు పాము విషం సేకరణకు, ప్రదర్శనలతో డబ్బు సంపాదించేందుకు ఉపయోగపడుతుంది. అందువల్లే పాములోళ్లు నాగు పాములను మాత్రమే పడుతుంటారు.
10 నాగుల నుంచి తులం విషం
పాములోళ్లు 10 నాగు పాముల నుంచి తులం విషం సేకరిస్తారు. నాగు తల పైభాగం, దానికి కిందనున్న భాగాన్ని చేతులతో గట్టిగా నొక్కుతూ పాము విషపు గ్రంథులను అదమటం ద్వారా కోరల్లోంచి విషాన్ని కక్కిస్తారు. అలా సేకరించిన విషాన్ని దళారులకు తులం రూ.4 వేలకు కొంచెం అటూఇటుగా అమ్ముకుంటున్నారు. దళారి ఆ విషాన్ని ఏం చేస్తున్నాడు, ఎంతకు అమ్ముకుంటున్నాడన్నది వీరికి పట్టదు. అలా సేకరించిన విషాన్ని దళారులు పది రెట్లు అధిక ధరకు విక్రయిస్తారని తెలుస్తోంది. పాములోళ్లు సేకరించిన విషాన్ని రబ్బరు మూత గల చిన్న గాజు సీసాలో భద్రపరుస్తారు. దళారులు విషాన్ని కొనే సమయంలో దాని నాణ్యతను పరీక్షించి మరీ కొంటున్నారట. దళారులు కోడిని తెచ్చి దానికి చిన్నపాటి గాయం చేస్తారట. పాములోళ్లు సేకరించిన విషాన్ని పిన్నీసు మొనతో గాయమైన కోడికి పూస్తారు. అది అరగంటలో మరణిస్తే నాణ్యమైనదిగా గుర్తిస్తారట. లేదంటే ఆ విషాన్ని కొనరట.
4వ తరగతి చదువుతూ కరోనా పరిస్థితులలో తల్లిదండ్రులకు తోడుగా వచ్చి భిక్షమెత్తుతున్న చరణ్‌తేజ్
అంతర్జాతీయంగా డిమాండ్
పాము విషం మనిషి ప్రాణాల్ని కాపాడటానికి కూడా ఉపయోగపడుతుంది. పాము విషానికి ముఖ్యంగా విదేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. గుండె సంబంధిత వ్యాధులు, రక్త పోటు వంటి రోగాలకు ఉపయోగించే కొన్నిరకాల ఔషధాల్లోనూ పాము విషాన్ని వినియోగిస్తారట. విషానికి విరుగుడుగా వైద్యులు అందించే సూది మందును సైతం స్వల్పశాతం విషం ఉపయోగించే తయారు చేస్తారట.
పాములు పట్టే తల్లిదండ్రులతో పిల్లలు చరణ్‌తేజ్, అమ్ములు, మైల
ఇదే మా జీవనాధారం
మాది ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతం. నంద్యాల బొమ్మల సత్రంలో పదుల కుటుంబాలతో కలిసి ఉంటున్నాం. ఎరుకల జాతికి చెందిన మాకు తాతల కాలం నుంచి నాగుపాములు పట్టడం, వాటినుంచి విషం తీసి అమ్మడమే తెలిసిన విద్య. మా నాన్న బళ్లారి ప్రాంతంలో పాము కాటుతోనే మరణించాడు. ఆ సమయంలో ఆయన వద్ద నాగమల్లి వేరు లేకపోవడమే కారణం. నాగమల్లి వేరు, పాము తల నుంచి సేకరించిన రాయి లేకపోతే మేం కూడా పాములు పట్టలేం. అవే మా ధైర్యం. పాముకాటుకు గురైన వాళ్లు మా వద్దకు వస్తే నాగమల్లి వేరుతో నయం చేస్తుంటాం.
– హనుమంతు (గురునాథం బాబు), పాములు పట్టే వ్యక్తి
Comments
Please login to add a commentAdd a comment