సాక్షి, విజయవాడ: అన్నమయ్య జిల్లాలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. పుంగనూరులో చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ శ్రేణులు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, పోలీసులపై దాడులు చేశారు. ఇక, ఎల్లో బ్యాచ్ దాడిలో పదుల సంఖ్యలో పోలీసులు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు.. పోలీసులపై టీడీపీ శ్రేణుల దాడిని పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది.
ఈ సందర్భంగా పోలీసులు అధికారుల సంఘం ప్రతినిధులు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ కార్యకర్తల దాడుల్లో 13 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. పుంగనూరులో టీడీపీ కార్యకర్తల విధ్వంసాన్ని పోలీసులు అరికట్టారు. చంద్రబాబు కావాలనే టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. పుంగనూరులో అనుమతి లేకుండగా టీడీపీ కార్యకర్తలు చొరబడ్డారు. పోలీసులను తీవ్రంగా గాయపరిచారు. ఈ క్రమంలో పోలీసులు సంయమనం కోల్పోతే పుంగనూరులో పరిస్థితి మరోలా ఉండేది. ఇది పోలీసుల చేతకానితనం అనుకుంటే పొరపాటే. ఈ దాడిలో అమాయకులు, సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదనే సంయమనం పాటించాం. పుంగనూరు ఘటనపై ప్రత్యేక బృందం ఏర్పాటు చేయమని డీజీపీని కోరాం. మాకు అధికార పక్షమైనా.. ప్రతిపక్షమైనా ఒక్కటే అని స్పష్టం చేశారు.
విచారణకు డీజీపీ ఆదేశం..
ఇదిలా ఉండగా.. పుంగనూరు ఘటనపై విచారణకు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశించారు. డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ రిషాంత్‌లకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ కార్యకర్తల దాడిలో పోలీసులు గాయపడ్డారని, వాహనాలను సైతం ఉద్దేశపూర్వకంగా తగులపెట్టారని డీజీపీ అన్నారు. రాళ్లు రువ్విన, నిప్పు పెట్టిన వారందరినీ గుర్తించామన్నారు. లా అండ్ ఆర్డర్‌కి విఘాతం కలిగించిన వారందరిపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.
సీసీ కెమెరా పుటేజీని విశ్లేషిస్తున్నాం. ఇప్పటికే అనేక మంది నిందితులను గుర్తించాం. మరికొందరి కదలికలపై నిఘా పెట్టాం. చంద్రబాబు రూట్ ప్లాన్ మార్పు వ్యవహారం కూడా విచారణలో తేలుతుంది. ఈ ఘటన వెనుక ఎవరున్నారో ప్రాథమిక సమాచారం ఉంది. రెచ్చగొట్టే ప్రసంగాలపై కూడా దృష్టి పెట్టాం. శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే సహించేదిలేదన్నారు. ఇక, పుంగనూరు పీఎస్‌లో నిన్న జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 30 మంది టీడీపీ నేతలపై కేసు నమోదైంది. ఐపీపీ 147, 148, 332, 353, 128బీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
ఇది కూడా చదవండి: టీడీపీ రౌడీల దాడి: పోలీసులను పరామర్శించిన మంత్రి పెద్దిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment