పొదల్లో బుస్.. బుస్
రైతన్నలూ ఆదమరిస్తే ఆపదే
వర్షాకాలంలో పొంచి ఉన్న పాముల బెడద
ఏడాదిలో 227 మంది పాముకాటు బాధితులు
రాయవరం: వర్షాకాలం వచ్చిందంటే చాలు పాముల బెడద ఎక్కువవుతోంది. వాతావరణంలో వేడి తగ్గి భూమి చల్లబడిన సమయంలో విష పురుగులు సహజంగా బయటకు వస్తుంటాయి. ఇలా బయటకు వచ్చిన విషసర్పాలు, పురుగులు రాళ్ల గుట్టలు, దట్టమైన పొదల మాటున ఉంటాయి. పొదలు, అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాల్లో పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయి. అలాగే పొలాల్లోని గడ్డివాములు, గట్ల వెంబడి తిరుగుతుంటాయి. ఇళ్ల పరిసరాలు, పొలాల్లోనూ సంచరించే విష సర్పాలు, తేళ్లు, ఇతర విష కీటకాలతో ప్రమాదం పొంచి ఉంది. వీటి బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. నాగుపాము, కట్లపాము, పొడపాము, రక్తపింజర వంటి వాటివల్లే ప్రమాదం అఽధికంగా ఉంటుంది. సాధారణంగా 50 శాతం పైగా పాముల వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదని వైద్యులు చెబుతున్నారు.
రైతన్నా.. జాగ్రత్త అవసరం
పొలం గట్ల వెంబడి వెళ్లేటప్పుడు కర్ర చప్పుడు చేస్తూ నడవడం మంచిది. రాత్రి పూట పొలాలకు నీరు కట్టడానికి వెళ్లేటప్పుడు టార్చిలైట్లు తీసుకు వెళ్లాలి. ధాన్యపు గాదెలు, గడ్డివాములు ఉండే చోట ఎలుకలు, తడిగా ఉంటే కప్పలు తిరుగుతాయి. వాటిని ఆహారంగా తీసుకునేందుకు పాములు చేరతాయి. అలాగే తేళ్లు, జెర్రెలు వంటి ప్రమాదకర ప్రాణులు సంచరించే అవకాశముంది. ఎక్కువగా పాములు పొదలు, గోడల వారగా చేరతాయి. ప్రజలు చీకట్లో బయటకు వెళ్తే తప్పనిసరిగా చెప్పులు వేసుకోవాలి.
విషసర్పాల కాటు లక్షణాలు
విషసర్పం కాటు వేసిన ప్రదేశంలో పాము కోరల గాయం స్పష్టంగా కనిపిస్తుంది. నొప్పి తీవ్రంగా ఉంటుంది. నొప్పి క్రమంగా పైకి వ్యాపిస్తూ తిమ్మిరిగా అనిపిస్తుంది. పాక్షిక పక్షవాతం కారణంగా నాలుక మందమైనట్లు, గొంతు కండరాలు బిగుసుకున్నట్లు గొంతులో ఏమీ దిగని పరిస్థితి తలెత్తవచ్చు. చొంగ కారవచ్చు. కళ్లు మగతగా, శరీరం మత్తుగా ఉండి స్పృహ కోల్పోవచ్చు. నాగుపాము అత్యంత ప్రమాదకరం. ఇది కాటువేస్తే 15 నిమిషాల్లో విషం ఎక్కుతుంది. ఈ పాము విషం ప్రధానంగా నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఎవరినైనా పాము కరిస్తే అది విష సర్పమో కాదో గుర్తించే ప్రయత్నం చేయాలి. దానివల్ల చికిత్స కచ్చితంగా చేసేందుకు వీలవుతుంది. పాము కాటుకు గురైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందించాలి. నాటు వైద్యం, మంత్రాల జోలికి వెళ్లరాదు. పాముకాటుకు గురైన వారు ఆందోళన చెందితే గుండెపోటు వచ్చే అవకాశముంది.
జిల్లాలో పరిస్థితి ఇదీ
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2022 ఏప్రిల్ నుంచి 2023 జూన్ వరకూ 191 మందికి పాము కాటుకు గురయ్యారు. 2022 జూలైలో అధికంగా 25 మంది, నవంబరులో 24 మంది పాముకాటు బారిన పడ్డారు. 2022 ఏప్రిల్ నుంచి 2023 జూన్ వరకూ 154 మంది పురుషులు, 37 మంది మహిళలు పాముకాటుకు గురైనట్లు వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2023 జూన్ నుంచి ఇప్పటి వరకూ 227 మంది పాటుకాటుకు గురయ్యారు. ఈ బాధితులకు జిల్లా ఆసుపత్రితో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, అర్బన్ హెల్త్‌సెంటర్లు, ఏరియా ఆసుపత్రుల్లో యాంటీ స్నేక్ వీనమ్ మందులు అందుబాటులో ఉంచారు. బాధితులకు ఉచితంగా మందులు వేస్తున్నారు.
వైద్యం ఆలస్యం కారాదు
పాముకాటు వేసిన వారికి ధైర్యం చెప్పి, వెంటనే వైద్యం అందించేందుకు ప్రయత్నించాలి. ముందుగా ప్రథమ చికిత్స చేయాలి. కట్ల, నాగుపాములు కాటువేస్తే నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి బాధితుడు కోమాలోకి వెళ్లే అవకాశముంది. పాముకాటు వేయగానే నిర్లక్ష్యం చేయకుండా సాధ్యమైనంత త్వరగా ప్రథమ చికిత్స చేయించి, ఆసుపత్రిలో చేర్చాలి.
–వి.అనిరుథ్, పీహెచ్‌సీ వైద్యాధికారి, రాయవరం
ఆసుపత్రుల్లో ఉచితంగా మందులు
జిల్లాలోని అన్ని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో యాంటీ స్నేక్ వీనమ్ (పాము కాటు మందులు) అందుబాటులో ఉన్నాయి. మందుల కొరత ఏర్పడితే ఆసుపత్రి అభివృద్ధి కమిటీల ద్వారా మందులు కొనుగోలు చేసుకోవచ్చు. జిల్లాలో ఎక్కడా కొరత లేదు.
–దుర్గారావుదొర, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, అమలాపురం
Comments
Please login to add a commentAdd a comment